పాలమూరులో కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఇరుపార్టీల హోరాహోరీ పోరు

శాసనసభ ఎన్నికల పోరు తార స్థాయికి చేరింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్, బీఆరెస్ సై అంటున్నాయి.

  • By: Somu    latest    Nov 25, 2023 10:32 AM IST
పాలమూరులో కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఇరుపార్టీల హోరాహోరీ పోరు
  • రెండు స్థానాల్లో బీజేపీ బలం
  • మహబూబ్ నగర్ లో 3 పార్టీల బిగ్ ఫైట్
  • నారాయణ పేటలో కాంగ్రెస్ కు ఏకపక్షం
  • దేవరకద్రలో ‘ఆల’కు అభివృద్ధి పనుల అండ
  • జడ్చర్లలో ఉత్కంఠ పోరు


విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: శాసనసభ ఎన్నికల పోరు తార స్థాయికి చేరింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్, బీఆరెస్ సై అంటున్నాయి. 14 నియోజకవర్గాల్లో ఇరుపార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకుంది. ఊరూ, వాడా ఆయా పార్టీల ప్రచారాలు పతాక స్థాయికి చేరాయి. రెండు స్థానాల్లో మాత్రం బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలుపు సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరికొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తూ చుక్కలు చూపిస్తున్నారు. ఐదారు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు కొంత ఊరట లభించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ, ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ప్రచార సరళి పరిశీలిస్తే..


మహబూబ్ నగర్: మూడు ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల పోరు ఉధృతంగా సాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఎవరికి వారు ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. చేసిన అభివృద్ధిని చూసి మళ్ళీ ఆశీర్వదించాలని శ్రీనివాస్ గౌడ్ ఓటర్లను అభ్యర్తిస్తున్నారు.


కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి కొన్ని వర్గాల మద్దతు కూడగట్టడంలో సక్సెస్ అయ్యారన్న చర్చ ఉంది. గత ఎన్నికల్లో దూరమైన వర్గాలు ప్రస్తుతం దగ్గర కావడంతో ఆయన గెలుపుపై ఆశలు రేకేతిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. పార్టీ శ్రేణులు, తన తండ్రి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి రాజకీయ అనుభవం కలిసివస్తోంది. గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు.


దేవరకద్ర: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి మధ్య నువ్వా నేనా అనేలా పోటీ పడుతున్నారు. వాగుల్లో అధిక శాతం చెక్ డ్యామ్ లు నిర్మించి, ఎక్కడికక్కడ నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచడంలో ఆల కృషి ఎంతో ఉంది. సాగునీరు అందించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారన్న అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది.


ఈఅంశాన్నే ఆయన ప్రచారంలో ఎక్కువ ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి ప్రజల్లో ఉండే వ్యక్తిగా పేరుంది. అధికారంలో లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండడంతో ఆయన గెలుపుపై ప్రభావం ఉoటుందనే ధీమాలో ఉన్నారు. పాలమూరు డీసీసీ అధ్యక్షులుగా ఉండడం కూడా ఈ ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుందని పార్టీ శ్రేణులు అంటున్నారు. ఇక్కడ బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు.


మక్తల్: కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరికి రోజురోజుకూ మద్దతు పెరుగుతోందని ఆపార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి ఈప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే ప్రచారాస్త్రంగా శ్రీహరి ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. బీజేపీ అభ్యర్థి జలంధర్ రెడ్డి కూడా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.


నారాయణ పేట: కాంగ్రెస్ పార్టీకి వార్ వన్ సైడ్ గా గాలి వీస్తోందని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్ణిక రెడ్డికి ఊహించని విధంగా జన బలం పెరిగిందని చెబుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కుంభం శివకుమార్ రెడ్డి అండతో పర్ణిక ప్రచారంలో ముందున్నారు. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డి హయాంలో నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో వెనుకబడిందని, ఆయన వ్యవహారశైలిపై పలు విమర్శలున్నాయి. ఎమ్మెల్యే తీరుపైనే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టి ఓటర్లను ఆకట్టుకుంటోంది.


జడ్చర్ల: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి ఎమ్మెల్యే గా లక్ష్మా రెడ్డికి చరిత్ర ఉంది. పదవులు ముఖ్యం కాదని, రాష్ట్రo ముఖ్యమనే విషయం తెలిపిన ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి… ప్రస్తుత ఎన్నికల్లో ఈ అంశం ప్రధానంగా తెరపైకి తెచ్చారు. గెలుపు సునాయాసమేనని ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్ రెడ్డి మొదటిసారి అసెంబ్లీ బరిలో నిలిచారు. ప్రజా బలం కూడగట్టి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఉదేశంతో ప్రచారంలో దుసుకుపోతున్నారు. ఇక్కడ బీజేపీ నామమాత్రంగానే పోటీలో ఉందని చెబుతున్నారు.


నాగర్ కర్నూల్: బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అవినీతికి దూరంగా ఉండడంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆపార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి.. తన తండ్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి అండతో రాజకీయ ప్రవేశం చేశారు. ఆయన ప్రధానంగా యువత ఓట్లపైనే దృష్టి పెట్టి, ఆకట్టుకునే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల రణరంగంలో మర్రిని ఢీకొట్టాలంటే అంత సులువు కాదని ఇక్కడి జనం అంటున్నారు.


అచ్చంపేట: కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని శక్తిగా జన బలం పెరిగిందని ఆపార్టీ ఉత్సాహంతో పరుగెత్తుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ ప్రచారంలో ముందున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిస్థితి ఆధ్వానంగా మారిందన్న చర్చ జరుగుతోంది. ఇక్కడ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు లేకున్నా, గువ్వల తీరుపైనే విమర్శలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో గువ్వల ప్రవర్తనతో విసుగు చెందిన జనం కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


వనపర్తి: మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డికి మొదటగా తిరుగులేదని ఆ పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నా రెడ్డిని మార్చి మేఘా రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలకు నిద్ర కూడా పట్టడం లేదని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ నెలకుంది.


అలంపూర్: కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతోందని ఆపార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు మొదటగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించి, చివరి నిమిషంలో విజయ్ కు టికెట్ ఇచ్చింది. మనస్తాపానికి గురైన అబ్రహం కాంగ్రెస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ కు మరింత బలం చేకూరింది.


గద్వాల: బీఆర్ఎస్ తొలుత కొంత బలహీనపడినా ప్రస్తుతం మళ్ళీ పుంజుకుందని చర్చ నడుస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి అన్ని వర్గాలు మద్దతుగా నిలబడ్డాయని చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న సరిత మొదటగా పుంజుకున్నా, ఆమె వర్గం నేత విజయకుమార్ టికెట్ ఆశించి రాకపోవడంతో పార్టీని వీడారు. వెంటనే ఆయన బీఆర్ఎస్ లో చేరారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు పెరిగింది.


కొల్లాపూర్: ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డికి మొదట వ్యతిరేక పవనాలు వీచినా, రోజురోజుకూ జనం నుంచి సానుకూలత లభిస్తోందని చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు కు ప్రచార ప్రారంభంలో ఊపు వచ్చినా, రానురాను ప్రచారంలో వెనుకబడినట్లు కన్పిస్తోంది.


కల్వకుర్తి: ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరిస్థితి అధ్వానంగా ఉందని, ఆయన ప్రచారం అంతంత మాత్రంగానే ఉందని స్థానికుల్లో అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డికి ప్రజల మద్దతు భారీగా లభించిందని ఆపార్టీ శ్రేణులు ఉత్సాహంలో ఉన్నారు. ఆయన గెలుపు సులువుగానే ఉంటుందని ఇక్కడి ప్రజలు అంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఆచారి కూడా ప్రజా బలం ఉన్న నేత కావడంతో కాంగ్రెస్ కు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


షాద్ నగర్: కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ జనం మద్దతుతో ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ కాస్త వెనుకబడినట్లు చర్చ జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి అందే బాబాయ్య తన ఎన్నికల ప్రచారంలో తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


కొడంగల్: కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి జనం మద్దతు భారీగా లభిస్తోంది. ఇక్కడ వార్ వన్ సైడ్ అనేవిధంగా ఉంది. ఊరూరా కాంగ్రెస్ జెండాలే కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే ఆరోపణలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నేతలు గెలుపు కోసం కాకుండా రాష్ట్రoలోనే అత్యంత మెజారిటీ ఉండాలనే తపనతో పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.