Ponguleti and Jupally | ప్రజల అభీష్టం మేరకే కాంగ్రెస్‌లోకి: పొంగులేటి, జూపల్లి

ఉద్యమ ఆకాంక్షల సాధన కాంగ్రెస్‌తోనే కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం 80శాతం ప్రజలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా.. ఢిల్లీలో పొంగులేటి, జూపల్లి వెల్లడి మల్లికార్జున ఖర్గే, రాహుల్‌తో భేటీ జూలై 2న ఉమ్మడి ఖమ్మంలో సభ 14 లేదా 16న పాలమూరులో సభ విధాత: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం తెలంగాణ వచ్చాక దక్కలేదని బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు (Ponguleti and Jupally) అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే […]

Ponguleti and Jupally | ప్రజల అభీష్టం మేరకే కాంగ్రెస్‌లోకి: పొంగులేటి, జూపల్లి
  • ఉద్యమ ఆకాంక్షల సాధన కాంగ్రెస్‌తోనే
  • కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం
  • 80శాతం ప్రజలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా..
  • ఢిల్లీలో పొంగులేటి, జూపల్లి వెల్లడి
  • మల్లికార్జున ఖర్గే, రాహుల్‌తో భేటీ
  • జూలై 2న ఉమ్మడి ఖమ్మంలో సభ
  • 14 లేదా 16న పాలమూరులో సభ

విధాత: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం తెలంగాణ వచ్చాక దక్కలేదని బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు (Ponguleti and Jupally) అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయని స్పష్టం చేశారు.

అవినీతి, మోసపూరిత, కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే లక్ష్య సాధనకే తాము కాంగ్రెస్‌లో చేరుతున్నామని ప్రకటించారు. తాము చేయించిన సర్వేలలో సుమారు 80శాతం మంది ప్రజలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారని వివరించారు. ప్రజల అభీష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

జూలై 2న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాహుల్‌ గాంధీ పాల్గొనే సభలో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకగాంధీతో వారు సమావేశమయ్యారు.

అనంతరం మీడియాతో పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో తమకు పదవులు ఇవ్వలేదనో, అవమానించారనో తాము కాంగ్రెస్‌లోకి రావడం లేదని, తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను విస్మరించి, అవినీతితో కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్‌ నుంచి తెలంగాణ విముక్తి కోసం, ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్‌లో చేరుతున్నామని వివరించారు.

రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటించి ఆత్మీయ సమ్మేళనాలను, సర్వేలను నిర్వహించామని, మేధావులు, కవులు, ఉద్యమకారులను, అన్ని వర్గాల ప్రజలను కలిశామని చెపారు. తెలంగాణ బిడ్డలందరి మనసులో ఉన్న కోరికను గమనించే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.