విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు కరుణాపురం, రాంపూర్ మధ్య శుక్రవారం రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ ప్రమాదంలో అన్నా చెల్లెలు మృతి చెందిన విషాద సంఘటన జరిగింది.
వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుపై ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి వెళ్తున్న బైక్ ఒక్కసారిగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో బైక్ పై వెళుతున్న అన్నాచెల్లెలు లారీ వెనుక భాగంలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందారు.
కాగా.. సంఘటన జరిగిన దృశ్యం పలువురిని కలచి వేసింది. బైక్ మీద కూర్చున్న అన్నను పట్టుకున్న చెల్లెలు కూర్చున్నట్లుగానే మృతి చెందింది. మృతులు హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన సుమిత్ రెడ్డి, పూజిత రెడ్డిలుగా గుర్తించారు.
ప్రమాద సంఘటన తెలియగానే అక్కడికి చేరుకున్న ధర్మసాగర్ పోలీసులు పరిస్థితిని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నా చెల్లెలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో నాగారంలో విషాదఛాయల అలుముకున్నాయి.