పదిహేనేళ్ల తిరుగుబాటు అనంతరం.. బీజేపీ గూటికి సీత

సీతాసొరేన్‌! పదిహేనేళ్లుగా జార్ఖండ్‌లో సొరేన్‌ కుటుంబంతో పోరాటం చేస్తున్న నాయకురాలు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా ఎమ్మెల్యే, ఆ పార్టీ వ్యవస్థాపకుడు షిబు సొరేన్‌ పెద్ద కోడలు!

పదిహేనేళ్ల తిరుగుబాటు అనంతరం.. బీజేపీ గూటికి సీత

రాయ్‌పూర్‌: సీతాసొరేన్‌! పదిహేనేళ్లుగా జార్ఖండ్‌లో సొరేన్‌ కుటుంబంతో పోరాటం చేస్తున్న నాయకురాలు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా ఎమ్మెల్యే, ఆ పార్టీ వ్యవస్థాపకుడు షిబు సొరేన్‌ పెద్ద కోడలు! ఇప్పుడు కుటుంబం నుంచి వేరుపడిపోయి.. ఆ పార్టీకి సైతం రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల వేళ తన కుమార్తెలతో కలిసి మంగళవారం బీజేపీ గూటికి చేరారు. ఆమె భర్త దుర్గా సొరేన్‌ 39 ఏళ్ల వయసులోనే 2009లో చనిపోయారు. అప్పటికి జేఎంఎం వ్యవస్థాపకుడు షిబు సొరేన్‌కు దుర్గా సొరేన్‌ రాజకీయ వారసుడని భావించేవారు. అతడికి ఇద్దరు సోదరులు హేమంత్‌, బసంత్‌, సోదరి అంజని ఉన్నారు. వారిలో దుర్గా సొరేన్‌ పెద్దవాడు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని స్వీకరిస్తారని భావిస్తున్న సమయంలో అకాల మరణానికి గురయ్యారు. దుర్గా సొరేన్‌కు భార్య సీత, కుమార్తెలు రాజశ్రీ, జయశ్రీ, విజయశ్రీ ఉన్నారు.

జార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో దుర్గా సొరేన్‌ ముందుండి పోరాడారు. ఆయన మరణానంతరం జేఎంఎంలో సీతా సొరేన్‌, ఆమె కుమార్తెలు ప్రత్యేకవర్గంగా మారారు. దాదాపు పదిహేనేళ్లు ఆమె షిబు కుటుంబంతో పార్టీలో ఉంటూనే పోరాటం చేశారు. మూడుసార్లు జేఎంఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉన్నదని సీతా సొరేన్‌ ఆరోపించారు. పార్టీకి, తాను గెలిచిన జమా నియోజకవర్గానికి కూడా ఆమె రాజీనామా సమర్పించారు. ‘మమ్మల్ని పార్టీ నుంచి, కుటుంబం (సొరేన్‌) నుంచి దూరం పెట్టారు. అది నన్నెంతో బాధిస్తున్నది’ అని తన మామ గురూజీ బాబా (షిబుసొరేన్‌)కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మన విలువలు, సిద్ధాంతాలతో పోలికలేని వారి చేతిలో ప్రస్తుతం పార్టీ ఉన్నదని లేఖలో తెలిపారు. పైగా తనను, తన కుమార్తెలను చంపేందుకు భారీ కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. జేఎంఎంకు రాజీనామా చేసిన కొద్ది గంటలకే ఆమె ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరారు.

తనను ప్రధానంగా రెండు ఘటనలు పార్టీకి రాజీనామా చేసేందుకు కారణమయ్యాయని బీజేపీలో చేరిన సందర్భంగా సీత చెప్పారు. వరుసగా తమను పార్టీకి దూరం చేశారని, పార్టీ కోసం 14 సంవత్సరాల పదినెలలు కష్టపడి పనిచేసినా.. తనను పార్టీలో అంటరానివారిగా చూశారని ఆమె ఆరోపించారు.

జేఎంఎం పగ్గాలు షిబుసొరేన్‌ చేతిలోనే ఉన్నప్పటికీ.. దుర్గా సొరేన్‌ జీవించి ఉన్నంత కాలం పార్టీలో టాప్‌ పొజిషన్‌లో ఉండేవారు. ఒక్కోసారి తన తండ్రి మాటలను కూడా ధిక్కరించేవారని సీనియర్‌ జర్నలిస్టులు చెబుతున్నారు.