BRS రాష్ట్ర కార్యదర్శిని.. కేటీఆర్ పర్యటనకు ఆహ్వానం కూడా పంపలే: చాడ కిషన్ రెడ్డి

  • By: Somu    latest    Oct 02, 2023 12:49 PM IST
BRS రాష్ట్ర కార్యదర్శిని.. కేటీఆర్ పర్యటనకు ఆహ్వానం కూడా పంపలే: చాడ కిషన్ రెడ్డి
  • కేటీఆర్ పర్యటనలో బయటపడ్డ విభేదాలు
  • భూపాల్ రెడ్డికి టికెట్ ఇస్తే ఓడిస్తాం
  • అభ్యర్థిత్వంపై అధిష్టానం పునరాలోచించాలి
  • రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్గొండ అధికార బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లాకేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అసమ్మతి రాజుకుంది. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు.


ఆ పార్టీ కౌన్సిలర్ పిల్లి రామరాజు సంచలన వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవకముందే, ఎమ్మెల్యే వైఖరిని తప్పుపడుతూ మరిన్ని గళాలు తెరపైకి వస్తున్నాయి. 23 ఏళ్లుగా ఉద్యమాలు చేసిన నాయకులను కూడా ఎమ్మెల్యే పక్కకు పెడుతున్నాడని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి తాజాగా మీడియా ఎదుట వాపోయారు.


సోమవారం గాంధీ జయంతి సందర్భంగా నివాళి అర్పించి మీడియాతో మాట్లాడిన ఆయన, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. టికెట్ ఇస్తే ఓడించేందుకు సొంత పార్టీ నాయకుల సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం కంచర్ల భూపాల్ రెడ్డి టికెట్ విషయంలో పునరాలోచించాలని కోరారు. 23 సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన పార్టీ నాయకత్వాన్ని కంచర్ల పట్టించుకోవడంలేదని ఆరోపించారు.


ఉద్యమ నాయకుడు కానప్పటికీ అధిష్టానం సూచన మేరకు గత ఎన్నికల్లో భూపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే, కనీసం గడిచిన నాలుగున్నరేళ్లలో ఏనాడు కూడా ఉద్యమకారులను, సీనియర్లను కానీ గౌరవించలేదని ధ్వజమెత్తారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులపై కక్ష సాధింపు చర్యలు, బెదిరింపులకు పాల్పడిన భూపాల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని రాబోవు ఎన్నికల్లో మార్చాలని సూచించారు.


కనీసం ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కూడా ఉద్యమకారులకు, వారి కుటుంబ సభ్యులకు కేటాయించకపోవడం ఎమ్మెల్యే దుర్మార్గానికి నిదర్శనమన్నారు. ఇప్పటికే ఎంతోమంది ఇతర పార్టీల వైపు చూస్తున్నారని, రాబోవు రోజుల్లో భూపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా నిలబెడితే ఓడించేందుకు, ఆయనకు వ్యతిరేకంగా పనిచేసేందుకు ఎంతోమంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు.


అందరినీ కలుపుకుపోయే ఏ నాయకునికి టికెట్ ఇచ్చినా పార్టీ గెలుస్తుంది కానీ భూపాల్ రెడ్డికి ఇస్తే చిత్తుగా ఓడిపోతుందని చెప్పారు.   పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్లకు, ఉద్యమకారులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయని, ఇంతటి అవమానాన్ని భరించలేక పోతున్నామని ఆవేదన చెందారు.



పోస్టర్లనూ తొలగించారు..


బీఆరెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తనకు సంబంధించిన వాల్ రేటింగ్స్ పోస్టర్లను సైతం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తన అనుచరులు, మున్సిపల్ సిబ్బందితో తొలగింప చేయటం ఎంతో బాధ కలిగించిందని చాడ కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పోస్టర్లు వేయిస్తే, వాటిని కూడా తీసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.


తన అనుచరులు ఎవరైనా సంక్షేమ పథకాలపై దరఖాస్తు చేసుకుంటే కిషన్ రెడ్డి వర్గం అని ముద్ర వేసి కనీసం ఏ ఒక్కరికీ న్యాయం చేయకపోవడం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ నల్గొండ అభ్యర్థి విషయంలో పునరాలోచించాలని కోరారు.