బడ్జెట్‌లో చూపాల్సినవి.. భారీ అం(రం)కెలు కాదు (ప్రత్యేక కథనం)

విధాత‌: కేంద్రంలో అధికారానికి ఉవ్విలూరుతూ దేశవ్యాప్త సంచారానికి బయలుదేరిన రాష్ట్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని దేశానికి అంకెల్లో చూపి ఆదర్శంగా నిలవాలని ప్రతి ఏటా చెప్పినట్లుగానే 15% బడ్జెట్ను పెంచి మరోసారి దేశానికి దిశా నిర్దేశం చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించ చూసిన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనే ఈ బడ్జెట్ స్వరూప స్వభావాలుగా కనిపిస్తున్నాయ‌ని డా.ఏ.పున్నయ్య(అర్థశాస్త్ర విభాగం, తెలంగాణ విశ్వవిద్యాలయం) విమ‌ర్శించారు. అందులో భాగంగానే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే శాసనసభ ఎన్నికలకు ముందు ప్రవేశ […]

బడ్జెట్‌లో చూపాల్సినవి.. భారీ అం(రం)కెలు కాదు (ప్రత్యేక కథనం)

విధాత‌: కేంద్రంలో అధికారానికి ఉవ్విలూరుతూ దేశవ్యాప్త సంచారానికి బయలుదేరిన రాష్ట్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని దేశానికి అంకెల్లో చూపి ఆదర్శంగా నిలవాలని ప్రతి ఏటా చెప్పినట్లుగానే 15% బడ్జెట్ను పెంచి మరోసారి దేశానికి దిశా నిర్దేశం చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించ చూసిన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనే ఈ బడ్జెట్ స్వరూప స్వభావాలుగా కనిపిస్తున్నాయ‌ని డా.ఏ.పున్నయ్య(అర్థశాస్త్ర విభాగం, తెలంగాణ విశ్వవిద్యాలయం) విమ‌ర్శించారు. అందులో భాగంగానే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే శాసనసభ ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టె పూర్తీ స్థాయి బడ్జెట్ ఇది. అందువల్ల ఈ బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని దూకుడు పెంచి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాకపోయినా అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ముందుకు వెళ్తున్నదని ఆర్థిక మంత్రి చెప్పారు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న ఆలోచనతో బడ్జెట్‌ కేటాయింపులు చేశామని అభివృద్ధి, సంక్షేమంలోనూ దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలిచిందని తెలిపారు. తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరిస్తున్నదని పేర్కొన్నారు.

ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని గంబీరమైన మాటలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో చూడవలసినవి గంభీరమైన ప్రకటనలు, ఉదాత్త ఆదర్శాలు, భారీ అంకెలు కాదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి గతించిన 9 ఏండ్లలోనూ ఏ బడ్జెట్ లోను వాటికి కొదవలేదు.

ఈ బడ్జెట్ 2022-23లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లు ఉండగా దానికి 15 శాతం నిధులను పెంచి 2023 -24 ఆర్థిక సంవత్సరానికి రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. కాగా ఈ బడ్జెట్ కేవలం ఎన్నికల ముందు ప్రజలను ఆకర్షించే బడ్జెట్ గా అభివర్ణించక తప్పదు. గత బడ్జెట్లలో కేటాయించిన కేటాయింపుల్లో ఖర్చు చేసిన మొత్తాన్ని అంచనా వేసుకోకుండా తిరిగి అదేపనిగా అప్పుల కుప్పలను తెచ్చి పెట్టుకోవడానికి చూపించే స్థిరాస్తి పత్రాలను చూపించినట్లుగా ఈ బడ్జెట్ ఉంది.

ఇందులో మూలధన వ్యయం 2,11,685 కోట్లు కాగా, పెట్టుబడి వ్యయం కేవలం 37,525 కోట్లు కేటాయించారు. అంటే మొత్తం బడ్జెట్లో పెట్టుబడి వ్యయం కేవలం 12.9శాతం మాత్రమే. గత బుడ్జెట్లను పరిశీలిస్తే వాస్తవంగా 10 శాతం మించి ఖర్చు పెట్టుటలేదు. పెట్టుబడి వ్యయం ఇంత తక్కువ మోతాదులో ఉండటాన్ని గమనిస్తే పాలకుల దార్శనికత చెప్పకనే చెప్పినట్లు అర్థ‌మౌతుంది.

మొత్తం రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,11, 685కోట్లు, నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు కేటాయించారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు, ఆయిల్ ఫామ్ సాగుకు రూ.1000కోట్లు, దళితబంధు పథకానికి రూ.17.700 కోట్లు, ఆసరా పెన్షన్లకు రూ.12,000కోట్లు కేటాయించారు.

ఎస్సీ ప్రత్యేక నిధి రూ.36,750 కోట్లు, ఎస్టీ ప్రత్యేక నిధి రూ.15,233, బీసీ ప్రత్యేక నిధి రూ. 6,229 కోట్లు, మహిళ శిశు సంక్షేమం రూ. 2,131 కోట్లు, అటవీ శాఖరూ. 1,147 కోట్లు విద్య రంగం రూ. 19,093 కోట్లు వైద్యం కోసం రూ. 12, 161 కోట్లు కల్యాణలక్ష్మీ పథకానికి రూ.. 2వేల కోట్లు, షాదీముబారక్ కోసం రూ. 450 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ. 26,931 కోట్లు, మైనార్టీ సంక్షేమం రూ.2200 కోట్లు, రైతు రుణమాఫీ రూ.6385 కోట్లు, రైతు బంధు రూ.15075 కోట్లు, రైతు బీమా రూ. 1589 కోట్లు కేసీఆర్ కిట్ రూ. 200 కోట్లు హైదరాబాద్ ఎయిర్ పోర్టు రూ.500 కోట్లు పాతబస్తీ మెట్రో రూ. 500 కోట్లు, పౌరసరఫరాలు రూ. 3000 కోట్లు ప్రతి కేటాయింపు అంకెతో పాటు మరో రెండు గణాంకాలు ఉంటాయి.

2023 -24 బడ్జెట్ కేటాయింపుతో పాటు 2022 -23 సవరించిన అంకె 2021 -22 వాస్తవ గణాంకాలు ఉంటాయి. మొదటి అంకే భారీగా ఉందని మురిసిపోవడం కన్నా 2022- 23 ఎంత ప్రతిపాదిస్తే ఎంతగా సవరణ గురయింది. 2021- 22 ఎంత ప్రతిపాదించి ఎంతకు సవరించి ఎంతగా వాస్తవమైంది అనేది చూడాలి.

అప్పుల గురించి చెప్పలేదు

2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయం వృద్ధి రేటు 11.8 శాతం నమోదు చేసి రికార్డు సృష్టించిందని గొప్పగా చెప్పి దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్‌ నివేదికలో పేర్కొన్నదని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు, దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ నమోదు అవుతుంది.

2014-15 సంవత్సరంలో దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.1 శాతం ఉండగా, 2020-21 నాటికి 4.9 శాతానికి పెరిగిందిని దేశ జనాభాలో కేవలం 2.9 శాతం మాత్రమే తెలంగాణలో ఉండగా దేశ జీడీపీలో తెలంగాణ భాగస్వామ్యం 4.9 శాతానికి కావడం మనందరికీ గర్వకారణమని దేశంలోని 18 ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ మెరుగైన వృద్ధి రేటు సాధిస్తున్నది.

2015-16 నుంచి 2021-22 వరకు 12.6 శాతానికి జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ 3వ స్థానంలో ఉందని బాకాలూదుకున్నారు. కానీ తలసరి అప్పు గురించి ప్రస్తావించకపోవడం శోచనీయం. అప్పుకు సంబంధించిన వివరాలు రాష్ట్ర బడ్జెట్ పుస్తకాలలోనే కాకుండా కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పును ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య పంచారు.

తెలంగాణ రాష్ట్ర వాటాకు 69,603 కోట్ల రూపాయల అప్పు వచ్చింది. అటు తరువాత రాష్ట్ర అప్పు, స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో అప్పుల వాటా భారీగా పెరిగింది. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరం దాకా, ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి రోజున అంటే ప్రతి మార్చి 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పు (కోట్ల రూపాయలలో) ఇలా ఉంది (బ్రాకెట్లో ఉన్న అంకె రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పు శాతాన్ని సూచిస్తుంది):

సంవ‌త్స‌రం అప్పు కోట్ల‌లో అప్పు శాతం

2015 79,880 (15.79)
2016 91,999 (16.95)
2017 1,34,738 (20.44)
2018 1,65,849 (22.11)
2019 1,96,963 (22.90)
2020 2,32,181 (23.77)
2021 2,78,018 (28.11)
2022 3,12,191 (27.03)

మన వాటాకు రూ.69,603 కోట్ల అప్పు వస్తే, అది మార్చి 2022 నాటికి రూ.3,12,191 కోట్లకు పెరిగగా 2023 లో మరింత పెరిగింది. అంటే గత తొమ్మిది సంవత్సరాలో తెలంగాణ రాష్ట్ర అప్పు సుమారు ఐదు రెట్లు పెరిగింది. ఎఫ్ ఆర్ బి ఎం చట్టం ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం మించరాదు. అంటే ఈ బడ్జెట్ గణాంకాల ప్రకారం 60 వేల కోట్లు మించరాదు.

పైగా ప్రభుత్వ పూచీకత్తుతో అప్పు తెచ్చుకున్న ఆయా సంస్థలకు స్వంత ఆదాయం లేదు. వాటికి అప్పు చెల్లించే శక్తి లేదు. ఉదాహరణకు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌కు కానీ, గొర్రెల, మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్‌కు గానీ స్వంత ఆదాయం లేదు. ఈ సంస్థలు అప్పు కట్టగలిగే స్థితిలో లేవు. ప్రభుత్వమే వాటి అప్పును భరించక తప్పదు. బడ్జెట్ వెలుపల కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పులు, కాగ్ నివేదిక ప్రకారం, మార్చి 2021 నాటికి రూ.97,940 కోట్లు వున్నాయి. ఈ మొత్తాన్ని కూడా రాష్ట్ర అప్పుల ఖాతాలో జమ చేయవలసిందేనని కాగ్ చెప్పుతున్న మాటను అంగీకరించకతప్పదు.

సంస్థల పేరుతో ప్రభుత్వం తెచ్చిన అప్పును కూడా కలిపితే పైన ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పుల కంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. బడ్జెట్ వెలుపల తెచ్చిన అప్పులలో కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో తెచ్చిన అప్పులే మూడు పాళ్ళు ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రభుత్వ జమానతుతో తెచ్చిన అప్పు 36,056 కోట్ల రూపాయలు. మిషన్ భగీరథకు ప్రభుత్వం జమానతు పడి ఇప్పించిన అప్పు 25,006 కోట్ల రూపాయలు.

విద్య‌, వైద్య రంగాల‌కు దక్కని ప్రాధాన్యం

అధికారంలోకి వస్తే ప్రపంచ స్థాయి విద్యా విధానాన్ని ప్రవేశపెడతానని కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేస్తామని ప్రకటించి తొమ్మిది సంవత్సరాలు గడిచినప్పటికీ ఒక్కసారి కూడా సమీక్షకు గురి గాని విద్యారంగం ఈ సారికూడా నిరాదరణకు గురైంది. ప్రాథమిక స్థాయి మొదలుకొని విశ్వవిద్యాలయం వరకు సర్వీస్ నిబంధనలు లేవు. పిట్టల్లా వేలాదిమంది ఉద్యోగవిరమణ‌ చేస్తుంటే ఖాళీలను నింపిన దాఖలాలు లేవు. ప్రాథమిక విద్యారంగం సగానికి పైగా ప్రవేట్ పరం చెందగా ఉన్నతవిద్య 80 పైగా ప్రయివేటు చేతుల్లోకి పోయింది.

విశ్వవిద్యాలయాల్లో నియామకాలు పరిశోధనలకు నిధులు లేక విశ్వవిద్యాలయాలన్ని వెలవెల బోవుచున్నాయి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం మొత్తం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు. 2014లో తెలంగాణ అధికారంలోకి వచ్చినప్పుడు విద్యారంగానికి 15% నిధులను కేటాయిస్తే ఈ తొమ్మిది సంవత్సరాలలో విద్యారంగం నిధులు తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చి ఈ బడ్జెట్‌లో 5.5% కేటాయించడం శోచణీయంగా ఉంది. ఈ నిధులతో విద్యా రంగాన్ని ఏమాత్రం ముందుకు తీసుకుపోలేమనేది కాదనలేని సత్యం.

కీలక హామీలు మరిచిన ప్రభుత్వం

ఎన్నికల హామీలో భాగంగా హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి గిరిజన బంధు వంటి హామీలను పట్టించుకోలేదు. 2019 ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేలు ఇస్తామని ప్రకటించారు నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు కార్యాచరణ రూపొందించలేదు. తాజాగా ఎన్నికల సంవత్సరంలోనైనా ఈ హామీని నెరవేరుస్తారని అందరు ఆశించారు.

కానీ, ఈ బడ్జెట్లో ఆ ఊసే ఎత్తక పోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. అనేక ఆదివాసి బంజారా వేదికల మీద గిరిజన బంధుపై ప్రకటనలు చేశారు. దళిత బంధు తరహాలోనే అర్హులైన గిరిజనులకు 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. కానీ బడ్జెట్లో ఈ హామీ గురించి ప్రస్తావన లేకపోవడం గిరిజనులు ఆదివాసులు తీవ్ర నిరాశలోకి నెట్టబడ్డారు.

అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేస్తామని ప్రకటించి సఫలం కానీ ప్రభుత్వం కొత్తగా ఖాళీ స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం గతంలో రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించింది. అయితే తాజా బడ్జెట్లో గతంలో ప్రకటించిన మొత్తంలో రూ . 2 లక్షలు తగ్గించి రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటన చేయడాన్నిఇండ్ల కోసంఎదురుచూసే పేదలు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

బంధువులతో పెన్షన్లతో అధికారాన్ని మరో మారు సంపాదించుకోవడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ గా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే అనేక విధాలుగా అప్పులు సమీకరించుకోవడం ఎలాగో ఆలోచిస్తూ మరొకవైపు ఓట్లు సంపాదించుకోవడం ఎలాగో ప్రణాళిక రచించుకుంటున్న తరుణమిది. కావున ఈ బడ్జెట్ ఈ ఆలోచననే ప్రతిఫ‌లింపజేసింది.

ఇప్పటికే తన బంధువుల బాంధవిగా ముద్రపడ్డ ప్రభుత్వం ఈ బంధులతోనైనా బయట పడాలని చూస్తున్నట్లు బడ్జెట్ స్పష్టం చేస్తుంది. అయినా హామీ ఇచ్చినట్లు గిరిజన బంధువు కానీ నిరుద్యోగ భృతి గాని ఈ బడ్జెట్‌లో కేటాయింపులకు నోచుకోలేదు. మౌలికంగా ప్రజల జీవన ప్రమాణాలను, మానవీయ విలువలను పెంచే దిశగా కాకుండా ఇంకెంత కాలం పరాన్న బుక్కులుగా ప్రజల్ని తీర్చిదిద్దాలని అనుకుంటుందో అర్థం కాని పరిస్థితి.

– డా.ఏ.పున్నయ్య, అర్థశాస్త్ర విభాగం, తెలంగాణ విశ్వవిద్యాలయం