‘శక్తి’ వ్యాఖ్యలపై ప్రధాని వక్రీకరణ..ఆ ‘శక్తి’ ముసుగు ప్రధాని మోదీయే

‘శక్తి’ విషయంలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అయితే వీటిని తనకు అనుకూలంగా మల్చుకున్న ప్రధాని నరేంద్రమోదీ

‘శక్తి’ వ్యాఖ్యలపై ప్రధాని వక్రీకరణ..ఆ ‘శక్తి’ ముసుగు ప్రధాని మోదీయే

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ కౌంటర్‌

న్యూఢిల్లీ : ‘శక్తి’ విషయంలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అయితే వీటిని తనకు అనుకూలంగా మల్చుకున్న ప్రధాని నరేంద్రమోదీ.. రాహుల్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. శక్తి వ్యతిరేకులకు, శక్తి రక్షకులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు. దీనిపై రాహుల్‌ సోమవారం వివరణ ఇచ్చారు. ‘మోదీజీకి నా మాటలు నచ్చవు. నా మాటలను వక్రీకరించి, వాటికి తప్పుడు అర్థం చెప్పేందుకు ఆయన ప్రయత్నించారు. ఎందుకంటే.. నేను ఆ మాట చాలా లోతైన అర్థంతో వాడానని ఆయనకు తెలుసు’ అని ఎక్స్‌లో తెలిపారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి ముంబైలోని శివాజీ పార్కులో నిర్వహించిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్‌.. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ప్రస్తావిస్తూ ‘శక్తి’ అనే పదాన్ని వాడారు. ‘హిందూ మతంలో ‘శక్తి’ అనే పదం ఉన్నది. మనం ఒక ‘శక్తి’ (ప్రభుత్వాధినేత)తో పోరాడుతున్నాం. ప్రశ్న ఏమిటంటే.. ఆ శక్తి ఏమిటి? దానితో మనకు సంబంధం ఏమిటి? ఈవీఎంల ఆత్మ, చిత్తశుద్ధి రాజుకు పాదాక్రాంతమైంది. ఇది వాస్తవం. ఈవీఎంలే కాదు.. ఈడీ, సీబీ, ఐటీ ఇలా దేశంలోని స్వయంప్రతిపత్తి ఉన్న అన్ని సంస్థలూ కేంద్రం ఎదుట తమ వెన్నుపూసలు వంచేశాయి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలను మోదీ తనకు అనుకూలంగా మార్చుకోవడంతో దానిపై వివరణ ఇచ్చిన రాహుల్. తాము పోరాడుతున్నామని చెప్పిన ‘శక్తి’ ముసుగు ప్రధాన మంత్రి మోదీయేనని స్పష్టం చేశారు. ఆ శక్తి దేశ గొంతులను, సంస్థలను, సీబీఐ, ఐటీ, ఈడీ, ఎన్నికల కమిషన్‌, మీడియా, పరిశ్రమలు, రాజ్యాంగ వ్యవస్థను గుప్పిట పట్టిందని ఆరోపించారు. ‘కొన్ని వేల రూపాయల రుణాలు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఈ ‘శక్తి’ కోసమే వేల కోట్ల రూపాయల రుణాలను నరేంద్రమోదీ మాఫీ చేశారు’ అని ఆరోపించారు.