పదునెక్కుతున్న కొడవళ్లు.. కలవరంలో గులాబీ..!
విధాత: తెలంగాణ రాష్ట్రంలో ఉనికి కోసం అలుపెరుగని పోరాటాలు సాగిస్తున్న వామపక్ష పార్టీలు మునుగోడు ఉపఎన్నిక రూపంలో టీఆర్ఎస్‌తో కలిసొచ్చిన పొత్తు నీడన మళ్లీ ప్రజాక్షేత్రంలో పూర్వ వైభవం సాధించేందుకు నవనోత్సాహంతో పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా తాము రానున్న సాధారణ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా సీట్లు ఆశిస్తున్నఅసెంబ్లీ స్థానాల్లో బలం పెంచుకునేందుకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎంలు శరవేగంగా అడుగులు వేస్తున్నాయి. జనాకర్షణకు పార్టీ కార్యక్రమాలు ఉధృతం.. అందులో భాగంగా […]

విధాత: తెలంగాణ రాష్ట్రంలో ఉనికి కోసం అలుపెరుగని పోరాటాలు సాగిస్తున్న వామపక్ష పార్టీలు మునుగోడు ఉపఎన్నిక రూపంలో టీఆర్ఎస్‌తో కలిసొచ్చిన పొత్తు నీడన మళ్లీ ప్రజాక్షేత్రంలో పూర్వ వైభవం సాధించేందుకు నవనోత్సాహంతో పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా తాము రానున్న సాధారణ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా సీట్లు ఆశిస్తున్నఅసెంబ్లీ స్థానాల్లో బలం పెంచుకునేందుకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎంలు శరవేగంగా అడుగులు వేస్తున్నాయి.
జనాకర్షణకు పార్టీ కార్యక్రమాలు ఉధృతం..
అందులో భాగంగా నల్గొండ అసెంబ్లీ కేంద్రంలో సీపీఎం పార్టీ తాజాగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రెండో మహాసభలను, పార్టీ అనుబంధ ప్రజానాట్యమండలి నాటకోత్సవాలను నిర్వహించి జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. మరోవైపు మిర్యాలగూడ అసెంబ్లీ కేంద్రంలో సీపీఎం అనుబంధ సంస్థగా భావించే టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఐదో మహాసభలను అంతే స్థాయిలో దిగ్విజయంగా నిర్వహించారు. సీపీఐ పార్టీ సైతం తాము పోటీ చేయదలచిన మునుగోడు, దేవరకొండ, ఆలేరు, కోదాడ స్థానాల్లో పార్టీ కార్యక్రమాలను ఉధృతం చేస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
పార్టీ బలోపేతం దిశగా అడుగులు..
దేవరకొండలో ఇటీవలె ఏఐటీయూసీ జిల్లా మహాసభను జరిపిన సీపీఐ, మూడు రోజులుగా యాదగిరిగుట్టలో ఏఐటీయూసీ రాష్ట్ర మూడో మహాసభలు నిర్వహించించగా ఈ సభలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు హాజరయ్యారు. సీపీఎం, సీపీఐ రెండు కూడా ఒకవైపు పార్టీ సంస్థాగత కార్యక్రమాల నిర్వహణ తో పాటు ఇంకోవైపు ప్రజాక్షేత్రంలో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది.
అందులో భాగంగానే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలపై పోరాటాలను ఉధృతం చేయడం ద్వారా, రాష్ట్ర, స్థానిక సమస్యలపై పోరాటాల నిర్మాణాలతో ప్రజా క్షేత్రంలో జోరు పెంచాయి. రాజకీయ ముందు చూపుతో కామ్రేడ్లు తమ పార్టీల కార్యకలాపాల నిర్వహణలో దూకుడు పెంచిన వైనం.. సహజంగానే ఆయా నియోజకవర్గా లలోని టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో, ఆశావాహుల్లో కలవరపాటును పెంచింది.
నల్లగొండ అంతా గులాబిమయం..
ఇటీవలే మళ్లీ సిట్టింగ్ లకే టికెట్లు అని ప్రకటించిన టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ హామీతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైకి కొంత గంభీరంగా కనిపిస్తున్నప్పటికిని, కామ్రేడ్ల పొత్తు తమలో ఎవరి సీటును ఎగిరేసుకు పోతుందోనన్నబెంగ వారిని నిద్రకు దూరం చేస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఇందులో నల్గొండ, సూర్యపేట, భువనగిరి, ఆలేరు, మిర్యాలగూడ తుంగతుర్తి, కోదాడ, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు లలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నకిరేకల్ లో కాంగ్రెస్ నుంచి గెలిచిన చిరుమర్తి లింగయ్య, దేవరకొండలో సీపీఐ నుంచి గెలిచిన ఆర్.రవీంద్ర కుమార్ టీఆర్ఎస్‌లో చేరిపోయారు.
పీడీస్తున్న కామ్రేడ్లతో టీఆర్ ఎస్ పొత్తు
నాగార్జునసాగర్ లో వచ్చిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానం నిలుపుకోగా, హుజూర్ నగర్, మునుగోడు స్థానాలను కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో ఒకప్పుడు కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నఉమ్మడి నల్గొండ జిల్లా అంతా నేడు గులాబీ కోటగా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా సీపీఐ, సీపీఎం లతో ఏర్పడిన పొత్తులు రానున్న సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్టిట్టింగ్‌లలో ఎవరి సీటుకు ఎసరు పెడుతుందోనన్నఆందోళన అధికార పార్టీ ఎమ్మెల్యేలను పీడిస్తుంది.
కమ్యూనిస్టుల ఉనికికి సవాల్‌గా
గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం పార్టీ బీఎల్ఎఫ్ పేరుతో పోటీ చేసి జిల్లా అంతటా ఓటమి పాలైంది. సీపీఐ పార్టీ కాంగ్రెస్ తో జత కట్టింది. దేవరకొండలో సీపీఐ నుంచి ఆర్.రవీంద్ర కుమార్ ఎమ్మెల్యేగా గెలిచినా టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఈ పరిణామంతో నల్గొండ జిల్లా నుంచి కమ్యూనిస్టులకు శాసనసభ ప్రాతినిధ్యం భాగ్యం దక్కకుండాపోగా, అసెంబ్లీలో ఆ పార్టీల ఉనికి కనుమరుగయింది.
ప్రజల్లో పట్టు కోసం వామపక్షాలు శ్రమిస్తున్నప్పటికీ.. మారిన కాలమాన పరిస్థితుల్లో కొత్తతరం… కార్పొరేట్ విద్యతో కమ్యూనిస్టుల వైపు చూడకపోవడం.. సాంప్రదాయ ఓటర్లు ఖరీదైన ఎన్నికల రణంలో ప్రధాన పార్టీల వైపు మరలిపోవడం వంటి పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టుల ఉనికికి సవాల్‌గా మారాయి.
తోక పార్టీలుగా అప్రతిష్ట పాలయిన వైనం..
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలో వచ్చినప్పటి నుండి కమ్యూనిస్టుల పరిస్థితి నానాటికి తీసి కట్టుగా మారిపోయింది. అధికార పార్టీల ప్రజావ్యతిరేక విధానాలపై ఎన్ని పోరాటాలు చేసినా ఆశించిన ప్రజాదరణ దక్కకపోగా, ప్రజా పోరాటాల నిర్మాణాలకు కావలసిన ఆర్థిక, ప్రజాశక్తులు క్షీణించడం వామపక్షాలను మరింత బలహీనపరిచాయి.
మధ్యలో తెలంగాణలో ఐదు ఉప ఎన్నికలు వచ్చినా సీపీఐ, సీపీఎంలకు పూర్వ వైభవం దిశగా ఊతం అందించలేకపోయాయి. తెలంగాణ రాజకీయాల్లో తోక పార్టీలుగా అప్రతిష్ట మూటగట్టుకొని రాజకీయంగా నామమాత్రమైన ఉభయ కమ్యూనిస్టులకు మునుగోడు ఉపఎన్నికతో కలిసి వచ్చిన టీఆర్ఎస్ పొత్తు కమ్యూనిస్టు పార్టీల బలోపేతానికి సాధనంగా మారింది.
కామ్రేడ్ల ఆశలు నెరవెరేనా..
మాది దేశ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేక సిద్ధాంతమన్నకారణంతో కామ్రేడ్లు మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తో జత కట్టారు. స్థానికంగా తమకున్న బలంతో కారు జైత్రయాత్రకు ఇంధనంగా నిలిచి టీఆర్ఎస్ ను గెలుపు తీరాలకు చేర్చడంలో కమ్యూనిస్టులు విస్మరించలేని భూమిక పోషించారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీఆర్ఎస్ అధినాయకత్వం రానున్న ఎన్నికల్లో సైతం కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు కొనసాగించవచ్చని కామ్రేడ్లు భారీ ఆశలే పెట్టుకున్నారు.
టీఆర్ఎస్‌తో పొత్తులు కొనసాగించాలన్నఆలోచనతో ఉన్న సీపీఎం, సీపీఐలు తాము కోరుకోబోయే అసెంబ్లీ స్థానాల్లో పార్టీల బలోపేతం కోసం ముందస్తు వ్యూహాలతో దూసుకుపోతుండగా.. కామ్రేడ్ల దూకుడు గులాబీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కలవర పెడుతుండటం చర్చనీయాంశంగా మారింది.