శాంతించిన మైకులు.. జోరుగా డబ్బు, మద్యం సరఫరా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఈ నెల 30వ తేదీని జరిగే పోలింగ్‌కు మరో 48గంటలకు ముందే మంగళవారం సాయంత్రం 5గంటలకు ప్రచార ఘట్టం పరిమాప్తమైంది

- ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం
- అగ్ర నాయకుల ప్రచారంతో జోష్
- గెలుపుకోసం అభ్యర్థుల ఆఖరి పాట్లు
- ప్రలోభాల పంపిణీ షురూ..
విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్‌కు మరో 48 గంటలకు ముందే మంగళవారం సాయంత్రం 5గంటలకు ప్రచార ఘట్టం పరిసమాప్తమైంది. ప్రచార ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల నియమాళిని అనుసరించి పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో టీవి చానళ్లు, సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలు, ప్రకటనలు ఇవ్వరాదని, అన్ని నియోజకవర్గాల నుంచి స్థానికేతరులు వెళ్లిపోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచే మద్యం దుకాణాలు మూతపడ్డాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 15న నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన నాటి నుంచి ఉధృతంగా సాగిన ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు కూడా అదే జోరుతో సాగింది. మొత్తం 13 రోజుల పాటు సాగిన ప్రచార పర్వంలో ప్రధానంగా ధరణి, రైతుబంధు, ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి, కర్ణాటక ఎన్నికల హామీల చుట్టే సాగింది. వాటికి తోడు బీఆరెస్ ఎన్నికల హామీలు, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, మ్యానిఫెస్టో హామీలు ప్రచార పర్వాన్ని ప్రభావితం చేశాయి.
ఎన్నికల ప్రచార ఘట్టంలో దుబ్బాకలో బీఆరెస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపైన కత్తి దాడి, మరో బీఆరెస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపైన దాడి మినహా ఆధ్యంతం ప్రశాంతంగా సాగి ముగిసింది. ప్రధాన పార్టీల తరఫున అగ్రనేతలు ఎన్నికల ప్రచారానికి తరలిరావడంతో ప్రచార ఘట్టం హోరాహోరీగా సాగింది. అభ్యర్థులంతా ఇంటింటి ప్రచారం నిర్వహించి తమను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. అభ్యర్థుల గెలుపు కోరుతూ ఆ పార్టీల అగ్రనేతలంతా బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో ప్రచారాన్ని హోరెత్తించారు. అధికార బీఆరెస్ తరఫున సీఎం కేసీఆర్ ఒకే ఒక్కడుగా 96 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని బీఆరెస్ పదేళ్ల పాలన విజయాలను, ఎన్నికల హామీలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రత్యర్థి పార్టీలపై విమర్శల దాడి సాగించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో బీఆరెస్ ప్రచారాన్ని ముందుకు దూకించారు. సీఎం కేసీఆర్ తన ఎన్నికల ప్రచార సెంటిమెంట్‌ను అనుసరించి ఈసారి కూడా గత నెల 15న హుస్నాబాద్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించి గజ్వేల్‌లో ముగించారు. కేటీఆర్ 60 రోజుల ప్రచారంలో సుమారు 30 సభలు, 70 రోడ్ షోలు, 31 ఇంటర్వ్యూలు, 150 టెలికాన్ఫరెన్స్‌లలో పాల్గొన్నారు.
తెలంగాణపై కేంద్రీకరించిన రాహుల్, ప్రియాంక
కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, మంత్రులు, ఏఐసీసీ నాయకులు ప్రచారంలో మెరిశారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి సహా అగ్రనేతలు దాదాపు 105 ప్రచార సభల్లో పాల్గొన్నారు. రాహుల్‌గాంధీ 23 సభల్లో, ప్రియాంకగాంధీ 26 సభల్లో పాల్గొన్నారు. చివరి రోజున వారిద్దరూ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌తో మల్కాజిగిరి రోడ్‌షోలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి 63 నియోజకవర్గాల్లో 87 సభల్లో పాల్గొన్నారు. ఖర్గే 10 సభలు, కర్ణాటక సీఎం సిద్దరామయ్య 3, డిప్యూటీ సీఎం శివకుమార్ 10, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగేల్ 4 సభల్లో పాల్గొన్నారు. తెలంగాణలోని బీఆరెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కాంగ్రెస్ హామీలను కాంగ్రెస్ నేతలు తమ ప్రచార సభల్లో ప్రజల ముందుంచారు. ఆఖరుగా హైదరాబాద్‌లో రాహుల్‌గాంధీ, ప్రియాంక నిర్వహించిన రోడ్ షో కాంగ్రెస్ ప్రచారంలో హైలైట్‌గా నిలిచింది.
తరలివచ్చిన బీజేపీ అగ్రనాయకత్వం
బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రధాని మోదీ ఐదు రోజుల్లో 8సభలు, అమిత్ షా ఎనిమిది రోజుల్లో 17 సభలు, ఏడు రోడ్ షోలు, జేపీ నడ్డా ఐదు రోజుల్లో 8 సభల్లో ప్రసంగించారు. బీసీ సీఎం నినాదంతో పాటు ఎస్సీ వర్గీకరణ, సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ అంశాలను బీజేపీ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. ప్రధాని మోదీ హైద్రాబాద్ రోడ్ షో బీజేపీ ప్రచార పర్వంలో జోష్ పెంచింది. జనసేన నుంచి పవన్ కల్యాణ్, బీఎస్పీ తరఫున మాయవతి కూడా తమ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం సాగించారు. వామపక్ష పార్టీల సీపీఐ తరుపున నారాయణతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, సీపీఎం తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రలోభాలకు లేచిన తెర!
ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసిపోవడంతో రాజకీయ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ఆఖరి ప్రయత్నంగా పోలింగ్‌కు ముందు పోల్ మేనేజ్‌మెంట్ పేరుతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి పాట్లు పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే కులాల వారీగా, సంఘాల వారీగా, కాలనీలు, అపార్ట్‌మెంట్‌లు, వార్డుల వారీగా, బూత్‌ల వారీగా నిత్య విందులు ఇస్తూ వచ్చారు. వాటికి అదనంగా పోలింగ్‌కు ముందు ఓటుకు ఇంత మొత్తమని నగదు పంపిణీ సాగిస్తున్నారు. ఇంటింటికి మద్యం, డబ్బు పంపిణీ సాగిస్తూ ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు తెరచాటు ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారని సమాచారం. బూత్‌లు, కాలనీలు, అపార్ట్‌మెంట్‌ల వారీగా తమ వారిని ఇన్‌చార్జులుగా పెట్టుకుని ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు. నియోజకవర్గాల్లో ప్రత్యర్థి ఇచ్చే డబ్బులకు అదనంగా ఓటుకు ఇంత మొత్తమని నిర్ణయించుకుని అభ్యర్థులు డబ్బుల పంపిణీ తతంగం గుట్టుచప్పుడుగా నిర్వహిస్తున్నారు. సగటున ఓటుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు 2వేల చొప్పున పంపిణీ చేస్తున్నారని సమాచారం. పోటీ అధికంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఇచ్చేదానికంటే అధికంగా ఇచ్చే ప్రయత్నంలో ఓటుకు 4 వేల నుంచి 5వేల వరకు ముట్టచెబుతున్నారని తెలుస్తున్నది. గెలుపు లెక్కలను అనుసరించి కనీసంగా 70-80శాతం మంది ఓటర్లకు డబ్బు చేరేలా అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారట. దేశంలోని హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలుగా రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం డబ్బు, మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ ఎంతమేరకు వాటిని కట్టడి చేయడంలో సఫలీకృతమవుతుందన్నది చూడాల్సివుంది.
నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు: వికాస్‌రాజ్
ఎన్నికల ప్రచారం ముగియటంతో ఎన్నికల నియామవళిని అనుసరించి నియోజకవర్గాల్లోని స్థానికేతరులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సీఈవో వికాస్ రాజ్ ఆదేశించారు. డబ్బు, మద్యం పంపిణీ వంటి వాటితో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డబ్బు, మద్యం పంపిణీ నియంత్రణకు ఎన్నికల నిఘా బృందాలు రంగంలోకి దిగాయని, అన్ని రకాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 144 సెక్షన్ అమల్లోకి ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఓటు హక్కు వినియోగించేలా సదరు సంస్థలు విధిగా సెలవులు ఇవ్వాలని ఆదేశించామన్నారు. రాష్ట్రంలో 35వేల 613గా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 3లక్షల 26కోట్ల మంది ఓటర్లుగా ఉన్నారని, 2290మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, 221మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. 1.68లక్షల మంది ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ వసతి కల్పించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60వేల బ్యాలెట్ యూనిట్లు, అదనంగా మరో 14 వేలు ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ నెల 30వ తేదీ పోలింగ్ – డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నామని, కౌంటింగ్‌కు 49 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ నియోజకవర్గాల్లో, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన 12వేల పోలింగ్ కేంద్రాలలో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వెబ్ కాస్టింగ్‌తో పాటు సీసీ కెమెరాల నిఘా పోలింగ్ కేంద్రాల్లో ఉంటుందన్నారు. ఎన్నికల విధుల్లో 45 వేల రాష్ట్ర పోలీసులు, 23,500 పక్క రాష్ట్రాల హోంగార్డులు, 375 కేంద్ర కంపెనీల బలగాలు, 50 కంపనీల తెలంగాణ స్పెషల్ పోలీస్, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు శాఖల నుంచి 3వేల మంది బందోబస్తులో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రచారం ముగిసినందున 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసేదాకా ప్రచార, ప్రసార సాధనాల్లో ఎలాంటి ఎన్నికల ప్రచార ప్రకటనలు, బల్క్ మేసేజ్‌లు ఇవ్వరాదని స్పష్టం చేశారు. 1.85 లక్షల మంది పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో ఉంటారని, 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లు, రూట్ ఆఫీసర్లు, బీఎల్‌వోలు, ఇతర అధికారులు విధుల్లో ఉంటారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సన్నాహాలపై మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష చేసినట్లుగా వెల్లడించారు. ఈ కాన్ఫరెన్స్‌లో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, నోడల్ ఆఫీసర్ చీఫ్ మహేష్ భగవత్, జిల్లా ఎన్నికల అధికారులు, సీపీలు, ఎస్పీలు హాజరైనట్లుగా తెలిపారు.