BRS లో మోగుతున్న రె‘బెల్స్‌’.. తగ్గేదేలేదంటున్న అసమ్మతివాదులు

BRS తిరగబడిన ఆత్మీయం పోటీ ఖాయమంటున్న ఆశావహులు గులాబీ అసంతృప్తులకు కాంగ్రెస్ గాలం ఇప్పటికే రేఖానాయక్‌ భర్త కాంగ్రెస్‌లోకి తాజాగా బీఆరెస్‌కు వేముల రాజీనామా అధినేత వైఖరివల్లే అసమ్మతికి ఆజ్యం! (విధాత, హైదరాబాద్‌) ఆత్మీయ సమ్మేళనం.. పార్టీ బలోపేతం లక్ష్యంగా శ్రేణుల కలయిక సమావేశాలకు బీఆరెస్‌ పెట్టుకున్న ముద్దుపేరు! కానీ.. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. అసమ్మతివాదులు, అసంతృప్త నేతల ‘తిరుగుబాటు ఆత్మీయ సమ్మేళనాలు’ నిర్వహిస్తూ.. భవిష్యత్‌ కార్యాచరణ నిర్దేశించుకుంటున్నారు. అది టికెట్ పొందినవారిలో గుబులు రేపుతున్నది. బుధవారం […]

  • By: Somu    latest    Aug 23, 2023 12:53 PM IST
BRS లో మోగుతున్న రె‘బెల్స్‌’.. తగ్గేదేలేదంటున్న అసమ్మతివాదులు

BRS

  • తిరగబడిన ఆత్మీయం
  • పోటీ ఖాయమంటున్న ఆశావహులు
  • గులాబీ అసంతృప్తులకు కాంగ్రెస్ గాలం
  • ఇప్పటికే రేఖానాయక్‌ భర్త కాంగ్రెస్‌లోకి
  • తాజాగా బీఆరెస్‌కు వేముల రాజీనామా
  • అధినేత వైఖరివల్లే అసమ్మతికి ఆజ్యం!

(విధాత, హైదరాబాద్‌)

ఆత్మీయ సమ్మేళనం.. పార్టీ బలోపేతం లక్ష్యంగా శ్రేణుల కలయిక సమావేశాలకు బీఆరెస్‌ పెట్టుకున్న ముద్దుపేరు! కానీ.. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. అసమ్మతివాదులు, అసంతృప్త నేతల ‘తిరుగుబాటు ఆత్మీయ సమ్మేళనాలు’ నిర్వహిస్తూ.. భవిష్యత్‌ కార్యాచరణ నిర్దేశించుకుంటున్నారు. అది టికెట్ పొందినవారిలో గుబులు రేపుతున్నది. బుధవారం ఒక్క నల్లగొండ జిల్లా పరిధిలోనే పలు తిరుగుబాటు ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి.

నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కోదాడలో కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనెపల్లి చందర్ రావు, యేర్నేని బాబు తమ వర్గీయులతో, నల్లగొండలో పిల్లి రామరాజు తమ వర్గీయులతో కలిసి ఆత్మీయ(అసమ్మతి) సమావేశాలు నిర్వహించారు. వారంతా కూడా సిటింగ్‌లకు టికెట్లను రద్దు చేయాల్సిందేనంటూ బీఆరెస్ అధిష్ఠానాన్ని బాహటంగా డిమాండ్ చేశారు.

కోదాడలో సిటింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయని పక్షంలో తామంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ తీర్మానం చేసి.. దానిని పార్టీ అధిష్ఠానానికి పంపించారు. అంతక్రితమే నాగార్జున సాగర్‌లో సిటింగ్ ఎమ్మెల్యే నోముల భగత్‌కు వ్యతిరేకంగా కడారి అంజయ్య యాదవ్‌, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డిలు తమ వర్గీయులు, దేవరకొండలో సిటింగ్ ఎమ్మెల్యే ఆర్‌ రవీంద్రకుమార్‌కు వ్యతిరేక వర్గీయులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుని అభ్యర్థులను మార్చాలంటూ అధిష్ఠానాన్ని కోరారు.

మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆశావహులు, అసమ్మతివాదులంతా భారీ సభకు సన్నాహాలు చేస్తున్నారు. కూసుకుంట్లను గెలిపించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఆలేరు టికెట్ ఆశించిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గురువారం తన అనుచరులతో సమావేశం కానున్నారు. అటు కరీంనగర్‌లో మాజీ ఎమ్మెల్సీ సంతోష్ సైతం తన అనుచరులతో భేటీయై బీఆరెస్‌కు రాజీనామా ప్రకటించారు. తాను కరీంనగర్ శాసభ సభ స్థానంలో పోటీ చేస్తానని, బీజేపీ, కాంగ్రెస్‌లలో ఏదో ఒక పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు.

తుమ్మల, జలగం వేరు సమావేశాలు

ఖమ్మం జిల్లా పాలేరు టికెట్ ఆశించి భంగపడిన తుమ్మల నాగేశ్వర్‌రావు అనుచరులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంగళరావు కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. మెదక్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి టికెట్ రద్దుకు అసమ్మతి వర్గీయులు భారీ సమావేశమే నిర్వహించారు.

పెద్దపల్లి టికెట్ రాని నల్ల మనోహర్‌రెడ్డి రెబల్‌గా పోటీకి సిద్ధమయ్యారు. వేముల వాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌తో బీజేపీ నేతలు సంప్రదింపులు చేస్తున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుకు వ్యతిరేకంగా ఉన్న నాయకులంతా రాజీనామా బాట పట్టారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యతిరేక వర్గాలు రహస్య భేటీలు కొనసాగిస్తున్నాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది.

గులాబీ అసమ్మతివాదులకు కాంగ్రెస్ గాలం

బీఆరెస్‌లో రేగిన అసమ్మతిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతున్నది. ఇప్పటికే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరేందుకు ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఈ జిల్లాలో కీలక పరిణామంగా మారింది. దీంతో ఆయన ఆత్మీయ సమావేశం పెట్టి.. బీఆరెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆలేరు నియోజకవర్గంతో పాటు పాటు ఖమ్మం, ఆదిలాబాద్‌, మంచిర్యాల, వరంగల్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లోని బీఆరెస్ అసమ్మతివాదులు, ఆశావహులతో సంబంధాల్లోకివెళుతున్న కాంగ్రెస్‌ నాయకులు.. పార్టీలోకి ఆహ్వానిస్తుండటం గమనార్హం.

అధినేత వైఖరినే అసమ్మతికి ఆజ్యం

సిటింగ్‌లకు టికెట్లు కేటాయిస్తూ బీఆరెస్‌ తొలి జాబితా అభ్యర్థుల ప్రకటనతో నియోజకవర్గాల్లో రేగుతున్న అసమ్మతికి బీఆరెస్‌ అధిష్ఠానం ఏకపక్ష వైఖరినే కారణమైన విమర్శలు సొంత పార్టీ నుంచే వ్యక్తం అవుతున్నాయి. తమను పిలిచి మాట్లాడకుండా ఏకపక్షంగా సిటింగ్‌లకే టికెట్లు కేటాయించి అధిష్ఠానం తమను చిన్నచూపు చూసిందని, దీంతో అభ్యర్థులు తమను మరింత తీసి పారేస్తున్నారన్న ఆవేదన ఆశావాహుల్లో, ద్వితీయశ్రేణి నాయకుల్లో వ్యక్తం అవుతున్నది.

మళ్ళీ సిటింగ్‌లకే టికెట్లు రావడంతో ఇంతకాలం వారి ఏకపక్ష విధానాలను ప్రశ్నిస్తూ వచ్చిన తమ పట్ల వారు మరింత అణచివేత చర్యలకు దిగుతున్నారంటూ ఆశావహులు ద్వితీయశ్రేణి నాయకత్వం రగిలిపోతున్నది. సీఎం కేసీఆర్ లేదా మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు నియోజకవర్గం వారీగా సిటింగ్‌లను, ఆశావహులను, ద్వితీయ శ్రేణి నాయకులను కూర్చోబెట్టి టికెట్లు ప్రకటించి ఉంటే చాలా వరకు అసమ్మతి సద్దుమణిగేదన్న భావన గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది.

అలా కాకుండా సీఎం కేసీఆర్ మాత్రం అభ్యర్థులది ఏముంది? నన్ను చూసి, నా పథకాలు చూసి ఓట్లు వేస్తారన్న భావనతో సిటింగ్‌లకు టికెట్లు ఇచ్చేశారని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. దీంతో నియోజకవర్గంలలో అసమ్మతి యథాతథంగా కొనసాగుతుందని, ఇది ఎన్నికల్లో గట్టి ప్రభావాన్నే చూపుతుందని అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా నల్లగొండ అసెంబ్లీ టికెట్ భూపాల్ రెడ్డికి మళ్ళీ ప్రకటించే క్రమంలో టికెట్ ఆశించిన తమ నేతల అభిప్రాయాలు అడగలేదని ఇక్కడ ఆశావహులైన పిల్లి రామరాజు యాదవ్, చాడ కిషన్ రెడ్డి వర్గాలు చెబుతున్నాయి.

భూపాల్ రెడ్డితో రాజీపడే పరిస్థితి రెండువైపులా లేకపోవడంతో అసమమ్మతివాదులు, ఉద్యమకారులు చాలామంది తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయనున్నట్లుగా పిల్లి రామరాజు ఇప్పటికే ప్రకటించారు. సరిగ్గా ఇదే పరిస్థితి మునుగోడులోనూ కనిపిస్తున్నది. ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మార్చాలన్న ఆశావాహులతో మాట మాత్రమైనా చర్చించకుండానే ఆయనకు టికెట్ ప్రకటించేశారు.

కనీస ఆత్మగౌరవం ఉన్న వారెవరూ ఇలాంటి పరిస్థితుల్లో సర్దుకుపోలేరన్న అభిప్రాయం వినిపిస్తున్నది. నాగార్జునసాగర్‌లో నోముల భగత్ టికెట్ ఖరారుకు ముందు అక్కడ టికెట్ ఆశించిన నేతలతో కూర్చోబెట్టి మాట్లాడలేదని, దేవరకొండలో సైతం తమ అభిప్రాయం పరిగణలోకి తీసుకోలేదని అసమ్మతివాదులు ఆవేదన చెందుతున్నారు. నకిరేకల్‌లోనూ సిట్టింగ్ చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇచ్చే ముందు మాజీ ఎమ్మెల్యే వీరేశంతో సయోధ్య కుదర్చలేదని అంటున్నారు.

దీంతో వీరేశం తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకున్నారని చెబుతున్నారు. కోదాడలోనూ సిటింగ్‌ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు పోటీగా టికెట్ ఆశించిన కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, ఎర్నేని బాబులతో అధిష్ఠానం కనీస చర్చలు జరుపకపోవడం వారికి మింగుడు పడటం లేదు. రాష్ట్రంలోని మెజార్టీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొందని, ఇందుకు టికెట్లు ఖరారులో అధినేత సీఎం కేసీఆర్ అనుసరించిన ఏకపక్ష విధానమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

త్రీ మెన్ కమిటీ కార్యాచరణ ఎప్పుడు..

సిటింగ్‌లకు టికెట్లు ప్రకటించిన సందర్భంలో సీఎం కేసీఆర్ అసమ్మతి, అసంతృప్త నాయకులతో సర్దుబాట్లు, బుజ్జగింపుల బాధ్యతను అభ్యర్థులకే వదిలేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇంతకాలంగా ఎడముఖం, పెడముఖంగా ఉన్నఎమ్మెల్యేలు, వారికి పోటీగా టికెట్ ఆశించిన ఆశావహులు, అసమ్మతివాదులంతా ఇప్పుడు ఒక్కసారిగా దగ్గరవడానికి అనేక పట్టింపులు, భేషజాలు, పాత వివాదాలు, ఆర్థిక కారణాలు వంటివన్నీ అడ్డుగా ఉంటాయి. వారి మధ్య చొరవ తీసుకోవాల్సిన బాధ్యత మరెవరో చూడాల్సి ఉంది.

ఇందుకు రాష్ట్ర స్థాయిలో త్రీమెన్‌ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అది ఎప్పుడు తన పని మొదలు పెడుతుందన్న దానిపై స్పష్టత లేదు. ఇదే అదనుగా బీఆరెస్‌ టికెట్ ఆశించిన ఆశావహులు, అసంతృప్తులకు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు గాలం వేస్తూ వలసలను ప్రోత్సహిస్తుండటం సిటింగ్ బీఆరెస్ ఎమ్మెల్యేలకు రాజకీయంగా సమస్యగా మారుతున్నది.