♦ వైసీపీ అరాచకాలు పెట్రేగాయి..
♦ కుప్పలు తెప్పలుగా నకిలీ ఓట్లు
♦ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న వైసీపీ
♦ కేంద్ర ఎన్నికల సంఘానికి
♦ టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు
♦ విజయవాడలో సీఈసీ సమీక్షకు హాజరైన చంద్రబాబు, పవన్
♦ అక్రమ కేసులు, నకిలీ ఓట్లపై రాతపూర్వకంగా ఫిర్యాదు
రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. మంగళవారం వారు విజయవాడలోని నోవాటెల్ హోటెల్ లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ రాష్ట్రంలో ఎన్నికల ముందు అధికార వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, నకిలీ ఓట్ల నమోదుపై రాతపూర్వకంగా ఫిర్యాదుచేశారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని తెలిపారు. ఈనేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ ఓట్లు చేర్చి, ఎన్నికల్లో లబ్ధిపొందాలని వైసీపీ కుట్రలు పన్నుతున్నట్లు ఆరోపించారు.
రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అరాచకాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులను అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు, కార్యకర్తలపై సుమారు 7 వేల కేసులు పెట్టినట్లు పేర్కొన్నారు. ఒక్క పుంగనూరులోనే 200 మందికి పైగా జైలుకు వెళ్లి వచ్చారని, ఇది వైసీపీ అరాచకానికి పరాకాష్టగా చంద్రబాబు అభివర్ణించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి, ఎన్నికల్లో వారు దూరంగా ఉండేలా చేయడమే వైసీపీ పన్నాగమని ఆరోపించారు.
ఎన్నికల విధులకు అనుభవం ఉన్న సిబ్బందిని నియమించాలని కోరామన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను విధుల్లో ఉంచుతారా? బీఎల్వోలుగా 2600 మంది మహిళా పోలీసులను నియమించారని సీఈసీకి వివరించామన్నారు. అవసరమైతే కేంద్ర పోలీసులు, పరిశీలకులను రాష్ట్రానికి పంపాలని కోరామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నాలన్నీ చేస్తామని, ఒక్క దొంగ ఓటు ఉన్నా ఈసీ దృష్టికి తీసుకెళ్లేలా పనిచేస్తామన్నారు. వైసీపీ రాష్ట్రంలో కొనసాగిస్తున్న అరాచకాలను సీఈసీకి వివరించామని చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సీఈసీ హామీ ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నమోదవుతున్న దొంగఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు లక్షకు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు అన్ని అంశాలను సీఈసీకి వివరించారని పవన్ కళ్యాణ్ చెప్పారు.
♦ సీఈసీ రెండు రోజుల వరుస సమీక్షలు
రానున్న ఎన్నికలకు సన్నద్ధత, ఓటర్ల జాబితాపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనుంది. తొలిరోజు మంగళవారం విజయవాడలోని నోవాటెల్ హోటెల్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. ఈసందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలక్షన్ కమిషనర్ తో సమావేశమయ్యారు. మధ్యాహ్నం నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతినిధులు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. కాగా సోమవారం రాత్రి ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ చేరుకున్నారు.
వారికి విమానాశ్రయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, కృష్ణ జిల్లా కలెక్టర్ పీ రాజాబాబు, ఎస్పీ జాషువా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పీ సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వాగతం పలికారు. నగరంలోని నోవాటెల్ హోటెల్ లో కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి బస, అధికారిక కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు పార్లమెంట్, అసెంబ్లీ-2024 ఎన్నికల సన్నద్ధతపై వరుస కార్యక్రమాలతో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు, సమీక్షలు చేయనుంది.