జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రేసులో ఇద్దరు కోడళ్లు

భూమి కుంభ­కో­ణంలో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌ అరెస్టు అని­వా­ర్యంగా కని­పి­స్తున్న నేప­థ్యంలో ఆయన భార్య కల్ప­నా­సొ­రే­న్‌కు బాధ్య­తలు అప్ప­గి­స్తా­రనే

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి రేసులో ఇద్దరు కోడళ్లు
  • కల్పనకు ఉప ఎన్నిక చిక్కు
  • సీతా సొరేన్‌ ఇప్పటికే ఎమ్మెల్యే

రాంచీ: భూమి కుంభ­కో­ణంలో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌ అరెస్టు అని­వా­ర్యంగా కని­పి­స్తున్న నేప­థ్యంలో ఆయన భార్య కల్ప­నా­సొ­రే­న్‌కు బాధ్య­తలు అప్ప­గి­స్తా­రనే అభి­ప్రా­యాలు ఉన్నాయి. అయితే.. కల్ప­నకు ఇంట్లోనే పోటీ ఉండటం విశేషం. జార్ఖండ్‌ ముక్తి మోర్చా వ్యవ­స్థా­ప­కుడు శిబు­సొ­రే­న్‌కు ఇద్దరు కొడు­కులు. పెద్ద కొడుకు దుర్గా సొరేన్‌ 2009లో 39 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆయన భార్య సీతా సొరేన్‌. హేమంత్‌ సొరేన్‌ను అరెస్టు చేసిన పక్షంలో ఆయన భార్య కల్పనకు పగ్గాలు అప్పగిస్తారన్న చర్చ జరుగుతున్నప్పటికీ ఆమెను ముఖ్యమంత్రిగా నియమించడంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద కోడలు సీతా సొరేన్‌ రేసులోకి వచ్చారు. కుటుంబంలో కలహాలు జేఎంఎంలో అస్థిరతకు దారి తీసే అవకాశాలు లేకపోలేదన్న చర్చ జరుగుతున్నది. జేఎంఎం సంకీర్ణ సర్కారుకు 49 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. ఇందులో 35 మంది మంగళవారం ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారని సమాచారం. మిగిలినవారు సీతా సొరేన్‌కు మద్దతుదారులనే వాదన వినిపిస్తున్నది. వీరు కల్పనను సీఎం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. హేమంత్‌ సొరేన్‌ ఇప్పటికే బీజేపీ నుంచి, కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు సొంత పార్టీ ఎమ్మెల్యే, వదిన సీతా సొరేన్‌ కూడా సొరేన్‌ ప్రభుత్వ అవినీతిపై విమర్శలు చేశారు.


‘గురూజీ (శిబు సొరేన్‌) ఆశయాలు, నా భర్త జల్‌, జంగిల్‌, జమీన్‌ నినాదాలను నాశనం చేశారు’ అని 2022లో సీతా సొరేన్‌ వ్యాఖ్యానించారు. ‘అవినీతి అధికారులను కాపాడుతున్నారు. మా ప్రభుత్వం మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు అవన్నీ ఆవిరైపోతున్నాయి’ అని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ఎంత వరకు కలిసివస్తారనే చర్చలు ఉన్నాయి. అయితే.. పార్టీ యవత్తూ కల్పనకు మద్దతు పలికిందని, హేమంత్‌ సొరేన్‌ అరెస్టయిన పక్షంలో ఆమెకు ఎవరూ ఎదురునిలిచే అవకాశాలు లేవని సీనియర్‌ పాత్రికేయుడు ఒకరు అన్నారు. కానీ.. జార్ఖండ్‌లో ప్రభుత్వం మారుతుందని తాను ముందు నుంచీ చెబుతూ వస్తున్నానని, ఇప్పుడే అదే జరుగుతుందని గొడ్డా బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే అన్నారు. ‘హేమంత్‌ సొరేన్‌ రాజీనామా చేస్తారు. ఆయన స్థానంలో ఆయన భార్య కల్పన పగ్గాలు స్వీకరిస్తారు. కొత్త ఏడాది సొరేన్‌ఫ్యామిలీకి తలనొప్పులు సృష్టించే అవకాశం ఉన్నది’ అని ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.


ఇదిలాఉంటే.. కల్పన ఎమ్మెల్యే కాదు. గతంలోనూ ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిందీ లేదు. కానీ.. సీతాసొరేన్‌ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దానికి తోడు తన మామ శిబు సొరేన్‌, తన భర్త దుర్గా సొరేన్‌ రాజకీయ వారసత్వానికి సహజ వారసురాలినని చెప్పుకొనే సీతా సొరేన్‌ రంగంలో ఉండటం ఆసక్తి రేపుతున్నది. అయితే ‘నేను శిబు కుటుంబంలో పెద్ద కోడలిని. నా భర్త జార్ఖండ్‌ ఏర్పాటు కోసం పోరాడారు. నేను హేమంత్‌ సొరేన్‌ వారసుడిగా గుర్తించాను తప్ప.. వేరొకరిని కాదు’ అని తాజాగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కల్పన సొరేన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి తాను అంగీకరించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. తాను ఇంటికి పెద్ద కోడలినని, తనకు హక్కులు ఉంటాయని చెప్పారు. మరోవైపు దుర్గాసొరేన్‌ ఇద్దరు కుమార్తెలు రాజశ్రీ సొరేన్‌, జయాసొరేన్‌ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుర్గొ సొరేన్‌ సేన పేరిట వేరే వేదికను స్థాపించారు.

అయితే.. తమది రాజకీయ వేదిక కాదని ఇద్దరు కుమార్తెలూ చెబుతున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటమే తమ లక్ష్యమని అంటున్నారు. తమకు తమ తాత శిబు సొరేన్‌ ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారు. 2021లో 12 మంది విద్యార్థి విభాగం నాయకులను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నదంటూ జేఎంఎం బహిష్కరించింది. తదుపరి వారంతా దుర్గాసొరేన్‌ సేనలో చేరారు. శిబు సొరేన్‌ చిన్న కొడుకు బసంత్‌ సైతం దుర్గా సొరేన్‌ సేనలో చేరారు. అయితే.. తల్లి సీతా సొరేన్‌తో ఆమె ఇద్దరు కుమార్తెల అనుబంధంపై జేఎంఎం ప్రస్తుతానికి మౌనంగానే ఉంటున్నది. కల్పన, సీత.. ఇద్దరూ ఒడిశాలోని మయూర్భంజ్‌ జిల్లాకు చెందినవారే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముది కూడా ఇదే జిల్లా.