Rains: అకాల వ‌ర్షం… రైత‌న్న‌కు తీరని న‌ష్టం| మందుతాగి.. చావ‌డ‌మేన‌ని విల‌పిస్తున్న రైతులు

పెట్టుబ‌డి కూడా రాని ప‌రిస్థితి మిగిలింది అప్పులేన‌ని బోరుమంటున్న వైనం ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని వేడుకోలు విధాత‌: రాష్ట్రంలో పడిన అకాల వర్షాలకు రైతుల తీవ్రంగా నష్టపోయారు. వడగండ్ల వానలు రాష్ట్ర వ్యాప్తంగా పంటలను అతలాకుతలం చేశాయి. వరి, మక్కజొన్న, కూరగాయల పంటలు వేలాది ఎకరాల్లో నేలమట్టమయ్యాయి. కల్లాల్లో ఉన్న మిరప ఎందుకూ పనికిరాకుండాపోయింది. చేతికి వచ్చే సమయంలో పెట్టిన పెట్టుబడులు రాక అకాల వర్షాలు నిండా ముంచాయని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ […]

Rains: అకాల వ‌ర్షం… రైత‌న్న‌కు తీరని న‌ష్టం| మందుతాగి.. చావ‌డ‌మేన‌ని విల‌పిస్తున్న రైతులు
  • పెట్టుబ‌డి కూడా రాని ప‌రిస్థితి
  • మిగిలింది అప్పులేన‌ని బోరుమంటున్న వైనం
  • ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని వేడుకోలు

విధాత‌: రాష్ట్రంలో పడిన అకాల వర్షాలకు రైతుల తీవ్రంగా నష్టపోయారు. వడగండ్ల వానలు రాష్ట్ర వ్యాప్తంగా పంటలను అతలాకుతలం చేశాయి. వరి, మక్కజొన్న, కూరగాయల పంటలు వేలాది ఎకరాల్లో నేలమట్టమయ్యాయి. కల్లాల్లో ఉన్న మిరప ఎందుకూ పనికిరాకుండాపోయింది. చేతికి వచ్చే సమయంలో పెట్టిన పెట్టుబడులు రాక అకాల వర్షాలు నిండా ముంచాయని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అకాల వర్షాలతో పంట నష్టపోయి అప్పులపాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాలవర్షాలు ఉమ్మడి జల్లా వ్యాప్తంగా రైతులను కోలుకోని విధంగా దెబ్బతీశాయి. అన్నిపంటలు నష్టపోయి రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. మరో 15-20 రోజుల్లో చేతికి వస్తాయని అనుకుంటున్న సమయంలో మ‌క్కజొన్న, కాయగూరల పంటలు ఎందుకూ పనికి రాకుండాపోయాయ‌ని వాపోయారు.

చ‌నిపోవ‌డ‌మే మిగిలింది…

ఉమ్మడి వరంగల్‌లో ఓ రైతు మాట్లాడుతూ.. కిరాయి నీళ్లు రాత్రంతా పైపులు పెట్టి తెచ్చి పంటను కాపాడుకున్నానని, రాళ్ల వాన వచ్చి పంటను మొత్తం నాశనం చేసిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడేళ్ల నుంచి తమను ఆదుకున్నవాళ్లు లేరని, రూపాయి ఇచ్చిన వాళ్లు లేరని, ఇంటిదగ్గర కూడా రాళ్ల వానకు రేకులు పగిలిపోతే కవర్లు కప్పుకుని కూర్చున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితి ఇదీ అని కావున ప్రభుత్వం మమ్మల్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని లేకపోతే తాము మందుతాగి చనిపోవ‌డ‌మే త‌రువాయి అని భోరున ఏడ్చాడు.

ఎమ్మెల్యే, అధికారులు ఎవ‌రూ రాలేదు…

మరో రైతు మాట్లాడుతూ.. మూడు ఎకరాల పంట మొత్తం నాశనమైందని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఉల్లిగడ్డ పంట పోయిందని, టమాటా కాయలు మొత్తం పగిలిపోయాయన్నారు. మేము ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మా ఎమ్మెల్యే ఇప్ప‌టి వర‌కు ఇటు రాలేదని, అధికారులు కూడా మమ్మల్నిపట్టించుకోవడం లేదని ఆ రైతు వాపోయాడు.

కూలి వాళ్లను పెట్టి పనులు చేయించానని, అప్పులు తెచ్చి పంట మీద పెట్టానని ఇప్పుడు మొత్తం నాశనమైందని, ఆ అప్పులు తీర్చాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నదని మరో రైతు త‌న ఆవేద‌న వెలిబుచ్చాడు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటే మేము క్షేమంగా ఉంటామన్నాడు.

రూపాయి కూడా వ‌చ్చే ప‌రిస్థితి లేదు..

ఎకరానికి రూ. 50 వేల పెట్టుబడి అయ్యిందని, మూడు ఎకరాలకు రూ. 1,50,000 ఖర్చుఅయ్యిందని ఇప్పుడు దాదాపు 90 శాతం పంట పూర్తిగా నాశనమైందన్నాడు. గతేడాది కూడా పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పి ఎలాంటి సహాయం చేయలేదన్నారు.

ఈసారి అయినా తమను ఆదుకోవాలని కోరుతున్నారు. కౌలుకు తీసుకుని మక్కజొన్న పెట్టి సుమారు రూ. లక్ష వరకు అప్పులు తెచ్చి పంట మీద పెట్టుబడి పెట్టానని ఇప్పుడు రూపాయి కూడా గిట్టుబాటయ్యే పరిస్థితి లేదని ఓ కౌలు రైతు చెప్పాడు.

పొమ్మన పోదీ వానరా.. చెలరేగిన తుపానురా అంటూ పాట రూపంలో రైతు ఆవేద‌న‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మర్రిగూడెంలో రైతుల రోదన ఆకాశాన్ని అంటింది. వడగండ్ల వానకు పంట మొత్తం నష్టపోయామన్నారు. గ్రామంలోని రైతు రామ్మూర్తి నష్టపోయిన తన మక్కజొన్న పంటను చూసి ఆవేదనతో పాట రూపంలో తన బాధను వ్యక్తం చేయడం అందరినీ కదిలిస్తున్నది. పొమ్మన పోదీ వానరా.. చెలరేగిన తుపానురా… రాకరాక వచ్చిన వానరా… రైతు గుండెల్లో తన్నిపోయరా అంటూ తన బాధను పాట రూపంలో వ్యక్తం చేశాడు.