తెలంగాణ ఎన్నికల్లో పార్టీల ఖర్చు ఇంతనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు దేశంలోనే కాస్ట్‌లీగా మారాయా? అంటే అవున‌నే స‌మాధానమే వస్తున్నది

  • By: Somu    latest    Dec 02, 2023 10:54 AM IST
తెలంగాణ ఎన్నికల్లో పార్టీల ఖర్చు ఇంతనా?
  • ఇది అభ్య‌ర్థులు, రాజ‌కీయ పార్టీలు చేసిన‌దే!
  • ఒక్కో అభ్య‌ర్థికి స‌గ‌టున 50 కోట్ల ఖ‌ర్చు
  • కొన్ని సీట్లలో వంద కోట్లు దాటిందని టాక్‌
  • ఒక్కో పార్టీకి బూత్‌కు రోజు ఖర్చే 50 వేలు
  • నెల రోజుల నుంచి విచ్చ‌ల విడి ఖ‌ర్చు
  • పోలింగ్‌కు ముందు ఒక్కొరికి గరిష్ఠంగా 5వేలు
  • ప‌లు చోట్ల డిమాండ్‌ను బ‌ట్టి 10 వేల దాకా!
  • దేశంలోనే ఖరీదైన ఎన్నికలు ఇక్కడేనా?
  • ఇన్ని కోట్లు ఖర్చు చేసిన అభ్యర్థులు
  • ఐదేళ్లలో అంతకు మించి సంపాదించరా?
  • సేవ చేయడానికా? దోచుకోవడానికి
  • ఎన్నికల్లో పోటీ చేసేది ఎందుకోసం?
  • విపరీత ధోరణులపై సర్వత్రా విస్మయం


విధాత‌, హైద‌రాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు దేశంలోనే కాస్ట్‌లీగా మారాయా? అంటే అవున‌నే స‌మాధానమే వస్తున్నది. గ‌తంలో ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం సర్వసాధారణమే అయినప్పటికీ.. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టాయన్న వాదన వినిపిస్తున్నది. రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆరెస్‌, బీజేపీలు స‌గ‌టున ఒక నియోజకవర్గంలో గరిష్ఠంగా 50 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది.


కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో 100 కోట్లు దాటిపోయినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంటున్నారు. వీటితో పాటు ఆయా రాజ‌కీయ పార్టీలు రాష్ట్రకేంద్రం నుంచి చేసిన ఖ‌ర్చులు కూడా ఉన్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పోటీ చేసిన అభ్య‌ర్థులు, రాజ‌కీయ పార్టీలు చేసిన ఖ‌ర్చు దాదాపు రూ.10 వేల కోట్ల వ‌ర‌కు ఉండ‌వ‌చ్చున‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోసం ఎన్నిక‌ల క‌మిష‌న్ చేసే ఖ‌ర్చు దీనికి అద‌న‌మ‌ని చెపుతున్నారు.


గెలుపే ల‌క్ష్యంగా..


ప్ర‌ధాన పార్టీల నుంచి పోటీ చేసిన అభ్య‌ర్థులు గెలుపే ల‌క్ష్యంగా ఎంత ఖ‌ర్చు చేయ‌డానికైనా వెనుకాడలేద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నది. ఇందుకోసం అభ్య‌ర్థులు నీళ్ల మాదిరిగా న‌గ‌దును ప్రవహింపజేశారని అంటున్నారు. బాహాటంగానే మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్న దృశ్యాలు సైతం సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. కొందరు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ అలిగి గొడవకు దిగిన సందర్భాలూ వెలుగులోకి వచ్చాయి.


ఎన్నిక‌ల షెడ్యూల్ కంటే నెల రోజుల మందుగానే అభ్య‌ర్థుల‌ను బీఆరెస్ ప్ర‌క‌టించింది. నాలుగైదు మిన‌హా సిట్టింగ్‌ల‌కే సీట్లు కేటాయించింది. దీంతో బీఆరెస్ అభ్య‌ర్థులు అప్ప‌టి నుంచే భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ జ‌రిగింది. ఆత్మీయ స‌మ్మేళ‌నాల పేరుతో వేలమందిని సమీకరించి, విందు ‘వినోదాల్లో’ తేలియాడించారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలు కులాలవారీగా కూడా జరిగినవి ఉన్నాయి. ఒక్కో స‌మ్మేళ‌నానికి కోటి రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అయిన‌ట్లు స‌మాచారం. ఇలా దాదాపు వేయి వ‌ర‌కు ఆత్మీయ స‌మ్మేళ‌నాలు నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తున్నది.



బలంగం వెంట ఉండాల్సిందే


పోటీలో ఉన్న అభ్య‌ర్థులు ప్ర‌చారంలో ఎక్క‌డా వెనుక‌డుగు వేయకుండా ఉండాలంటే.. మొద‌టి నుంచీ బలగాన్ని తమ వెంట తిప్పుకోవాల్సి ఉంటుందని ఒక నాయ‌కుడ‌న్నారు. మందీమార్బలం లేకుండా తిరిగితే ప్ర‌జ‌లు స్వీక‌రించ‌ర‌ని, ప్ర‌జ‌లు త‌మ‌ను ఆల‌కించాలంటే ప‌క్క‌న అనుచ‌రగ‌ణం భారీగా ఉండాల్సిందేన‌ని ఆయన చెప్పారు. దీని నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌తి నెల క‌నీసం రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అయిందని ఒక నేత వాపోయారు. ఇలాంటి ఈతి బాధ‌లను ఎవరికీ చెప్పుకోలేమని అన్నారు.


ఎన్నిక‌లు వ‌చ్చాయంటే ఈ ఖ‌ర్చు మూడు నాలుగింత‌లు ఎక్కువ అవుతుంద‌న్నారు. షెడ్యూల్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బూత్ స్థాయిలో క్యాడ‌ర్ నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌తి రోజు ఒక్కో బూత్‌కు రూ.50 వేల వ‌ర‌కు ఖ‌ర్చు అయింద‌ని ఒక నాయ‌కుడు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. బూత్ స్థాయిలో కార్య‌క‌ర్త‌ల‌కు ప్ర‌తి రోజు వేయి రూపాయ‌లతోపాటు మందు, బిర్యానీ త‌దిత‌ర సాదా ఖ‌ర్చులు భ‌రించాల్సిందేన‌ని తెలిపారు.


కొన్ని పార్టీల‌లో అభ్య‌ర్థిత్వం చివ‌ర‌కు ఖ‌రారైనా బీఫామ్ వచ్చే సమయానికి కార్య‌క‌ర్త‌లు ఉండ‌ర‌నే భావనతో ముందు నుంచే వారిని మెయింటెన్‌ చేయాల్సి ఉంటుంద‌ని మ‌రో నేత తెలిపారు. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ నాయ‌కులు, అభ్య‌ర్థులు బూత్ స్థాయిలో కార్య‌క‌ర్త‌ల నిర్వ‌హ‌ణ‌కు భారీ ఎత్తున ఖ‌ర్చు చేశారు. వీరు కాకుండా మండ‌ల నాయ‌కులు, ఏరియా నాయ‌కులు, డివిజ‌న్ నాయ‌కులు ప్ర‌చారం కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంద‌న్నారు. ఇలా ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌చార నిర్వ‌హ‌ణ అంతా పైస‌ల‌తోనే ముడి ప‌డి ఉంద‌ని మ‌రో నేత ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


అసలు ఖర్చు వేరే!


ప్ర‌చారంలో ఇలాంటి ఖ‌ర్చులు మిన‌హా మిగ‌తా ఖ‌ర్చులు చాలా ఉంటాయ‌ని మ‌రో నాయకుడ‌న్నారు. ముఖ్యంగా ఓట్లు రాబ‌ట్టుకోవ‌డానికి భారీ ఎత్తున డబ్బులు పంచాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని వాపోయాడు. చివ‌ర‌కు ఓట‌ర్లు త‌మ‌కు డ‌బ్బులు ఇవ్వ‌క పోతే ఓటు ఎందుకు వేయాల‌ని ధ‌ర్నాలు చేసే దుస్థితి నెలకొనడం కొంతకాలంగా కనిపిస్తూనే ఉన్నది. ఓటింగ్ రోజు డ‌బ్బులు ఎవ‌రు ఇస్తే వారికే ఓటు వేద్దామ‌ని ఎదురు చూసే వాతావ‌ర‌ణం కూడా ఏర్ప‌డింది.

ఇలా ప్ర‌ధాన పార్టీలకు చెందిన నేత‌లు ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్ట‌డానికి రూ.500ల నుంచి రూ.5 వేల వ‌ర‌కు పంపిణీ చేసిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ జ‌రుగుతున్నది. కొన్ని చోట్ల రూ.10 వేలు కూడా ఇచ్చిన‌ట్లు టాక్ వినిపిస్తున్నది. ట‌ఫ్ ఫైట్ ఉండి.. ఫ‌లానా ఓట్లు వ‌స్తే కచ్చితంగా గెలుస్తామ‌నుకున్న చోట్ల ఓటుకు ఎంత ఖర్చు చేసేందుకేనా అభ్యర్థులు వెనుకాడలేదని క్షేత్రస్థాయి సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. ఇలా ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన మెజార్టీ అభ్య‌ర్థులు పోలింగ్‌కు ముందు రోజు భారీ ఎత్తున డ‌బ్బులు పంచి ఓటర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేశార‌న్నాఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.


షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి నోట్ల కట్టల స్వాధీనం


తెలంగాణ‌లో న‌గ‌దు ప్ర‌వాహం ఏరులై పారింద‌న్న విష‌యాన్ని నిజం చేసే విధంగా.. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచే భారీ ఎత్తున న‌గ‌దు ప‌ట్టుబ‌డింది. పోలింగ్‌కు ఒక్క రోజు ముందు కూడా ప‌లు ప్రాంతాల్లో రూ. 11,79,44,377 న‌గ‌దు సీజ్ చేసిన‌ట్లు ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలిపింది. అలాగే షెడ్యూల్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి 30వ తేదీ ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు రూ.317.52 కోట్ల న‌గ‌దును ఎన్నిక‌ల క‌మిష‌న్ సీజ్ చేసింది.


128,81,22,727 లీట‌ర్ల లిక్క‌ర్‌ను అక్రమంగా తరలిస్తుంటే పట్టుకున్నారు. 40,18,30,034 కిలోల‌ గంజాయి, కొకైయిన్‌తో పాటు ఇత‌ర మారక ద్ర‌వ్యాలు కూడా పట్టుబడ్డాయి. దొరికిన మొత్తాలే ఈ రేంజ్‌లో ఉంటే.. ఇక చడీచప్పుడు కాకుండా తరలించేసిన సొమ్ము ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చని ఒక రాజ‌కీయ ప‌రిశీల‌కుడన్నారు.



ఎవరిదీ పాపం?


ఓట్లనగానే నోట్లు ఇంటికి వస్తాయనే ధోరణి ప్రబలుతున్నది. అందుకు రాజకీయ నాయకులు కూడా ప్రధాన కారణంగా నిలుస్తున్నారు. డబ్బు పంచకుండా ప్రచారం చేయండి అంటూ ఎదుటిపార్టీకి సవాళ్లు విసిరే నాయకులే.. తమ పార్టీకే ఓటేయాలంటూ డబ్బు పంపిణీ చేస్తున్న విషాదకర దృశ్యం ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నది.


అయితే.. ఒక ఎమ్మెల్యే పదవి దక్కించుకోవడం కోసం ఒక అభ్యర్థి ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నాడన్న కనీస ఆలోచన వచ్చినా.. ఈ డబ్బు ప్రవాహం ఆగిపోతుందని రాజకీయ పరిశీలకులు, బుద్ధి జీవులు చెబుతున్నారు. ఖర్చు పెట్టి మరీ గెలిచి సేవ చేసే గొప్ప మనసు ఎవరికి ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.


బరాబర్‌.. చేసిన ఖర్చుకు ఐదింతలో పదింతలో రాబట్టుకునేందుకే ఎన్నికల్లో నోట్లు పంచుతున్నారనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించనంత కాలం.. ఇలా ధన ప్రవాహం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూనే ఉంటుందనడంలో సందేహం లేదు.