దొరల సర్కార్, ప్రజల సర్కార్ మధ్య పోటీ: రాహుల్ గాంధీ
తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని దొరల సర్కార్ కు, నిలువునా మోసపోయి మార్పును కోరుకుంటున్న ప్రజల సర్కార్ కు మధ్య పోటీ జరుగుతోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నరు

- కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల దోపిడీ
- 20 లక్షల ఎకరాల పేదల భూమి లాక్కున్నారు
- బీఆరెస్, బీజేపీలను ఓడించండి
- సంగారెడ్డి, అంధోల్ సభల్లో రాహుల్ గాంధీ
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని దొరల సర్కార్ కు, నిలువునా మోసపోయి మార్పును కోరుకుంటున్న ప్రజల సర్కార్ కు మధ్య పోటీ జరుగుతోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నరు. ఆదివారం సంగారెడ్డి, అంధోల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీది దళిత, ఆదివాసి, పీడిత పాలిట సర్కార్ అని చెప్పారు.
బీఆరెస్ ది దొరల సర్కార్ అయ్యిందని, కాంగ్రెస్ ప్రజల సర్కార్ అంటే ఎలా వుంటాదో నేను చెబుతాన్నారు. ఎప్పుడైతే మా సర్కార్ వస్తుందో మొట్టమొదట ఆరు గ్యారెంటీల మీద నిర్ణయం వుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గ్యాస్ తో పాటు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన కరెంట్, ఇళ్లు లేని పేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్నారు.
నిరుద్యోగులు, విద్యార్థులకు యువ భరోసా కింద రూ.5 లక్షలు, ప్రతి మండలంలో ఇంటర్ నేషనల్ స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఏర్పాటుచేస్తామని చెప్పారు. వృద్ధులకు చేయూత స్కీమ్ కింద రూ.4 వేలు అందుతుందన్నారు. కేసీఆర్ దోచుకున్న డబ్బు ప్రజల బ్యాంక్ లోకి పంపిస్తామ్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నిలదీస్తున్న కేసీఆర్ కు.. ధీటైన సమాధానాన్ని రాహుల్ గాంధీ ఇచ్చారు.
కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, కేసీఆర్ ఏదైతే స్కూల్ లో, కాలేజ్ లో చదువుకున్నారో.. అది కాంగ్రెస్ పార్టీ కట్టించిందేనని, ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ది చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని కాదు.. కేసీఆర్ ఏమి చేశాడన్నదే మా సవాల్ అని రాహుల్ అన్నారు. కేసీఆర్ కాళేశ్వరంలో ఎంత దోపిడీ చేశారని నిలదీశారు. కమీషన్లతో ప్రాజెక్టు భూమిలో కుంగిపోతున్నదన్నారు.
ధరణి ముసుగులో పేదల నుండి 20 లక్షల ఎకరాల భూమిని లాక్కున్నారని ఆరోపించారు. నిరుద్యోగులు కష్టపడి పరీక్షలు రాస్తే పేపర్ లీక్ అవుతోందన్నారు. దళిత బంధు స్కీమ్ లో బీఆరెస్ ఎమ్మెల్యే లు ఒక్కొకరి వద్ద రూ.3 లక్షలు కమీషన్ దోచుకున్నారన్నారు. తెలంగాణలో బీఆరెస్, బీజేపీలను తొక్కిపడేయాలని రాహుల్ పిలుపునిచ్చారు.
బీజేపీ, బీఅర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయని అన్నారు. మోడీ పూర్తిమద్దతు కేసీఆర్ కు వుందని, లోక్ సభలో మోడీకి కేసీఆర్ మద్దతు ఉందన్నారు. పేపర్ లీకులతో నిరుద్యోగులను రోడ్డుపాలు చేసిన బీఆరెస్… తెలంగాణలో ఉద్యోగాలను ఎందుకు భర్తీ చెయ్యడం లేదని ప్రశ్నించారు. ఇన్ని రోజులు తెలంగాణ ప్రజల నోమ్మును ఈ కేసీఆర్ దోచుకున్నాడో.. ఆ పైసలను రికవరీ చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేత ఆ డబ్బులను పేదల అకౌంట్ లో వేస్తామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచాక, ఢిల్లీలో బీజేపీని కూడా ఓడిస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలు దొరల పాలనకు బై బై చెప్పి, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.