మరో ప్రతిపక్ష నేతపై రాజద్రోహం కేసు

ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ వ్యాసం రాసిన శివసేన (ఉద్ధవ్‌) నేత సంజయ్‌రౌత్‌పై దేశద్రోహం కేసు నమోదైంది.

  • By: TAAZ    latest    Dec 12, 2023 10:03 AM IST
మరో ప్రతిపక్ష నేతపై రాజద్రోహం కేసు
  • మోదీపై వ్యాసం రాసిన సంజయ్‌రౌత్‌
  • బీజేపీ నాయకుడి ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్‌

యవత్మాల్‌: ప్రధాని నరేంద్రమోదీ, అధికార బీజేపీని విమర్శిస్తూ వ్యాసం రాసినందుకు శివసేన (ఉద్ధవ్‌) నేత, ఎంపీ సంజయ్‌రౌత్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. సామ్నా పత్రికలో ఇటీవల సంజయ్‌రౌత్‌ ఈ వ్యాసం రాశారు. అయితే.. ఇది అభ్యంతరకరంగా ఉన్నదంటూ యవత్మాల్‌ జిల్లా బీజేపీ నేత నితిన్‌భుతడా పోలీసులకు ఫిర్యాదు చేయగా, యవత్మాల్‌ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. అందులో దేశద్రోహంతోపాటు, పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.


డిసెంబర్‌ 10వ తేదీన మోదీకి వ్యతిరేకంగా సంజయ్‌రౌత్‌ అభ్యంతరకర వ్యాసం రావారని భుతడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉమర్‌ఖేడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో రౌత్‌పై ఐపీసీ సెక్షన్‌ 124 (ఏ) (రాజద్రోహం), సెక్షన్‌ 153 (ఏ) (విభిన్న గ్రూపుల మధ్య మతం, జాతి, జన్మస్థలం, నివాస ప్రాంతం, భాష తదితరాల పేరిట శత్రుత్వాలు పెంపొందించడం, సెక్షన్‌ 505 (2) (దురుద్దేశపూర్వకంగా వర్గాల మధ్య శత్రుత్వాలు, విద్వేషాలు పెంచేలా ప్రకటనలు చేయడం) కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.


తనపై రాజద్రోహం కేసు మోపడంపై సంజయ్‌రౌత్‌ స్పందిస్తూ.. ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై కేసు పెట్టారని అన్నారు. దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం ఉన్నదని పేర్కొన్నారు. బీజేపీ ఇటీవల విజయం సాధించిన మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కొత్త నాయకులను ఎంపిక చేయడంపై ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులు ఎవరు అవ్వాలనేది కేంద్రంలోని నాయకులు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. బీజేపీ కూడా కాంగ్రెస్‌లా మారిపోతున్నదని, ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది అధిష్ఠానమే నిర్ణయిస్తున్నదని ఎద్దేవా చేశారు.