TDP | బలగం కోసం తెలుగు తమ్ముళ్ల ఆరాటం..! 22న నల్లగొండ మినీ మహానాడు!!
TDP విధాత: సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు నినాదంతో తెలుగోడి ఆత్మగౌరవం పేరుతో 1982 మార్చి 29న పురుడు పోసుకొని… రికార్డు స్థాయిలో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన టిడిపి పార్టీ తెలంగాణ జిల్లాలో మళ్లీ బలం పుంజుకునేందుకు, బలగం పెంచుకునేందుకు రకరకాల కసరత్తులు చేస్తుంది. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియామకం పిదప గతంలో పార్టీకి ఆదరణ సాధించిపెట్టిన బడుగు, బలహీన వర్గాలలో మళ్లీ పట్టు సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. […]

TDP
విధాత: సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు నినాదంతో తెలుగోడి ఆత్మగౌరవం పేరుతో 1982 మార్చి 29న పురుడు పోసుకొని… రికార్డు స్థాయిలో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన టిడిపి పార్టీ తెలంగాణ జిల్లాలో మళ్లీ బలం పుంజుకునేందుకు, బలగం పెంచుకునేందుకు రకరకాల కసరత్తులు చేస్తుంది.
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ నియామకం పిదప గతంలో పార్టీకి ఆదరణ సాధించిపెట్టిన బడుగు, బలహీన వర్గాలలో మళ్లీ పట్టు సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇంటింటికి తెలుగుదేశం పేరుతో నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ల బృందాలు పసుపు జెండాలు, పసుపు చొక్కాలతో జనంలో సందడి చేస్తున్నారు.
గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసిన టిడిపి పాలనను గుర్తు చేస్తూ ఆ వర్గాల ఆదరణకు టిడిపి నాయకులు ప్రయత్నిస్తూ పార్టీ నాయకత్వంలో వారికి ప్రాధాన్యతనిస్తున్నారు. తాజాగా టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈనెల 22న పార్లమెంటు నియోజకవర్గాల వారిగా మినీ మహానాడు సభలకు టిడిపి నాయకత్వం సన్నాహాలు చేస్తుంది.
నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల మినీ మహానాడు నిర్వహించేందుకు జిల్లా టిడిపి నాయకత్వం ఇంటింటికి టిడిపి కార్యక్రమం ద్వారా జనాన్ని, కేడర్ను సమీకరించే ప్రయత్నాలు ఆరంభించింది. కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దుతామని, టిడిపిలో చేరాలంటూ యువతను ఆహ్వానిస్తుంది.
కరపత్రాలు, సోషల్ మీడియా ద్వారా గత టిడిపి ప్రభుత్వాల పాలన విజయాలను, తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జిల్లాల్లో టిడిపి నిర్మాణాత్మక శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో, కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించే ఆలోచనతో తెలుగు తమ్ముళ్లు ప్రణాళికతో సాగుతున్నారు.
టిడిపి పాలన పథకాలకి గులాబీ రంగులు
నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం మినీ మహానాడు నిర్వాహన సన్నాహాల్లో భాగంగా గురువారం నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టిడిపి కోఆర్డినేటర్ ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి, ఎల్వి యాదవ్ ఇంటింటికి టిడిపి కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు.
ఇంటింటికి తెలుగుదేశం పార్టీకి లభించిన ఆదరణ పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఇదే స్ఫూర్తితో ఈనెల 22న మిర్యాలగూడలో నిర్వహించనున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను, నల్గొండ పార్లమెంట్ మినీ మహానాడును విజయవంతం చేసేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరుతున్నామన్నారు. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో టిడిపి ప్రభుత్వాలలో సాగిన అభివృద్ధి పనులకు సంక్షేమ పథకాలకు నేడు బిఆర్ఎస్ పార్టీ పై మెరుగులు దిద్ది తమ ఘనతగా చెప్పుకుంటుందన్నారు.
నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ సమస్య పరిష్కారం దిశగా శ్రీ శైలం సొరంగం ప్రాజెక్టును తెరపైకి తెచ్చి, సత్వర ప్రత్యామ్నాయంగా ఏఎంఆర్పి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి జంట నగరాలతో పాటు జిల్లా పరిధిలోని 600 గ్రామాలకు తాగునీటి వసతి కల్పించిన ఘనత టిడిపి ప్రభుత్వానిదేనన్నారు. ఎత్తిపోతల పథకం కింద కాంగ్రెస్, బిఆర్ఎస్ లు కలిసి ఇప్పటి దాకా కూడా పూర్తిస్థాయిలో కాలువలు, డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం చేయలేదన్నారు.
ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకానికి టిడిపి నిర్మించిన ఎమ్మార్పీ ఎత్తిపోతల పథకమే నేడు ఆధారమైందన్నారు. శ్రీశైలం సొరంగం ప్రాజెక్టును అటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ లు నేటికీ పూర్తి చేయలేక పోయాయన్నారు. నల్లగొండలో పెద్ద ఆసుపత్రి భవనం, కలెక్టరేట్, ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాలు, ఆడిటోరియాలు, మార్కెట్ లు, పార్కులు, విద్యాసంస్థల భవనాలు, రోడ్లు టిడిపి హయాంలో నిర్మించినవేనన్నారు. టిడిపి ప్రభుత్వం హైటెక్ సిటీ, రింగ్ రోడ్, విమానాశ్రయాలతో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తే బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తో భూములను కొల్లగొట్టే పని చేస్తుందన్నారు.
నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదని, ఎన్నికల్లో ఇచ్చిన ఇంటికో ఉద్యోగం హామీ అమలు చేయలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదన్నారు. ఫెడరేషన్ లను నిర్వీర్యం చేశారన్నారు. ప్రాజెక్టుల పేరుతో కొత్త ఆయకట్టు లేకపోగా వేల కోట్లను దోపిడీ చేశారన్నారు. గతంలో టిడిపి సంక్షేమ పాలనతో పోల్చుకుంటే మిగులు రాష్ట్ర బడ్జెట్ ను దుర్వినియోగం చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల పాలు చేసిందన్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో సమర్ధనీయమైన, సంక్షేమ పాలన మళ్లీ అందించేందుకు టిడిపి పార్టీ బలోపేతానికి ప్రజలు, యువత కలిసి రావాలని కోరుతున్నామన్నారు.
కార్యక్రమంలో కసిరెడ్డి శేఖర్ రెడ్డి, కూరెళ్ల విజయ్ కుమార్, గుండు వెంకటేశ్వర్లు, ఎం. ఏ. రఫీక్, బొంత రమేష్, కారింగు జనార్దన్, డి నర్సింహారావ్, గోగు నాగరాజు, ఎం.ఏ. సిద్ధిక్, వీర్ల పరమేష్, కొండేటి దయాకర్, పంతంగి సైదులు, కొప్పు శంకర్, దండేంపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.