తెలంగాణలో బీఆరెస్ ఉనికి కోల్పోతుంది

తెలంగాణలో బీఆరెస్‌ ఉనికి లేకుండా పోయే పరిస్థితి నెలకొందని స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి

  • By: Somu    latest    Mar 04, 2024 12:57 PM IST
తెలంగాణలో బీఆరెస్ ఉనికి కోల్పోతుంది
  • బీజేపీ బలపడుతుంది
  • ఏపీలో వైసీపీకి భారీ పరాజయమే
  • వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు


విధాత, హైదరాబాద్ : తెలంగాణలో బీఆరెస్‌ ఉనికి లేకుండా పోయే పరిస్థితి నెలకొందని స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంటర్వ్యూలో ఆయన తెలంగాణ, ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందని, తాను బీఆరెస్‌ కార్యకర్తను అయి ఉంటే పార్టీ ప్రస్తుత పరిస్థితిపై ఖచ్చితంగా ఆందోళన చెందే వాడినన్నారు.


బీజేపీ పుంజుకుంటే బీఆరెస్ ఉనికే ప్రమాదంలో పడుతుందని ఇప్పుడు అదే జరుగుతుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తరువాత బీఆరెస్‌ ఉనికి కష్టమేనంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడి పదేళ్లు అధికారంలో ఉన్న బీఆరెస్‌ రాష్ట్రంలో ఉనికి లేకుండా పోయే పరిస్థితి వస్తుందని పీకే చెప్పడం పోలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశమైంది. ఏపీలోనూ వైసీపీ అధికారం కోల్పోతుందని పీకే చెప్పారు. ఆ పార్టీకి ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురుకానుందని జోస్యం చెప్పారు.


ఏపీ ప్రజలు ఉచిత పథకాల కంటే అభివృద్ధికి పట్టం కడతారని పీకే అభిప్రాయపడ్డారు. బీఆరెస్ అధినేత చంద్రశేఖర రావును ఏపీ సీఎం జగన్ ఫాలో అవుతున్నారని, తెలంగాణలో కేసీఆర్‌కు ఎదురైన పరాభవమే ఆంధ్రలో జగన్‌కు ఎదురవుతుందని చెప్పారు. ఉచిత పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు పంచి ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం మూర్ఖత్వం అన్నారు.


ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీకి నెల రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పీకే చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. కాగా గత ఏపీ అసెంబ్లీ ప్రశాంత్‌ కిషోర్ వైసీపీ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ప్రస్తుతం ఆయన స్ట్రాటజిస్టు బాధ్యతలకు దూరంగా ఉంటూ బీహార్‌లో ఓ పార్టీని స్థాపించి రాజకీయాల్లో మునిగారు. అయితే టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కోరిక మేరకు ఆయనకు సలహాదారుగా వ్యవహారిస్తున్నారు.