గులాబీ కట్టడి.. ఉద్యమకారుల ‘ఆత్మగౌరవం’ వెలవెల!
నామమాత్రంగా సాగిన ఉద్యమకారుల ఆత్మ గౌరవ సదస్సు !! సదస్సుకు హాజరుకాని ఉద్యమ, అసమ్మతి వాదులు సదస్సు ప్రసంగాలు నోట్ చేసుకున్న పోలీస్ సిబ్బంది విధాత: ప్రభుత్వాన్ని, బిఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నించే రీతిలో కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ, ఆత్మీయ సదస్సులను నీరుగార్చేందుకు అధికార బిఅర్ఎస్ పార్టీ 'కట్టడి' వ్యూహాలకు సిద్ధపడింది. రాజకీయంగా బిఆర్ఎస్ స్టిట్టింగ్ ఎమ్మెల్యేలకు, గులాబీ పార్టీ ప్రతిష్టకు తెలంగాణ ఉద్యమకారుల సదస్సులు నష్టదాయకంగా పరిణమిస్తున్నాయని గ్రహించిన గులాబీ పార్టీ నాయకత్వం ఉద్యమకారుల సదస్సులను […]

- నామమాత్రంగా సాగిన ఉద్యమకారుల ఆత్మ గౌరవ సదస్సు !!
- సదస్సుకు హాజరుకాని ఉద్యమ, అసమ్మతి వాదులు
- సదస్సు ప్రసంగాలు నోట్ చేసుకున్న పోలీస్ సిబ్బంది
విధాత: ప్రభుత్వాన్ని, బిఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నించే రీతిలో కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ, ఆత్మీయ సదస్సులను నీరుగార్చేందుకు అధికార బిఅర్ఎస్ పార్టీ ‘కట్టడి’ వ్యూహాలకు సిద్ధపడింది. రాజకీయంగా బిఆర్ఎస్ స్టిట్టింగ్ ఎమ్మెల్యేలకు, గులాబీ పార్టీ ప్రతిష్టకు తెలంగాణ ఉద్యమకారుల సదస్సులు నష్టదాయకంగా పరిణమిస్తున్నాయని గ్రహించిన గులాబీ పార్టీ నాయకత్వం ఉద్యమకారుల సదస్సులను దెబ్బతీసే ఎత్తుగడలకు పదును పెట్టడంతో వలిగొండలో ఆదివారం నిర్వహించిన ఉద్యమ కారుల సదస్సు విఫలమైంది.
తాజాగా నల్గొండలో బిఆర్ఎస్ నల్గొండ నియోజకవర్గం మాజీ ఇన్‌చార్జి, ఉద్యమకారుడు చకిలం అనిల్ కుమార్ తెలంగాణ ఉద్యమకారులకు సొంత పార్టీ పాలనలో సాగుతున్న అన్యాయాలను ఏకరువు పెడుతూ నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మీయ సదస్సు జిల్లా రాజకీయాల్లో, అధికార బీఆర్ఎస్ లో కలకలం రేపింది. చకిలం సదస్సు ఉద్యమకారుల్లో నెలకొన్న అసంతృప్తిని బహిర్గతం చేసింది. చకిలం సదస్సు స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు నిర్వహించారు.
సదస్సుకు వెళ్లకుండా అడ్డుకోవడంలో సక్సెస్..
అయితే నల్గొండ ఉద్యమకారుల సదస్సు ప్రభావం జనంలోకి వెళ్లడంతో అప్రమత్తమైన బిఆర్ఎస్ నాయకత్వం రంగంలోకి దిగి వలిగొండ సదస్సుకు ఉద్యమకారులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లకుండా ముందస్తుగా ఫోన్లు చేసి నయానా భయానా కట్టడి చేసి అడ్డుకోవడంలో సఫలీకృతమయ్యారు. దీంతో వలిగొండలో ఉద్యమకారుల సదస్సుకు ఆశించిన స్థాయిలో ఉద్యమకారులు, ఉద్యమ కళాకారులు, మేధావులు, బిఆర్ఎస్ అసమ్మతి వాదులు హాజరు కాకపోవడంతో సదస్సు నామమాత్రంగా సాగింది.
అటు నల్గొండ, ఇటు వలిగొండలలో రెండు చోట్ల కూడా ఉద్యమకారుల ఆత్మీయ, ఆత్మగౌరవ సదస్సులకు వెళ్లకుండా అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల అనుచర వర్గమే తెరవెనక పావులు కదిపినట్లుగా ఆ రెండు సదస్సుల నిర్వాహకులు ఆరోపించడం ఈసందర్భంగా గమనార్హం. ఇంకోవైపు ప్రభుత్వ వేగులుగా పని చేసే స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఉద్యమకారుల సదస్సులపై నిఘా వేయడం, ఆద్యంతం వాటిని వీడియో కవర్ చేస్తుండడం కూడా సదస్సుల నిర్వహణకు ప్రతికూలంగా మారుతుంది.
కొట్లాడితే కంటగింపు తప్ప…
ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో ఎదురైన కేసులకు తోడు మళ్లీ ప్రభుత్వంతో, పోలీసులతో ఎందుకొచ్చిన పేచి అనుకుంటూ చాలామంది ఉద్యమకారులు సదస్సులకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు అధికార పార్టీలోని ఉద్యమకారులు, అసమ్మతి వాదులు తమ అధినాయకత్వంతో కొట్లాడి కంటగింపు కావడం తప్ప ఒరిగేదేమీ లేదన్న భావనతో పాటు ఒత్తిళ్లు, బుజ్జగింపుల నేపథ్యంలో వలిగొండ సదస్సుకు గైర్హాజరయ్యారు.
ఇప్పుడే ఇలా.. ఇక భవిష్యత్‌లో ఎన్ని చర్యలు తీసుకుంటారో…
నల్గొండ, వలిగొండ సదస్సులకు వచ్చిన ఎస్బి, ఐబి పోలీస్ సిబ్బంది ఆద్యంతం సదస్సు కార్యకలాపాల తీరు, హాజరైన వారి వివరాలు, వారి ప్రసంగాలు నోట్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇదంతా విశ్లేషిస్తే భవిష్యత్తులో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ అసమ్మతి వాదులు, ఉద్యమకారులు తలపెట్టే సదస్సులపై మరింత బలమైన కట్టడి చర్యలను అధికార పార్టీ వర్గాలు అమలు చేయడం ఖాయమన్న ప్రచారం వినిపిస్తుంది.
మార్చి 12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ రాష్ట్ర సదస్సు
వలిగొండలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సులో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మార్చి 12న హైదరాబాదులో నిర్వహించే ఆత్మగౌరవ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సదస్సులో రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ ఫోరం జిల్లాల వారీగా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సులు నిర్వహిస్తుందని, మార్చి 12న హైదరాబాదులో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తామన్నారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపిస్తామని స్పందించని పక్షంలో ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సొంత రాష్ట్రమొచ్చినా..
సదస్సులో మాట్లాడిన వక్తలంతా సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందన్నారు. కేసులు, జైళ్ల పాలై కష్టనష్టాలకు గురైన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వారికి తగిన పథకాలు, పదవులు ఇవ్వాలన్నారు. సొంత రాష్ట్రం వచ్చినప్పటికీ సీమాంధ్ర పెట్టుబడిదారుల రాజ్యమే సాగుతుందని, స్వరాష్ట్రంలో కూడా ఆత్మ గౌరవం కోసం, గుర్తింపు కోసం సొంత ప్రభుత్వాలపై మళ్లీ పోరాటాలు సాగించాల్సి రావడం దురదృష్టకరమన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పింఛన్, ఉచిత బస్సు పాస్ వసతి కల్పించాలని, ప్రభుత్వ పథకాల్లో 20 శాతం వాటా కేటాయించాలని, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత నివ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు సదస్సులో తీర్మానాన్ని ఆమోదించారు.
బిఆర్ఎస్ నేత తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా కన్వీనర్ సంగిశెట్టి క్రిస్టఫర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నరసయ్య ,ప్రధాన కార్యదర్శి పటోళ్ల సురేందర్ రెడ్డి, ఫోరం నాయకురాలు శివరాత్రి లక్ష్మమ్మ, కళ్యాణి, బిజెపి పార్లమెంట్ నియోజకవర్గం నేత బందారపు లింగస్వామి, పలు పార్టీల నాయకులు నోముల నర్సిరెడ్డి, చిలుకూరి సత్తిరెడ్డి, తుమ్మల యుగంధర్ రెడ్డి, గరిసే రవి, సమద్ తదితరులు పాల్గొన్నారు