ఇది.. పురుషుల లోకమని మహిళలు అంగీకరించాల్సిందే: తాలిబన్ మంత్రి

విధాత: తాలిబన్ (Taliban) పాలనలో అఫ్గాన్ మహిళల హక్కులకు భంగం కలుగుతోందని ఆందోళన చెందుతున్న వేళ తాలిబన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్ నదీమ్ ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పాలనలో మహిళలకు అమలైన విధానాలను క్రమంగా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. షరియా, అల్లా ప్రకారం మహిళలు, పురుషులు సమానం కాదని వ్యాఖ్యానించారు.
‘పశ్చిమ దేశాలు లింగ సమానత్వం కోసం ఎంత ప్రయత్నించినా అల్లా దృష్టిలో మహిళలు, పురుషులు ఒక్కటి కాదు. ప్రకృతిలో ఎప్పుడూ పురుషుడితే ఆధిపత్యం. దీనిని మరో మాటకు తావు లేకుండా స్త్రీలు అంగీకరించాల్సిందే. ఇది పురుషుల రాజ్యమే’ అని నదీమ్ పేర్కొన్నారు.
బగ్లాన్ విశ్వవిద్యాలయంలో పాల్గొన్న ఆయన ప్రొఫెసర్లను, విద్యార్థులను ఉద్దేశించి పై విధంగా వ్యాఖ్యానించారు. అంతకముందు మాట్లాడిన ప్రొఫెసర్లు కాలేజీలో వసతులు, పరిశోధనకు పరికరాలు లేవని మంత్రికి నివేదించారు.
తొలి నుంచీ వివాదాస్పదమే..
ఒకప్పుడు గవర్నర్‌గా తర్వాత మిలటరీ కమాండర్‌గా విధులు నిర్వర్తించిన నదీమ్ తొలినుంచీ వివాదస్పద వ్యక్తిగానే నిలిచారు. ఎప్పుడు అవకాశం వచ్చిన మహిళల విద్య పట్ల చులకనగా మాట్లాడటం ఈయనకు అలవాటు. ఇస్లామిక్ విధానాలకు, అఫ్గాన్ సంస్కృతికి మహిళలు చదువుకోవడం వ్యతిరేకమని నదీమ్ అభిప్రాయం. మరోసారి ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో అఫ్గాన్ (Afghanistan) మహిళల హక్కులపై నీలినీడలు కమ్ముకున్నాయి.