Suryapeta | ధాన్యం కొనుగోళ్ల జాప్యం.. మంత్రి జగదీష్ రెడ్డి సీరియ‌స్

Suryapeta ఇప్పటివరకు కొనుగోళ్లు చేసింది 20 వేల బస్తాలేనా అంటూ విస్మయం కొనుగోళ్లు వేగవంతం చెయ్యక పోతే చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌ విధాత: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ ధాన్యం కొనుగోలు పై సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీరాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ మోహన్ రావులతో కలిసి వివిధ శాఖల అధికారులు మిల్లర్లు ట్రాన్స్పొపోర్టు […]

Suryapeta | ధాన్యం కొనుగోళ్ల జాప్యం.. మంత్రి జగదీష్ రెడ్డి సీరియ‌స్

Suryapeta

  • ఇప్పటివరకు కొనుగోళ్లు చేసింది 20 వేల బస్తాలేనా అంటూ విస్మయం
  • కొనుగోళ్లు వేగవంతం చెయ్యక పోతే చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌

విధాత: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ ధాన్యం కొనుగోలు పై సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీరాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ మోహన్ రావులతో కలిసి వివిధ శాఖల అధికారులు మిల్లర్లు ట్రాన్స్పొపోర్టు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

రబీ సీజన్‌లో జిల్లా నుంచి కొనుగోలు లక్ష్యం 7లక్షల నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఉండగా ఇప్పటి వరకు కేవలం 20 వేల బస్తాలు మాత్రమే సేకరించడం పట్ల మంత్రి జగదీష్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.

213 కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇంత తక్కువ సేకరించడం ఏమిటంటూ అధికారులను ఆయన నిలదీశారు. ధాన్యం కొనుగోలు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు.

కొనుగోలు ప్రక్రియ వేగవంతం చెయ్యక పోతే చర్యలు తప్పవంటూ ఆయన అధికారులను హెచ్చరించారు. జిల్లాలో 72 రైస్ మిల్లులు ఉండగా 37 మిల్లులు మాత్రమే ధాన్యం కొనుగోలుకు ముందుకు రావడం ఏమిటని ఆయన అధికారులను ప్రశ్నించారు.

అదే సమయంలో అటు రైస్ మిల్లర్లు ఇటు ట్రాన్స్ పోర్ట్ యజమానులు అలసత్వం ప్రదర్శించ రాదని ఆయన పేర్కొన్నారు. సరిపడా హామాలీలను యుద్ద ప్రాతిపదికన నియమించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. నాణ్యత ప్రమాణాల పేరుతో కోతలు వద్దని ఆయన సూచించారు. అదే సమయంలో రైతులకు నాణ్యత అంశంలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీదనే ఉంటుందన్నారు.

అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులకు అధికారులు బాసటగా నిలబడాలని అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. సియంఆర్ బియ్యం అక్రమాలపై మంత్రి జగదీష్ రెడ్డి కొరడా ఝళిపించారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారి నుంచి రికవరీ చెయ్యాలని అధికారులను మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు. అంతేగాక డీ-ఫాల్టర్ల పై దృష్టి సారించాలన్నారు.

తడిసిన ధాన్యం గురించి రైతులు ఆందోళన పడొద్దని చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అదేశించారన్నారు. అకాల వర్షాలకు పంట నష్టం వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మూడు రోజుల్లో పూర్తి వివరాలు సేకరించి రైతులను ఆదుకుంటామని ఆయన తెలిపారు.

ధాన్యం కొనుగోళ్ల తో పాటు అకాల వర్షాలకు సంభవించిన పంట నష్టంపై చిల్లర రాజకీయాలు తగదని ఆయన విపక్షాలకు హితవు పలికారు. వ్యవసాయానికి గౌరవం పెరిగిందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ చలువతోనే అన్నది ప్రపంచానికి తెలుసని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.