కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లింది: ప్రియాంక గాంధీ
సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయిందని(ఎక్స్‌పైరీ డేట్), తెలంగాణలో మార్పు కోసం కాంగ్రెస్ రావాలని అందుకు భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు

- కాంగ్రెస్ పాలనతోనే ప్రజల ఆకాంక్షలు సాకారం
- అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల హామీలు
- పాలకుర్తి ప్రచార సభలో ప్రియాంక గాంధీ
విధాత, వరంగల్ బ్యూరో : సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయిందని(ఎక్స్‌పైరీ డేట్), తెలంగాణలో మార్పు కోసం కాంగ్రెస్ రావాలని అందుకు భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.
శుక్రవారం పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్తి మామిండ్ల యశస్విని రెడ్డి ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను, ఎన్నికల హామీలను విస్మరించిందని, కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు.
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవైపు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన యువత కోసం పోరాడుతున్న కాంగ్రెస్, ఇంకోవైపు తెలంగాణను పదేళ్లుగా దోచుకున్న బీఆరెస్ ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర పురోగతికి, అమరుల ఆకాంక్షల సాధనకు ప్రజలు తమ విలువైన ఓటును కాంగ్రెస్‌కు వేయాలన్నారు. త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులు, దళిత, గిరిజనుల జీవితాలు మరింత దుర్భరంగా మారయన్నారు.
జాబ్ క్యాలెండర్‌తో ఉద్యోగాలు
కష్టపడి ఉద్యోగాల కోసం సిద్ధమైతే పేపర్ల లీకేజీలతో నిరుద్యోగ యువత బతుకులు ఆగమైపోగా, నిరుద్యోగులు ఆత్మహత్యల పాలవుతున్నారన్నారు. దేశంలోనే తెలంగాణ నిరుద్యోగంలో నెంబర్ వన్‌గా తయారైందన్నారు. పరీక్ష పేపర్ లీకేజీతో యువతి ఆత్మహత్య చేసుకుంటే దానిని అపహాస్యం చేశారన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం యువత భవితను చీకట్లో నెట్టిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ మేరకు యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లలో కాంగ్రెస్ రెండు లక్షల ఉద్యోగాలిచ్చిందన్నారు. తెలంగాణలో ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణలో ప్రభుత్వమే భూ దందాలు, కబ్జాలకు పాల్పడిందని, ప్రజల భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పాటుకాగా, మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయన్నారు. మహిళల సమస్యలపై నాకు అవగాహాన ఉందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కర్ణాటక మాదిరిగా ఆరు గ్యాంటరీల అమలుతో నెలకు మహిళలకు 2500ఆర్ధిక సహాయం, 500లకే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పిస్తామన్నారు. తెలంగాణలో యువత, నారీశక్తిని చూస్తే నాకు గర్వంగా ఉందన్నారు. పాలకుర్తిలో ఒక కుటుంబం ప్రజల కోసం పనిచేస్తే మరో కుటుంబం ప్రజల భూములు లాక్కుందన్నారు.
రైతులకు మద్ధతు ధర కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకునేందుకు రెండు లక్షల రుణమాఫీతో పాటు ఏటా 15వేల ఆర్ధిక సహాయం రైతులకు అందిస్తామన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు 12వేల ఆర్ధిక సహాయం ఇస్తామన్నారు.
వరి మద్ధతు ధరకు క్వింటాల్‌కు 500బోనస్‌గా ఇస్తామన్నారు. తెలంగాణ ప్రజల కోసం ఇప్పటికే ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టో ద్వారా కాంగ్రెస్ అనేక హామీలను ప్రకటించి భరోసా కల్పించిందన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు.