యూనివర్సిటీల్లో నిరసన సెగలు
కొన్నేళ్లుగా యూనివర్సిటీలు, ఐఐటీ విద్యాసంస్థలలో మౌలిక వసతుల కల్పన పట్ల పాలక వర్గాలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం విద్యార్థులను వరుసగా ఆందోళన బాటలో నడిపిస్తుంది

- జేఎన్టీయూ..ఉస్మానియాలలో విద్యార్థుల ఆందోళనలు
విధాత : కొన్నేళ్లుగా యూనివర్సిటీలు, ఐఐటీ విద్యాసంస్థలలో మౌలిక వసతుల కల్పన పట్ల పాలక వర్గాలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం విద్యార్థులను వరుసగా ఆందోళన బాటలో నడిపిస్తుంది. తాజాగా గురువారం జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలలో ఒకే రోజున విద్యార్థుల ఆందోళనలు సాగిన తీరు మరోసారి యూనివర్సిటీల సమస్యల తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. విద్యార్థుల భోజన సమస్యలపై జేఎన్టీయూ ప్రిన్సిపాల్ చిన్నచూపు చూస్తున్నారని ఆరోపిస్తు జేఎన్టీయూ యునివర్సిటీ పీజీ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పీజీ యూనివర్సిటీ మెస్‌లో భోజనంలో పురుగులు, రబ్బర్ బ్యాండ్లు ,గాజు పెంకులు వస్తున్నాయని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు నాణ్యమైన భోజనం అందించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్ విద్యార్థినిలు తమకు భద్రత కరవైందని, రక్షణ చర్యలు తీసుకోవాలంటు రోడ్డెక్కారు. యూనివర్సిటీ గేట్లు మూసివేసి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. లేడీస్ హాస్టల్‌లో రాత్రివేళ దుండగులు చొరబడి డోర్లు కొడుతున్నారని, తమకు సరైన సెక్యూరిటీ కల్పించి ఆకతాయిల చేష్టల నుంచి రక్షించాలని వారు డిమాండ్ చేశారు.