ఫోన్ ట్యాపింగ్‌పై డీజీపీకి బీజేపీ నేత రఘునందన్ ఫిర్యాదు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బుధవారం పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు

  • By: Somu    latest    Mar 27, 2024 11:12 AM IST
ఫోన్ ట్యాపింగ్‌పై డీజీపీకి బీజేపీ నేత రఘునందన్ ఫిర్యాదు

విధాత, హైదరాబాద్‌ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బుధవారం పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేశారని, ఇదే మాట నేను ఉప ఎన్నిక సమయంలో చెప్పానని, 2020 నవంబర్లో నేను చెప్పిందే.. ఇప్పుడు నిజమైందన్నారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరినట్లు చెప్పారు.


గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రమేయం లేకుండా పోలీసులు ఫోన్ ట్యాప్ చేయలేరని, ఈ కేసులో తొలి ముద్దాయిగా కేసీఆర్, రెండో ముద్దాయిగా హరీష్ రావు, మూడో ముద్దాయిగా అప్పటి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని చేర్చాలని కోరినట్లుగా వెల్లడించారు. కల్వకుంట్ల కుటుంబానికి ఇందులో ముఖ్య పాత్ర ఉందని, ఒక్కో కేసుకు ఒక్కో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డీజీపీని కోరానని, పారదర్శకంగా విచారణ చేస్తారనే నమ్మకం ఉందన్నారు.


టెలికం చట్టాలను కాలరాసి, వ్యక్తుల రాజ్యంగ హక్తులను భంగపరిచి, రాజకీయాల కోసం, అక్రమ సంపాదన కోసం ఫోన్ ట్యాపింగ్‌ను ఉపయోగించుకున్నారని, ఫోన్ ట్యాపింగ్‌లో తాను తొలి బాధితుడినని రఘునందన్‌రావు పేర్కోన్నారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తన ఫోన్ ట్యాప్ చేసి తన ప్రచార తీరు తెన్నులను తెలుసుకుని ఇబ్బందులకు గురి చేశారని ఆయన ధ్వజమెత్తారు.