Supreme Court
విధాత, హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో అతనిపేరు వినగానే ఎవ్వరికైనా మియాపూర్ భూ కుంభకోణం గుర్తుకు వస్తుంది. తాజాగా కూకట్‌పల్లి మండల పరిధిలోని హైదర్‌నగర్ లోని 172 సర్వే నెంబర్‌లో జరిగిన భూ పందేరం తెరపైకి వచ్చింది. నాడు మియాపూర్‌లో హెచ్ఎండీఏ భూములను తనాఖా పెట్టి వేల కోట్ల రుణాలు తీసుకునేందుకు కుట్ర చేసిన ఆయన.. నేడు కేవలం ప్రాథమిక అగ్రిమెంట్, నకిలీ డిక్రీతో 98 ఎకరాల జాగీర్ధార్ భూములను తనాఖాపెట్టి రూ.550 కోట్ల రుణాలను కూడా ఆయనే పొందారు.
తాజాగా సుప్రీం కోర్టు తీర్పుతో అతనికి గాని, అతను అగ్రిమెంట్ చేసుకున్న జాగీర్ధార్‌లకు కానీ హక్కులు లేవని తేలడంతో మళ్లీ అతను తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాడు. ప్రజలకు తక్కువ.. రాజకీయ నాయకులకు, ల్యాండ్ గ్రాబర్లకు ఎక్కవగా పరిచయం ఉన్న అతని పేరు గోల్డ్ స్టోన్ ప్రసాద్.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, నేడు ప్రత్యేక తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా అతను మాత్రం భూ పత్రాలు సృష్టిస్తాడు, వందల కోట్ల రుణాలు పొందుతాడని రాజకీయ, అధికారిక వర్గాల్లో ప్రచారం. అయితే అతను దశాబ్దాలుగా ఓ భూమిని దక్కించుకునేందుకు చేసిన కుట్రకు సుప్రీం తీర్పుతో బ్రేకులు పడిన వైనంపై కథనం.
మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి మండల పరిధిలోని హైదర్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని 172 సర్వే నెంబర్‌లో మొత్తం 196.1 ఎకరాల భూమి ఉంది. ఇది జాగీర్ధార్‌ల భూమి అని, వాళ్ల దగ్గర నుంచి కొనుగోలు చేశామని గోల్డ్ స్టోన్ ప్రసాద్ అండ్ టీం అగ్రిమెంట్ పత్రాలను చూపి ప్రాథమిక డిక్రీ తెచ్చుకొని, తదనంతరం తుది డిక్రీ చూపించి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే తమకు ఇందులో 11 ఎకరాలపై పట్టాలున్నాయని కొంత మంది రైతులు అడ్డు పడటంతో పాటు ఇది సీఎస్ -14 ల్యాండ్ గా (పైగా వారసుల భూములు) ప్రభుత్వ భూమి అని రెవెన్యూ శాఖ ప్రకటించింది.
ఈ క్రమంలోనే సర్వే నెంబరు 172లో 98.1 ఎకరాల భూములు తమకు చెందుతాయంటూ వ్యాపారవేత్త గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు చెందిన గోల్డెన్, ట్రినిటీ ఇన్ ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ కంపెనీలు, ఆయన సతీమణి ఇంద్రాణి ప్రసాద్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్ ను 2019లో హైకోర్టు కొట్టివేసింది. దాంతో వారు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ కేసులో రైతులతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయ్యింది.
గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న రైతులు, ప్లాటు యజమానులు పొజీషన్‌లో ఉంటే వాళ్లకు 11 ఎకరాలపై హక్కలుంటాయని, పొజీషన్‌లో లేకుంటే మాత్రం సివిల్ కోర్టులో టైటిల్ సూట్ వేసుకోవాలని సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో వెల్లడించింది. అలాగే 1963లో జారీ అయిన ప్రాథమిక డిక్రీ, ఆ తర్వాత కాలంలో జారీ అయిన తుది డిక్రీ చెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.
ప్రాథమిక డిక్రీ తుది డిక్రీ ఆధారంగా ఆ భూములు తమకే చెందుతాయని గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేసిన అప్పీల్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. సుదీర్ఘకాలం విచారణ చేసిన న్యాయమూర్తులు జస్టిస్ ఏ రామసుబ్రమణియన్, జస్టిస్ పంకజ్ మిత్త లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం 132 పేజీల తీర్పును గురువారం వెల్లడించడంతో గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు సర్వే నెంబర్ 172లోని 98 ఎకరాలపై ఎలాంటి హక్కులు లేవని సుస్పష్టమైంది.
సర్వే నెంబర్172లో ఉన్న ఈ 98 ఎకరాలపై భూములను తాకట్టుపెట్టి ఎంబీఎస్ జువెల్లర్స్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు నుంచి రూ.550 కోట్లు అప్పుగా పొందారు. అయితే తమ అప్పు ఎలా రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ కేసులో తమను ఇంప్లీడ్ చేయాలని రేర్ అసెట్ రికన్ స్ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. తీవ్రమైన వివాదంలో ఉన్న భూముల ఆధారంగా రుణం ఎలా ఇచ్చారో, తాకట్టు కోసం తుది డిక్రీని ఎలా అంగీకరిం చారో అర్థం కావడం లేదని ఆ బ్యాంకుల తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
ఈ కేసుతో బ్యాంకులు ఇచ్చిన రుణానికి ఏమాత్రం సంబంధం లేదని, అది మళ్లీ వేరే కేసు ద్వారా తేల్చుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే తప్పుడు పత్రాలతో తప్పుడు పనులకు తెరలేపిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ అండ్ టీం రూ.550 కోట్ల అప్పును ఎలా తీర్చుతాడా..? ఎగ్గొడుతాడా అనేది చర్చనీయాంశంగా మారింది.
కూకట్‌పల్లి మండల పరిధిలోని హైదర్ నగర్‌లో గల 172 సర్వే నెంబర్‌లోని 196.1 ఎకరాలు ప్రభుత్వ భూములే. అవి పైగా వారసులకు చెందిన సీఎస్ -14 ల్యాండ్స్. అలాగే పొజీషన్‌లో లేని రైతులకు ఎలాంటి హక్కులు ఉండవని సుప్రీం కోర్టు చెప్పింది. అలాగే రైతుల వద్ద ఉన్న హక్కు పత్రాలపై, పీజీషన్‌పై విచారణ చేస్తాం.
గోల్డ్ స్టోన్ ప్రసాద్ తమదిగా చెప్పుకుంటున్న 98 ఎకరాలపై ఆయనకు ఎలాంటి హక్కులు లేవు. వీటిని ఇనాం భూములుగా చూడాలని సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా పేర్కొన్నది. ఇనాం అబాలిష్ చట్టంలోని సెక్షన్ 2 (1) ప్రకారం ఇవి ప్రభుత్వ భూములు. అలాగే అవి జాగార్ధార్ భూములైనా తెలంగాణ జాగీర్దార్ అబలిష్ యాక్టు-2018 ప్రకారం ఇవి ప్రభుత్వ భుములే.
సుప్రీం కోర్టు తీర్పులో ఎక్కడ కూడా ప్రభుత్వానికి హక్కులు లేవని చెప్పలేదు. ఇనాం అబాలిష్ చట్టం ప్రకారం, తెలంగాణ జాగీర్దార్ అబాలిష్ యాక్టు-2018 ప్రకారం కూడా ఈ భూములను స్వాధీనం చేసుకుంటాం.