CM KCR: ఉన్నపళంగా.. అధినేత ఆత్మీయ సందేశం ఉద్దేశం?

రాజ‌య్య‌, ఈట‌లపై చూపిన దూకుడు కూతురు విష‌యంలో ఎక్క‌డ‌..? ప్ర‌జ‌ల్లో విశ్వాసం కొన‌సాగేనా..? మున్సిపాలిటీల్లోనూ సొంత నేత‌లే తిరుగుబాటు జెండా సీఎం కేసీఆర్‌(CM Kcr) బీఆర్‌ఎస్‌(BRS) శ్రేణులకు ఇచ్చిన ఆత్మీయ సందేశంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే బాగుంటే సరిపోదని, దేశమంతా బాగుండాలని.. అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌తో ముందుకు వెళ్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌పై బీజేపీ (BJP) బరితెగింపు దాడులు చేస్తున్నదని.. తెలంగాణ ప్రగతిని అడుగడుగునా అడ్డుకుంటున్నదని.. వేల దాడులు.. లక్షల […]

CM KCR: ఉన్నపళంగా.. అధినేత ఆత్మీయ సందేశం ఉద్దేశం?
  • రాజ‌య్య‌, ఈట‌లపై చూపిన దూకుడు కూతురు విష‌యంలో ఎక్క‌డ‌..?
  • ప్ర‌జ‌ల్లో విశ్వాసం కొన‌సాగేనా..?
  • మున్సిపాలిటీల్లోనూ సొంత నేత‌లే తిరుగుబాటు జెండా

సీఎం కేసీఆర్‌(CM Kcr) బీఆర్‌ఎస్‌(BRS) శ్రేణులకు ఇచ్చిన ఆత్మీయ సందేశంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే బాగుంటే సరిపోదని, దేశమంతా బాగుండాలని.. అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌తో ముందుకు వెళ్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌పై బీజేపీ (BJP) బరితెగింపు దాడులు చేస్తున్నదని.. తెలంగాణ ప్రగతిని అడుగడుగునా అడ్డుకుంటున్నదని.. వేల దాడులు.. లక్షల కుట్రలను ఛేదించిన పార్టీ మనది. నాడు మనం భ‌యపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? బీఆర్‌ఎస్‌ ప్రయాణంలో మీరే నా బలం.. బలగం అన్నారు. ఇది ఎన్నికల ఏడాది కాబట్టి నిత్యం ప్రజల్లో ఉండాలని.. పనికిమాలిన పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం తన ఆత్మీయ సందేశంలో పేర్కొన్నారు. – (విధాత‌)

ఇలా అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ష్ట‌మే..

మద్యం కేసులో కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటుండటం, ఈ కేసులో ఆమెను ఈడీ ఇప్పటికే రెండుసార్లు విచారించింది. రాష్ట్రాభివర్బావం తర్వాత ఏ రాష్ట్రంలో లేని విధంగా లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నబీఆర్‌ఎస్‌కు టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆత్మరక్షణలో పడింది.

ఎందుకంటే కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలు, లంబకోణాలు అంటూ వారిని ఎద్దేవా చేసిన కేసీఆర్‌.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా బీజేపీలోకి వెళ్లగానే నిర్మ వాషింగ్‌ పౌడర్‌ యాడ్‌ లెక్క స్వచ్ఛంగా మారిపోయారని సెటైర్లు వేశారు. ఆయన రెండు జాతీయ పార్టీలపై చేసిన ఆరోపణలు.. విమర్శలనే ప్రస్తుతం సీఎం కుటుంబంపై, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకు పడుతున్నాయి.

ఈ ఉదంతాలపై కేసీఆర్‌, కేటీఆర్‌.. ఆ పార్టీ ముఖ్యనేతలంతా పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా.. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నామనే ఆందోళన అంతర్గతంగా ఉన్నది. ఇలాగైతే త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమే అనే అభిప్రాయం ఉన్నది.

CM KCR | చివరికి ధర్మమే జయిస్తుంది.. BRS శ్రేణులకు CM KCR లేఖ

తారా స్థాయికి అంతర్గత విభేదాలు

జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి.. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కార్యక్రమం మొదలుపెట్టుకున్న కేసీఆర్‌కు ఈ పరిణామాలు సహజంగానే మింగుడుపడవు. అలాగే పార్టీ శ్రేణుల్లోనూ నైరాశ్యం నెలకొన్నది. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఏం సమాధానం చెప్పాలనేది పాలుపోవడం లేదు.

ఆ పార్టీలో క్షేత్ర స్థాయిలో నేతల మధ్య అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరాయి అనడానికి వివిధ మున్సిపాలటీల్లో చైర్మన్‌లపై అవిశ్వాస తీర్మానాలే దానికి ఉదాహరణ. మూడేళ్ల పాటు అవిశ్వాసం పెట్టడానికి వీల్లేదని చట్టం తెచ్చారు. ఆ గడువు ముగిసిన మరుక్షణమే రాష్ట్రంలోని చాలా మున్సిపాలిటీల్లో సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగురవేసే పరిస్థితులు ఎందుకు తలెత్తాయి?

అధికార పార్టీకి ముచ్చెమటలు ఎందుకు..?

మూడు సీట్లు ఉన్న పార్టీ అధికారపార్టీకి ముచ్చెమటలు ఎందుకు పట్టిస్తున్నది? ఉపాధ్యాయ, నిరుద్యోగులు ప్రభుత్వంపై ఎందుకు ఆగ్రహంతో ఉన్నారు? అనే చర్చ జరుగుతున్నది. దీనికి పార్టీ పెద్దల నుంచి నిర్దిష్టమైన సమాధానం ఏమీ లేదు. అంతేకాదు అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే గతంలో డిప్యూటీ సీఎం రాజయ్య, అప్పటి వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్‌పై వేటు వేసిన దూకుడు సొంత కూతురు విషయంలో మాత్రం దానికి భిన్నంగా జరుగుతుండటం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను కలవరానికి గురిచేస్తున్నది. అందుకే ఇన్నేళ్ల ప్రయాణంలో మీరే నా బలం.. బలగం అనే మాటను ఉపయోగించారని అనుకుంటున్నారు.