బ‌చ్చ‌న్లు స‌రే.. రామాల‌య ప్రాణ‌ప్ర‌తిష్ఠలో ద‌ళితులేరి?

అయోధ్య‌లో గ‌త నెల‌లో అట్ట‌హాసంగా నిర్వ‌హించిన రామాల‌య ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మం విష‌యంలో ప్ర‌ధాని మోదీ ల‌క్ష్యంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు

  • By: Somu    latest    Feb 19, 2024 11:01 AM IST
బ‌చ్చ‌న్లు స‌రే.. రామాల‌య ప్రాణ‌ప్ర‌తిష్ఠలో ద‌ళితులేరి?
  • బీసీలను, ఎస్సీల‌ను ఎందుకు ఆహ్వానించ‌లేదు?
  • భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌లో రాహుల్‌గాంధీ

అమేథీ: అయోధ్య‌లో గ‌త నెల‌లో అట్ట‌హాసంగా నిర్వ‌హించిన రామాల‌య ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మం విష‌యంలో ప్ర‌ధాని మోదీ ల‌క్ష్యంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. భార‌త్ జోడో న్యాయ్ యాత్ర నిర్వ‌హిస్తున్న రాహుల్ సోమవారం ఒక‌ప్ప‌టి త‌న లోక్‌స‌భ స్థానమైన అమేథీలోకి ప్ర‌వేశించారు. అంతకు ముందు రోజు నిర్వహించిన సభలో రాహుల్‌ మాట్లాడుతూ.. అయోధ్య‌ కార్య‌క్ర‌మంలో అగ్ర‌వ‌ర్ణాల వారికి పెద్ద పీట వేసి.. కిందికులాల‌ను క‌నీసం ప‌ట్టించుకోలేద‌ని ఆరోపించారు.


ఈ సమయంలో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్‌, ఆయన కుమార్తె ఐశ్వర్యరాయ్ పేర్లను పలికారు. అయితే ఈ కార్యక్రమానికి అమితాబ్‌తోపాటు.. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ హాజరయ్యారు కానీ.. ఐశ్యర్యరాయ్ మాత్రం హాజరుకాలేదు. ‘రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మీరు గమనించారా? అందులో ఒక్కరైనా ఓబీసీ వర్గాల వారు ఉన్నరా? అమితాబ్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌, నరేంద్రమోదీ మాత్రం ఉన్నారు’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు.


దేశ జనాభాలో 73 శాతం ఉన్నవారికి ఆ కార్యక్రమంలో ప్రాతినిథ్యమే లేకుండా పోయిందని విమర్శించారు. దేశ పరిపాలన పగ్గాలు ఓబీసీ, ఎస్సీల చేతిలోకి వెళ్లాలని బీజేపీ ఎప్పుడూ కోరుకోదని అన్నారు. దేశంలో కులగణన జరగాల్సి అవసరాన్ని రాహుల్‌ మరోసారి నొక్కి చెప్పారు. సామాజిక అసమానతలను బహిర్గం చేసేందుకు ఇదే అత్యంత ముఖ్యమైన సాధనమని అన్నారు.


కుల గణన అనేది దేశాన్ని ఎక్స్‌రేలా చూపిస్తుందని చెప్పారు. అన్నీ అందులో బయటపడతాయని అన్నారు. అయోధ్య కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ సంయుక్తంగా అధ్యక్షత వహించగా, వేల మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయ అవసరాలకు బీజేపీ వాడుకుంటున్నదని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి.