RFCL బాధితుల బాధ్యత రామగుండం ఎమ్మెల్యేదే!.. మావోయిస్టు పార్టీ లేఖ
బాధితులకు డబ్బు చెల్లించే బాధ్యత ఆయనదే అఖిలపక్ష కమిటీ పేరిట ఎమ్మెల్యే డ్రామాలు బాధితులకు న్యాయం చేయకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదు విధాత బ్యూరో, కరీంనగర్: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున డబ్బు చెల్లించి, మోసపోయిన బాధితులకు అండగా ఉంటామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ పేరిట ఓ లేఖ విడుదలయ్యింది. ఉద్యోగాల ఆశతో వడ్డీలకు అప్పులు తెచ్చి, వాటిని తిరిగి […]

- బాధితులకు డబ్బు చెల్లించే బాధ్యత ఆయనదే
- అఖిలపక్ష కమిటీ పేరిట ఎమ్మెల్యే డ్రామాలు
- బాధితులకు న్యాయం చేయకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదు
విధాత బ్యూరో, కరీంనగర్: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున డబ్బు చెల్లించి, మోసపోయిన బాధితులకు అండగా ఉంటామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్ పేరిట ఓ లేఖ విడుదలయ్యింది. ఉద్యోగాల ఆశతో వడ్డీలకు అప్పులు తెచ్చి, వాటిని తిరిగి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలకు స్ధానిక ఎమ్మెల్యే, అతని అనుచరులే బాధ్యులనీ మావోయిస్టు పార్టీ ఆ లేఖలో ఆరోపించింది.
అమాయక నిరుద్యోగులను ఆర్ఎఫ్‌సీఎల్.(రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్) లో ఉద్యోగాల పేరిట, నిండా ముంచిన వారిని ఎవరిని వదిలిపెట్టమని మావోయిస్టు పార్టీ ఆ లేఖలో హెచ్చరించింది. ఆర్ఎఫ్‌సీఎల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెట్టించేందుకు తన అనుచరుల ద్వారా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అమాయక నిరుద్యోగ యువత నుండి డబ్బులు దండుకున్నారని ఆరోపించింది.
ఉద్యోగాల బాధితులకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బాధ్యత వహించి డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగాల కల్పన పేరుతో తన అనుచరుల ద్వారా నిరుద్యోగుల నుండి కోట్లాది రూపాయలు డబ్బులు వసూలు చేయించి.. ఈ విషయంలో తనకేమీ తెలియదన్నట్లు ఎమ్మెల్యే చందర్
నటిస్తున్నాడని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
బాధిత కుటుంబాలకు డబ్బు ఇప్పించే పూర్తి బాధ్యత ఎమ్మెల్యే తీసుకోవాలని డిమాండ్ చేసింది. 90 మంది బ్రోకర్లను 76 మందికి కుదించి, అఖిలపక్ష కమిటీ పేరిట డ్రామాలు ఆడించిన దాంట్లో కూడా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రమేయం ఉందని మావోయిస్టు పార్టీ తెలిపింది.
ఆర్ఎఫ్‌సీఎల్ కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకున్న బ్రోకర్ల పేర్లను ఎమ్మెల్యే, అఖిలపక్ష కమిటీ, బయటపెట్టాలని డిమాండ్ చేసింది. రౌడీ షీటర్లు, లంపెయిన్ గ్యాంగులు, భూకబ్జా కోర్లను దగ్గర పెట్టుకొని రామగుండం ప్రాంతాన్ని శాసించాలని ఎమ్మెల్యే చందర్ చూస్తున్నాడని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఆయనతో పాటు, నిరుద్యోగులను వంచించిన రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించింది.
అఖిలపక్ష కమిటీ పేరిట 400 మంది ఆర్ఎఫ్‌సీఎల్ బాధితులను అధికారికంగా గుర్తిస్తే, వివిధ కార్మిక, రాజకీయ పార్టీల నాయకులకు ఆర్ఎఫ్‌సీఎల్‌లో కాంట్రాక్టు ఉద్యోగాల పేరిట, డబ్బులు ఇచ్చి తిరుగుతున్న వారు మరో 150 మంది ఉన్నారన్నారు.
ఆర్ఎఫ్‌సీఎల్ కాంట్రాక్టు ఉద్యోగాల బాధితుల్లో ఒకరు మృతి చెందడానికి, మరి కొంతమంది ఆత్మహత్యా యత్నం చేసుకోవడానికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్, అనుచరులే కారకులని మావోయిస్టు పార్టీ తన లేఖలో పేర్కొంది. అఖిలపక్ష కమిటీ నాయకులు ఇప్పించిన చెక్కులు చెల్లక బాధిత కుటుంబాలు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని మావోయిస్టు పార్టీ పేర్కొంది.