వరంగల్ తూర్పు ఎమ్మెల్యేకు షాక్.. బీఆర్ఎస్ కార్పొరేటర్ల తిరుగుబాటు

వరంగల్ తూర్పు ఎమ్మెల్యేకు షాక్.. బీఆర్ఎస్ కార్పొరేటర్ల తిరుగుబాటు

అభ్యర్ధి మార్పునకు రహస్య మంతనాలు

అధిష్టానానికి దృష్టికి తేవాలని నిర్ణయం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కు బీఆరెస్‌ కార్పొరేటర్లు కోలుకోలేని షాకిచ్చారు. కొంతకాలంగా ఎమ్మెల్యే పై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్న కార్పొరేటర్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన వ్యవహారం గిట్టని 11 మంది కార్పొరేటర్లు, కొందరు ముఖ్యనాయకులు వరంగల్ లో రహస్యంగా గురువారం సమావేశమయ్యారు.

నరేందర్ అభ్యర్దిత్వాన్ని మార్చాలనే ఏకైక ఎజెండాతో ఈ కార్పొరేటర్లు సమావేశమై ఇటీవల ఎమ్మెల్యే నరేందర్ అనుసరిస్తున్న విధానం, తమను బెదిరించడం, ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం లాంటి అంశాలపై తీవ్రంగా స్పందించినట్లు చెబుతున్నారు. ఈ సమావేశంతో వరంగల్ తూర్పు బీఆరెస్‌లో ముసలం పుట్టినట్లేనని భావిస్తున్నారు.

నరేందర్ టికెట్ మార్చాల్సిందే

నరేందర్ అభ్యర్ధిత్వాన్ని మార్చాలని, క్షేత్ర స్థాయిలో నరేందర్ కు ఉన్న వ్యతిరేకతను వివరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు వివరించారు. ఉద్యమంలో ఆయనకన్నా సీనియర్లమనే విషయాన్ని విస్మరించి నరేందర్ వరంగల్ తూర్పును తన సామ్రాజ్యంగా భావిస్తున్నారనే విమర్శించారు. కొంత కాలంగా ఈ కార్పొరేటర్లంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ సమావేశానికి నిత్యం ఎమ్మెల్యే వెంట ఉండే ఒక కార్పొరేటర్ హాజరుకావడం విశేషం. ఆయన కూడా ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో ఉన్నారు.

అయితే ఈ విషయాలను ఆయన దృష్టికి తీసుకపోదామని ప్రతిపాదించగా మిగిలిన కార్పొరేటర్లు ససేమిరా అన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే బీఆరెసణ అధినేత, సీఎం కేసీఆర్ నరేందర్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాలను అధిష్టానం దృష్టికి తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మంత్రి హారీశ్‌రావును కలిసి విన్నవించాలనే నిర్ణయానికి వచ్చారు. అభ్యర్ధిని మార్చాలని, మార్చకుంటే ఎవరి భవిష్యత్తును వారు నిర్ణయించుకుంటామనే అంశాన్ని సైతం అధిష్టానానికి స్పష్టం చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ పరిణామాలకు నరేందర్ స్వయం కృతమే ప్రధాన కారణమంటున్నారు.

అనుమానం మధ్య టికెట్ ప్రకటన

వాస్తవానికి అభ్యర్ధులను ప్రకటించడానికి ముందే నరేందర్ కు టికెట్ ఇస్తారా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. చివరి వరకు నరేందర్ టికెట్ పై ఉత్కంఠ నెలకొంది. దీనికి ముందు వరంగల్లో జరిగిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ నరేందర్ అభ్యర్ధిత్వం పై అనుమానస్పదంగా మాట్లాడారు. దీంతో గులాబీ వర్గాలతో పాటు, రాజకీయ వర్గాల్లో నరేందర్ కు ఈ సారి టికెట్ వస్తుందో? లేదో? అనే అనుమానాలు నెలకొన్నాయి.

అభ్యర్ధిగా ప్రకటించకపోవడంపై అప్పుడు స్వయంగా నరేందర్ మీడియాతో స్పందిస్తూ ఇంటిమనిషిని కాబట్టే కేటీఆర్ తన పేరు ప్రకటించలేదని నరేందర్ సమర్ధించుకున్నారు. ఈ కారణంగా తొలిజాబితా ప్రకటన సందర్భంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఈ స్థితిలో కేసీఆర్ తొలి జాబితాలోనే నరేందర్ పేరు ప్రకటించడంతో ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. సిటింగ్ ఎమ్మెల్యేలందరికీ అవకాశం కల్పించడం వల్ల నరేందర్ కు అవకాశం దక్కిందని భావించారు. ఈ స్థితి నుంచి ఇప్పుడిప్పుడిప్పుడే నరేందర్ బయటికొచ్చి డివిజన్ లలో పర్యటిస్తున్నారు. ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నారు.

ఈ సమయంలో 11 మంది గులాబీ కార్పొరేటర్లు ఆయనకు షాకిస్తూ రహస్య సమావేశం కావడంతో నరేందర్ కు కంటిమీద కునుకులేకుండా తయారైంది. అనేక ఇబ్బందులు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న కార్పొరేటర్లు ఈ దఫా అన్నింటికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఈ కార్పొరేటర్లు ఇదే పట్టుదలతో ఉంటారా? అధిష్టానం బుజ్జగిస్తేనో? ఇతరత్రా కారణాలతో వెనక్కుతగ్గుతారా? అనే చర్చ సాగుతోంది.