ప్రత్యామ్నాయం BJP అంటే ప్రజలు నమ్ముతారా?
ఉన్నమాట: బూర నర్సయ్య పార్టీని వీడిన తర్వాత కేసీఆర్ వ్యూహం మార్చి దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్, బూడిద భిక్షమయ్య లాంటి వాళ్ళు టీఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చి బీజేపీని ఆత్మరక్షణలో పడేశారు. మునుగోడు ఫలితం తర్వాత బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని బీరాలు పలికిన బండి సంజయ్ లాంటి వాళ్లకు ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అయితే ఆ పార్టీ నేతలు ఇప్పుడు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోపల గుబులు మొదలైనట్టు కనిపిస్తున్నది. ఉప ఎన్నిక ఫలితం […]

ఉన్నమాట: బూర నర్సయ్య పార్టీని వీడిన తర్వాత కేసీఆర్ వ్యూహం మార్చి దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్, బూడిద భిక్షమయ్య లాంటి వాళ్ళు టీఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చి బీజేపీని ఆత్మరక్షణలో పడేశారు. మునుగోడు ఫలితం తర్వాత బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని బీరాలు పలికిన బండి సంజయ్ లాంటి వాళ్లకు ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
అయితే ఆ పార్టీ నేతలు ఇప్పుడు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ లోపల గుబులు మొదలైనట్టు కనిపిస్తున్నది. ఉప ఎన్నిక ఫలితం కమలం పార్టీకి మింగుడు పడటం లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే మునుగోడులో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి అంగ బలం, అర్థ బలం ఉన్న వ్యక్తి. ఎంపీగా, ఎమ్మెల్సీగా, మూడున్నర ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి.
ఆయన సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ స్థానంలోనే మునుగోడు ఉన్నది. ఆయన కూడా పరోక్షంగా రాజగోపాల్ గెలవాలని బహిరంగంగానే కోరుకుని మద్దతు ఇచ్చారు కూడా. ఇన్ని చేసినా మునుగోడులో కమలం వికసించలేదు. పైగా తమ ఓటమికి కమ్యూనిస్టులు కారణం అనే ప్రచారం మొదలు పెట్టారు. వాస్తవానికి బీజేపీ అనుసరిస్తున్న విద్వేష రాజకీయాలను అడ్డుకోవడానికి వాళ్ళు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చారు.
మునుగోడు విజయంలో వామపక్షాల పాత్ర కీలకమని అధికార పార్టీ కూడా అంగీకరించింది. కానీ బీజేపీ ఓటమికి బాధ్యత అటు బండి సంజయ్ గానీ, ఆ ఎన్నికకు ఇన్‌ఛార్జీగా వ్యవహరించిన వివేక్ గానీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గానీ, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌ఛుగ్ ఎవరూ తీసుకోలేదు. కానీ ఆ నెపాన్ని కమ్యూనిస్టులపై, కాంగ్రెస్ తెచ్చుకున్న ఓట్ల పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీకి తెలంగాణలో ఉన్న బలం ఎంతో?
అంతెందుకు కారును పోలిన గుర్తులకు వచ్చిన ఓట్లు 5 వేలకు పైనే. కారును పోలిన గుర్తులతో తమకు నష్టం జరుగుతుంది అని టీఆర్‌ఎస్ న్యాయ పోరాటం చేసినా ఫలితం లేదు. అయినా ఆ సమస్యను కూడా అధిగమించి పది వేలకు పైగా మెజార్టీ సాధించింది. ఓటమి హుందాగా అంగీకరించని బీజేపీ నేతలు రాష్ట్రంలో టీఆర్‌ఎస్కు ప్రత్యామ్నాయం మేమే అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు?.
-ఆసరి రాజు