మోడీని దించాలంటే ముందు కేసీఆర్‌ను దించాలి: రాహుల్‌గాంధీ
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ, బీఆరెస్, ఎంఐఎంలు కలిసి సాగుతున్నాయని, ఆ మూడు పార్టీలు ఒక్కటేనని, ప్రజలు వారి కుటిల రాజకీయాలను తిప్పికొట్టి కాంగ్రెస్‌ను గెలిపించాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు

-
- నాపై 24 కేసులున్నాయి.. ఓవైసీపై ఎన్ని కేసులున్నాయి
- కేసీఆర్ దోచుకున్నదంతా కక్కించి పేదలకు పంచుతాం
- అందరి సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం
- నాంపల్లి రోడ్ షోలో రాహుల్‌గాంధీ
విధాత : తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ, బీఆరెస్, ఎంఐఎంలు కలిసి సాగుతున్నాయని, ఆ మూడు పార్టీలు ఒక్కటేనని, ప్రజలు వారి కుటిల రాజకీయాలను తిప్పికొట్టి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. మంగళవారం నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోకు రాహుల్‌గాంధీ హాజరై మాట్లాడారు. దేశంలో విద్వేష, కార్పోరేట్ రాజకీయాలు సాగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని గద్దెదించాలంటే ముందుగా తెలంగాణలో దొరల పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దించాల్సిన అవసరముందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకున్న మొత్తాన్ని కక్కించి పేదలకు సంక్షేమ పథకాల రూపంలో పంచుతామన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజల సమైక్యత కోసం పోరాడుతూ జోడో యాత్ర చేసిన నాపై 24కేసులు పెట్టిందని, ఐటీ, ఈడీ, సీబీఐలతో దాడులు చేయించిందని, పరువు నష్టం కేసులు పెట్టిందని, పార్లమెంట్ సభ్యత్వాన్ని సైతం రద్ధు చేయించిందన్నారు. తాను మోడీకి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం సాగిస్తున్నానని, ఇక్కడ కేసీఆర్, ఒవైసీలు మాత్రం బీజేపీతో అంటకాగుతున్నారన్నారు. తనపై 24కేసులుంటే ఒవైసీపై ఎన్ని కేసులున్నాయని ప్రశ్నించారు.
ఐటీ, ఈడీ దాడులు కేవలం కాంగ్రెస్ నేతలపైనే సాగుతున్నాయని, ఒవైసీ, కేసీఆర్‌లపైన, వారి పార్టీ వారిపైన ఎందుకు జరుగడం లేదని నిలదీశారు. తెలంగాణలో బీఆరెస్ కోసం, జాతీయ రాజకీయాల్లో బీజేపీ కోసం ఒవైసీ పనిచేస్తు, కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీ గెలుపు కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఇచ్చిన లిస్టులోని సీట్లలో మాత్రమే ఎంఐఎం పోటీ చేస్తుంటుందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ముస్లిం మైనార్టీలు, తెలంగాణ ప్రజలు బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలను అర్ధం చేసుకోవాలన్నారు.
కేంద్రంలోని నరేంద్రమోడీ తన మిత్రులు ఆదానీ, అంబానీల కోసం లక్షల కోట్లు మాఫీ చేసి పేదలను విస్మరించగా, తెలంగాణలో కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనతో బీఆరెస్ ఎమ్మెల్యేలంతా ఫామ్‌హౌజ్‌లు, భూములు, కాంట్రాక్టులతో తమ ఆస్తులు పెంచుకున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు సైతం బీఆరెస్ పార్టీ వారికే సొంతమయ్యాయన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ దొరల సర్కార్‌ను నడిపిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లు దోచుకున్నారని, కట్టిన మూన్నాళ్లకే ఆ ప్రాజెక్టు కూలిపోతుండగా, ఇరిగేషన్ శాఖ చూస్తున్న కేసీఆర్ జేబులు మాత్రం నిండాయన్నారు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారన్నారు. పేపర్ల లీకేజీతో యువత బతుకులను నాశనం చేశారన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ఇవ్వలేదని, దళిత, గిరిజన, మైనార్టీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. మహిళా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. హైద్రాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ హాయంలోనే సాగిందని, మెట్రోరైల్, అంతర్జాతీయ విమనాశ్రయం, అవుట్ రింగ్ రోడ్డు, ఐటీ కారిడార్‌ల నిర్మాణ జరిగిందన్నారు. విశ్వనగరంగా హైద్రాబాద్‌ను కాంగ్రెస్ తీర్చిదిద్దిందన్నారు.
ఈ ఎన్నికల్లో కేసీఆర్ దొరల పాలనకు బైబై చెప్పి ప్రజా తెలంగాణ కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామన్నారు. మహలక్ష్మి పథకంతో మహిళలకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మాదిరిగా 2,500సహాయం, 500లకే గ్యాస్ సిలిండర్, రైతులకు 2లక్షల రుణమాఫీ, ఎకరాకు 15వేలు, రైతుకూలీలకు 12వేల సహాయం అందిస్తామన్నారు. విద్యార్థులకు చదువుకునేందుకు రుణాలు, 10లక్షల ఆరోగ్య శ్రీ బీమా, జామ్ క్యాలెండర్, 2లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వృద్ధులకు 4వేల పెన్షన్‌తో పాటు ఎన్నికల మ్యానిఫెస్టో హామీలను అమలు చేస్తామన్నారు.