అక్క‌డ కుక్క‌కు పూజ‌లు.. 100 ఏండ్ల నుంచి ఎందుకు పూజిస్తున్నారంటే..?

కుక్క‌లు అన‌గానే చాలా మందికి భ‌య‌మేస్తోంది. వాటిని చూస్తేనే చాలా మంది అస్య‌హించుకుంటారు. కానీ విశ్వాసానికి మారు పేరు

  • By: Somu    latest    Dec 06, 2023 10:28 AM IST
అక్క‌డ కుక్క‌కు పూజ‌లు.. 100 ఏండ్ల నుంచి ఎందుకు పూజిస్తున్నారంటే..?

ల‌క్నో : కుక్క‌లు అన‌గానే చాలా మందికి భ‌య‌మేస్తోంది. వాటిని చూస్తేనే చాలా మంది అస్య‌హించుకుంటారు. కానీ విశ్వాసానికి మారు పేరు. అలాంటి కుక్కకు వ‌దేండ్ల నుంచి పూజ‌లు చేస్తున్నారు. ఆ శున‌కం విగ్ర‌హం పాదాల‌కు న‌ల్ల‌దారం క‌ట్టి ఏదైనా కోరుకుంటే అది జ‌రిగి తీరుతుంద‌ని స్థానికులు బ‌లంగా న‌మ్ముతున్నారు. మ‌రి ఆ కుక్క గురించి తెలుసుకోవాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వెళ్ల‌క త‌ప్ప‌దు.


ఉత్తర్‌ప్రదేశ్‌లోగల ఒక బైరవుని ఆలయం అది. ఆ ఆలయంలోని శునకం విగ్రహాన్ని పూజించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. దాదాపు 100 సంవత్సరాల క్రితం సికందరాబాద్‌లో బాబా లటూరియా అనే ఒక గురువు ఉండేవారు. శుభ‌కార్యాలు, ఇత‌ర మంచి చెడు గురించి తెలుసుకునేందుకు ఆయ‌న వ‌ద్ద‌కు చాలా మంది వ‌స్తుండేవారు. ఈ క్రమంలోనే ఆయన ఆ ప్రాంతంలో ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఒక కుక్క‌ను కూడా పెంచుకున్నారు. దాన్ని సొంత బిడ్డ‌లా చూసుకున్నార‌య‌న‌. ఆ శున‌కాన్ని బైర‌వ్ బాబా అని పిలిచేవారు.


అయితే, తన చివరి రోజుల్లో బాబా లటూరియా తాను నిర్మించుకున్న గుడిలోనే సజీవ సమాధికి సిద్ధమయ్యారు. బాబా సమాధిలోకి వెళ్లిన తర్వాత ఆయన భక్తులు దాన్ని మూసివేస్తుండగా బైరవ్ త‌న య‌జ‌మాని వ‌ద్ద‌కు వెళ్లేందుకు య‌త్నించింది. వెంటనే బాబా భక్తులు దాన్ని బయటికి తీసి సమాధిని మూసేశారు. కానీ, ఆ తర్వాత కాసేపటికే బైరవ్‌ మరణించింది. దాంతో బైరవ్‌కు గుర్తుగా ఆ ఆలయంలో ఓ విగ్రహాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు. ఏటా హోలీ, దీపావళి పండుగలకు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళ, శనివారాల్లో బైరవ్‌ దర్శనానికి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.