తెలంగాణలో తీవ్రమవుతున్న కరెంటు కోతలు.. రోడ్డెక్కుతున్న రైతులు
బకాయిలు చెల్లించలేక- కొనుగోళ్లు తగ్గించిన సర్కారు వ్యవసాయానికి 8 గంటలే దిక్కు- అది కూడ వంతుల వారీగా సింగిల్ ఫేస్ కరెంటుతో కాలిపోతున్న మోటార్లు విధాత: తెలంగాణ రైతాంగాన్ని కరెంటు కోతలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటు వంటి పరిస్థితులు నేడు తిరిగి ఎదుర్కొంటున్నామని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం రైతులు రోడెక్కి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. వచ్చిరాని కరెంటుతో తమ పంట పొలాలే ఎలా కాపాడుకోవాలో అర్థం […]

- బకాయిలు చెల్లించలేక- కొనుగోళ్లు తగ్గించిన సర్కారు
- వ్యవసాయానికి 8 గంటలే దిక్కు- అది కూడ వంతుల వారీగా
- సింగిల్ ఫేస్ కరెంటుతో కాలిపోతున్న మోటార్లు
విధాత: తెలంగాణ రైతాంగాన్ని కరెంటు కోతలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటు వంటి పరిస్థితులు నేడు తిరిగి ఎదుర్కొంటున్నామని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం రైతులు రోడెక్కి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. వచ్చిరాని కరెంటుతో తమ పంట పొలాలే ఎలా కాపాడుకోవాలో అర్థం కాక రైతులు కలత చెందుతున్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు కావాల్సిన త్రీ ఫేస్ కరెంటును రెండు మూడు విడతల్లో కేవలం 8 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారని, మిగిలిన సమయంలో సింగిల్ ఫేస్ కరెంటు మాత్రమే ఇస్తున్నారని రైతులు చెపుతున్నారు. సింగిల్ ఫేస్ కరెంటు సరఫరా కారణంగా తమ మోటర్లు కాలి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరెంటు సరఫరా తగ్గడం వల్లనే అప్రకటిత కరెంటు కోతలు అమలవుతున్నాయన్న విమర్శలు వెలువడుతున్నాయి. విద్యుత్ సంస్థలు రూ. 50 వేల కోట్ల నష్టాల్లో కూరుకు పోయాయి. ఈ నిధులను సర్కారు సమకూర్చకపోవడం వల్ల విద్యుత్ కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని విద్యుత్ రంగ నిపుణులు చెపుతున్నారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ సంస్థల నష్టాలు రూ. 9 వేల కోట్లు ఉండగా తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ 9 ఏళ్ల కాలంలో రూ. 50 వేల కోట్లకు చేరుకున్నాయి.
విద్యుత్ సంస్థల నష్టాలు వేల కోట్లకు పేరుకు పోవడంతో రాష్ట్రానికి సరిపడా విద్యుత్‌ను కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని విద్యుత్ రంగ నిపుణులు చెపుతున్నారు. ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న సర్కారు ఆమేరకు సబ్సిడీ నిధులను విద్యుత్ సంస్థలకు అందించకపోవడంతో నష్టాలు చవిచూస్తున్నాయని చెపుతున్నారు.
చత్తీస్ ఘడ్ రాష్ర్టం నుంచి వేయి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న సర్కారు ఆ మేరకు చెల్లింపులు చేయకపోవడంతో విద్యుత్ సరఫరాను చత్తీస్‌ఘడ్ సర్కారు నిలిపివేసింది. కొనుగోలు చేయడానికి విద్యుత్ అందుబాటులో ఉన్నా సర్కారు నిధులు కేటాయించక పోవడం వల్లనే విద్యుత్ కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెపుతున్నారు.
కావాల్సినంత విద్యుత్ సరఫరా లేక పోవడంతో తెలంగాణలో కరెంటు కోతలు అనివార్యం అయినట్లు అధికారులు తమకు చెపుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 8 గంటలు కూడ విద్యుత్ రావండ లేదని వాపోతున్నారు.
24 గంటలు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామని చెప్పిన సర్కారు.. ఇప్పుడు 8 గంటలు కూడ సరిగ్గా ఇవ్వడం లేదంటున్నారు. దీంతో పంటలన్నీ ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమి లేక రైతులు రోడ్లపైకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది అత్మహత్యాయత్నాలు చేసుకుంటున్నారు.
నేటి నుంచి.. 24 గంటల విద్యుత్ పునరుద్ధరణ: మంత్రి జి.జగదీష్ రెడ్డి
ఐదారు గంటలు కూడా రావడం లేదు
సీఎం కేసీఆర్ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ వాస్తవంగా తమకు ఐదారు గంటలు కూడా రావడం లేదని నిన్న, ఈరోజు మూడు నాలుగు గంటలు మాత్రమే ఇచ్చారని, తమ పంటలు ఎండి పోతుండటంతో సబ్ స్టేషన్ వద్దకు రాగా, అధికారులు తమబాధ పట్టించుకోకుండా పోలీసులను పిలిపించి ఇక్కడ నుండి తరిమేస్తున్నారు.
కరెంటు కోతల విషయం ముందుగానే చెబితే ఆ మేరకు రైతులు తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసే వారం. వరి సాగు రైతులతో పాటు బత్తాయి వంటి తోటల రైతులు కరెంటు కోతలతో నష్టపోయే అవకాశం ఉంది.
-రైతు పాటి వెంకట్ రెడ్డి, నకిరేకల్(కడపర్తి)
కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు
సర్దేన గ్రామ సబ్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ 8గంటలు మాత్రమే 3ఫేస్ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అది కూడా ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియనీ పరిస్ఠితి నెలకొంది. దీంతో పంటపొలాలు ఎండి పోతున్నాయి. దఫాదఫాలుగా 7 నుంచి 8 గంటల లోపే విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
– బోయిని రాజు, రైతు, జక్కన్నపెట్, హవేలీ, ఘనపూర్ మండలం
3,4 రోజుల్లో అంతా సెట్ అవుద్ది
విద్యుత్ సరఫరాలో 3 రోజుల నుంచి అంతరాయం కలుగుతున్నది, ఉదయం నుంచి సాయంత్రం వరకు 4 గంటల విద్యుత్ ఇస్తున్నాం. రాత్రి పూట 9 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు 3 ఫేస్ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. యాదాద్రి, కొత్తగూడెం విద్యుత్ ప్లాంట్లలో విద్యుత్ సరఫరాలో అంతరాయం వళ్ల 3 రోజుల నుంచి విద్యుత్ సరఫరాలో కోతలు ఉన్నాయని 3,4, రోజుల్లో అంతా సెట అవుతుందని స్పష్టం చేశారు. – మెదక్ విద్యుత్ శాఖ ఏడీ మోహన్ బాబు