రూ.800 కోట్ల భూమిని కేవలం రూ.100 కోట్లకు యశోదకు కట్టబెట్టారు: రేవంత్ రెడ్డి
భూములు కొల్లగొట్టి లక్ష కోట్లు అక్రమంగా సంపాదించిన కేసీఆర్ కుటుంబం ఖానామెట్‌లో సర్వేనెంబర్ 14/14లో 8 ఎకరాలు అలెగ్జాన్డ్రియాకు కేటాయించిన 5 ఎకరాల భూమిని బెదిరించి గుంజుకున్నారు ఎకరం రూ. 39 కోట్ల భూమిని కేవలం రూ. 18 కోట్లకే యశోదాకు కట్టబెట్టారు అక్రమ సంపాదనతో దేశ రాజకీయాలను శాసించాలని చూస్తున్న కేసీఆర్ రేపు లిక్కర్ కుంబకోణంలో ఉన్న బందాన్ని బయట పెడతా 20 శాతం కమిషన్ల కోసం అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తున్న కేటీఆర్ గాంధీభవన్‌లో పీసీసీ […]

- భూములు కొల్లగొట్టి లక్ష కోట్లు అక్రమంగా సంపాదించిన కేసీఆర్ కుటుంబం
- ఖానామెట్‌లో సర్వేనెంబర్ 14/14లో 8 ఎకరాలు
- అలెగ్జాన్డ్రియాకు కేటాయించిన 5 ఎకరాల భూమిని బెదిరించి గుంజుకున్నారు
- ఎకరం రూ. 39 కోట్ల భూమిని కేవలం రూ. 18 కోట్లకే యశోదాకు కట్టబెట్టారు
- అక్రమ సంపాదనతో దేశ రాజకీయాలను శాసించాలని చూస్తున్న కేసీఆర్
- రేపు లిక్కర్ కుంబకోణంలో ఉన్న బందాన్ని బయట పెడతా
- 20 శాతం కమిషన్ల కోసం అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తున్న కేటీఆర్
- గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
విధాత: కేసీఆర్ కుటుంబం దోపీడీ చేస్తోందని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం సాయంత్రం ఆయన గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం భూములు కొల్లగొట్టి లక్ష కోట్లు అక్రమంగా సంపాదించిందన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో దేశ రాజకీయాలను శాసించాలని కేసీఆర్ చూస్తున్నాడని ఆరోపించారు. ఖానామెట్ లో 41/14 సర్వే నంబర్ లో 8ఎకరాల భూమిని కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందన్నారు.
అలాగే అలెగ్జాన్డ్రియా కంపెనీ హెల్త్ సెంటర్ ను ప్రారంభించాలని 2010లో దరఖాస్తు చేసుకుంటే, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 5ఎకరాల భూమిని రూ. 50కోట్లకు కేటాయించిందన్నారు. అలాగే మారుతి సుజుకి కంపెనీకి 2 ఎకరాలు కేటాయించిందని తెలిపారు. అయితే ఆనాడు ఎకరాకు రూ. 12 కోట్ల విలువ ఉందని లోకాయుక్త కోర్టులో కేసు వేశారని చెప్పారు. నాడు జరిగిన తప్పిదాన్ని గమనించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కంపెనీలకు నోటీసులిచ్చిందని తెలిపారు.
ఈ మేరకు రూ. 10కోట్లకు కాకుండా రూ. 12 కోట్లకు ఎకరా చొప్పున చెల్లించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ ఎం డీఏ ఆ కంపెనీలకు నోటీసులిచ్చిందన్నారు. నాడు కాంగ్రెస్ ఇచ్చిన నోటీస్‌లకు స్పంధించిన మారుతి సుజుకీ కంపెనీ మిగిలిన నాలుగు కోట్లు చెల్లించిందని వివరించారు. అయితే నాడు ఏకారణం చేతనోకానీ అలెగ్జాన్ద్రియా ఫార్మా కంపెనీ అదనపు సొమ్ము చెల్లించకుండా జాప్యం చేసిందన్నారు.
అయితే కోర్టులో ఈ వివాదం కొనసాగుతుండగానే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ కుటుంబానికి అలెగ్జాన్డ్రియాకు కేటాయించిన ఈ 5 ఎకరాలపై కేసీఆర్ కుటుంబం కన్ను పడిందని, వెంటనే ఆ కంపెనీని బెదిరించి కేసీఆర్ కుటుంబం కైవసం చేసుకుందన్నారు. ఈ మేరకు జగన్నాథరావు కల్వకుంట్ల, రవీందర్ రావు గోరుకంటి, దేవేందర్ రావు 2016లో ఆ కంపెనీని కైవసం చేసుకున్నారని రేవంత్ వివరించారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీ భూములను బెదిరించి గుంజుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 2018 లో ఈ భూ వివాదంపై కావాలనే కేసు ఓడిపోయారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సుప్రీం కోర్టులో ఎందుకు అప్పీల్ కు వెళ్లలేదని రేవంత్ ప్రశ్నించారు. అర్హత లేకపోయినా వారికి కట్టబెట్టిన భూమిని వెనక్కి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ బంధువులకు 5 ఎకరాల భూమి కట్టబెట్టిందన్నారు.
ఇంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మూడెకరాలు భూమిపై కూడా కేసీఆర్ కుటుంబం కన్నీసిందని ఆరోపించారు. హైటెక్ సిటీకి అనుకుని ఉన్న భూమిని 2017లో గజానికి రూ.37,611కే కట్టబెట్టారన్నారు. వాస్తవంగా ప్రభుత్వ అధికారుల నివేదికల ప్రకారం 2017లో అక్కడ గజం ధర రూ.80వేలు ఉందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు 2016లో రూ. 33 కోట్లకు ఎకరం భూమిని అమ్మాలని నివేదిక ఇచ్చారన్నారు. 2017లో రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా ఉన్న బీఆర్ మీనా ఎకరానికిరూ. 39 కోట్ల ధర నిర్ణయించారన్నారు.
అయితే అధికారుల నివేదికలను పక్కకు తోసిన ఈ సర్కారు ఎకరానికి రూ.18 కోట్లకే యశోదా ఆసుపత్రికి కట్టబెట్టారని ఆరోపించారు. ఇలా రూ.800 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.100 కోట్లకే హస్తగతం చేసుకున్నారన్నారు. ఈ విధంగా భూములు కొల్లగొట్టి కేసీఆర్ లక్ష కోట్లు అక్రమంగా సంపాదించారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ పద్దతుల్లో అక్రమ సంపాదించిన సొమ్ముతో కేసీఆర్ దేశ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారన్నారు.
ఉద్యమకారుడినని చెప్పుకున్న కేసీఆర్ కు వేల ఎకరాల భూములు ఎలా వచ్చాయి? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఫామ్ హౌసులు ఎలా వచ్చాయి? అని నిలదీశారు. పేద ప్రజలకు చెందాల్సిన సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. నిరుద్యోగుల కుటుంబాలకు తలా లక్ష రూపాయలు సాయం చేయాలని కేసీఆర్ ఎందుకు ఆలోచించలేదన్నారు. కేసీఆర్ కుటుంబం అక్రమంగా దోచుకున్న ఆ భూములను అమ్మితే ప్రభుత్వానికి రూ.2500 కోట్లు వస్తాయని, ఆ సొమ్ముతో నిరుద్యోగులను ఆదుకోవచ్చునని అన్నారు.
రేపు( బుధవారం) అత్యంత కీలకమైన లిక్కర్ కుంభకోణంలో ఉన్న బంధాన్ని బయటపెడతామని రేవంత్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ ను సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరం తెలంగాణ సమాజంపై ఉందన్నారు. తాను వాస్తవాలు మాట్లాడితే కేటీఆర్ దబాయించి తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. ‘నా ఆరోపణలపై విచారణ చేయించండి… తప్పైతే దేనికైనా సిద్ధం’ అని మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. గతంలో జన్వాడలో భూమి లేదని చెప్పిన కేటీఆర్ … తన భార్య పేరుతో ఉన్న భూమి వివరాలు బయటపెడితే మాట్లాడలేదన్నారు. లిక్కర్ కుంభకోణంలో ఉన్న వారికి ఖానామెట్ లో 25 ఎకరాల భూమిని అప్పగించింది వాస్తవం కాదని నిరూపిస్తారా? అని రేవంత్ అడిగాడు.
నగరంలో భవనాల అనుమతుల్లోనూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూ ప్రపంచంలో ఎక్కడా ఎకరాకు లక్ష, లక్షన్నర చదరపు గజాలకు అనుమతి ఇవ్వరని, అయితే ఇక్కడ మాత్రం ఎకరాకు 5లక్షల చదరపు గజాలకు అనుమతిస్తున్నారన్నారు. 20శాతం కమీషన్ల కోసం కేటీఆర్ ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నాడని ఆరోపించాడు. ఇది నగరానికి అత్యంత ప్రమాదకరమన్నారు. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే అంతా బూడిదైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, నాగార్జున సర్కిల్ లో భవనాలకు అదనపు అంతస్థులకు అనుమతులు ఎలా ఇచ్చారో కేటీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి విధానాలతో నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లో భవిష్యత్తులో ఎవరూ నివసించలేని పరిస్థితి వస్తుందన్నారు. జూబ్లీహిల్స్ కేబీఆర్ పక్కన నమస్తే తెలంగాణకు 3వేల గజాలు ఎలా వచ్చిందో సమాధానం చెప్పాలని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 5అంతస్తులు కట్టాల్సిన బిల్డర్ 16 అంతస్తులు కడుతుంటే కేటీఆర్ ఏం చేస్తున్నారని రేవంత్ అడిగారు.