ఎంపీ టికెట్ల ఆశావహుల జాబితా షార్ట్‌ లిస్ట్‌..309పేర్లను 60కి కుదింపు

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల కాంగ్రెస్‌ టికెట్ల కోసం వచ్చిన 309దరఖాస్తుల పరిశీలన చేసిన ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ

ఎంపీ టికెట్ల ఆశావహుల జాబితా షార్ట్‌ లిస్ట్‌..309పేర్లను 60కి కుదింపు

ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ కసరత్తు

విధాత : తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల కాంగ్రెస్‌ టికెట్ల కోసం వచ్చిన 309దరఖాస్తుల పరిశీలన చేసిన ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఆశావహుల జాబితాను షార్ట్‌ లిస్ట్‌ చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించాలని నిర్ణయించింది. మంగళవారం గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యాదర్శి తెలంగాణ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరీ, పీఈసీ సభ్యులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ భేటీలో ఎంపీ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులపై విస్తృతంగా చర్చించి ఆశావహుల జాబితాను కుదించి 60పేర్లతో రూపొందించి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. అత్యధికంగా మహబూబబాద్‌ పార్లమెంటు స్థానం టికెట్‌ కోసం 48మంది, వరంగల్‌ టికెట్‌ కోసం 42మంది, పెద్దపల్లికి 29, భువనగిరికి 28, నాగర్‌ కర్నూల్‌కు 26మంది దరఖాస్తులు చేసుకోగా, తక్కువగా మహబూబ్‌నగర్‌ టికెట్‌ కోసం కేవలం నలుగురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను వడపోసిన ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఆశావహుల సంఖ్యను ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి కనీసంగా ఇద్దరు నుంచి నలుగురు పేర్లతో షార్ట్‌ లిస్ట్‌ను తయారు చేశారు. 

షార్ట్‌ లిస్ట్‌లో వీరేనా…

ఎంపీ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తుల వడపోతలో భాగంగా జనరల్‌ స్థానాలు నల్గొండ నుంచి జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లుగా వినిపిస్తున్నది. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, పున్న కైలాష్ నేత, కుంభం కీర్తి రెడ్డి, సూర్య పవన్ రెడ్డిల పేర్లను పరిగణలోకి తీసుకున్నారని సమాచారం.. సికింద్రాబాద్ నుంచి సీఐ వేణుగోపాలస్వామి, డాక్టర్ రవీందర్ గౌడ్, డాక్టర్‌ గడల శ్రీనివాసరావు, విద్యా స్రవంతి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను షార్ట్‌లిస్ట్‌లో చేర్చినట్లుగా తెలుస్తున్నది. చేవెళ్ల నుంచి పారిజాత నరసింహారెడ్డి, దామోదర్ హవేలీ, కేఎల్ఆర్, మల్‌రెడ్డి రాంరెడ్డి పేర్లను, మహబూబ్‌నగర్‌ నుంచి వంశీచంద్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఆదిత్య రెడ్డి, సీత దయాకర్ రెడ్డి పేర్లను, మెదక్ నుంచి జగ్గారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, భవాని రెడ్డి, బండారు శ్రీకాంత్ రావు, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్‌, మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిషల పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. మల్కాజిగిరి నుంచి బండ్ల గణేష్, హరి వర్ధన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ పేర్లను, నిజామాబాద్ నుంచి ఈరవత్రి అనిల్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , సునీల్ రెడ్డి, కరీంనగర్ నుంచి ప్రవీణ్‌ రెడ్డి, రుద్ర సంతోష్ కుమార్, నేరెళ్ల శారద, కటకం మృత్యుంజయ, ఖమ్మం నుంచి సోనియా గాంధీ, రేణుక చౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, వి. హనుమంతరావు, మల్లు నందిని, వి. రాజేంద్రప్రసాద్, హైదరాబాద్ నుంచి సమీర్ ఉల్లా, సూరం దినేష్, ఆనంద్ రావు పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలైన వరంగల్ లో సర్వే సత్యనారాయణ, మోత్కుపల్లి నరసింహులు, సిరిసిల్ల రాజయ్య పేర్లను, నాగర్ కర్నూల్ నుంచి సంపత్ కుమార్, మల్లు రవి, చారకొండ వెంకటేష్, పెద్దపల్లి నుంచి గడ్డం వంశి పెరికే శ్యామ్‌, రామిల్ల రాధిక పేర్లను, ఎస్టీ నియోజకవర్గాలైన ఆదిలాబాద్ నుంచి నరేష్ జాదవ్, సేవాలాల్ రాథోడ్, మహబూబబాద్‌ నుంచి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, విజయభాయి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తున్నది.