17ఎంపీ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు
తెలంగాణలోని మొత్తం 17పార్లమెంటు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటనను పూర్తి చేసింది. వలసల తంత్రమే గెలుపు మంత్రమని భావిస్తూ ఈ దఫా అభ్యర్థుల ఖరారులో వలస నేతలకు పెద్దపీట వేశారు

- వలస నేతలకు పెద్దపీట
- ఐదు బీసీలకు..ఎస్సీ రిజర్వ్‌డ్ మూడు మాదిగలకే
విధాత : తెలంగాణలోని మొత్తం 17పార్లమెంటు స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటనను పూర్తి చేసింది. వలసల తంత్రమే గెలుపు మంత్రమని భావిస్తూ ఈ దఫా అభ్యర్థుల ఖరారులో వలస నేతలకు పెద్దపీట వేశారు. మూడు ఎస్సీ, రెండు ఎస్టీ స్థానాలు మినహాయించగా, మిగిలిన 12జనరల్ స్థానాల్లో ఐదు బీసీ, నాలుగు రెడ్డి, రెండు వెలమ, ఒక బ్రహ్మాణ అభ్యర్థులకు టికెట్లు కేటాయించారు. ఎస్సీలకు సంబంధించిన మూడు రిజర్వ్‌డ్ స్థానాలను కూడా మాదిగలకే కేటాయించడం విశేషం. నలుగురు సిటింగ్ ఎంపీలలో ముగ్గురికి తిరిగి టికెట్లు ఇచ్చింది. బీఆరెస్ నుంచి వలస వచ్చిన ఇద్దరు ఎంపీలకు, ఇద్దరు మాజీ ఎంపీలకు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒకరికి ఎంపీ టికెట్లు కేటాయించారు.
1)హైదరాబాద్ మాధవీలత-ఓసీ(బ్రాహ్మణ), 2) మహబూబ్‌నగర్ డికే.అరుణ-ఓసీ(రెడ్డి), 3)నల్లగొండ శానంపూడి సైదిరెడ్డి-ఓసీ(రెడ్డి), 4)సికింద్రాబాద్ జి.కిషన్‌రెడ్డి(రెడ్డి), 5) చేవెళ్ల కొండా విశ్వేశ్వర్‌రెడ్డి-ఓసీ(రెడ్డి), 6) భువనగిరి బూర నర్సయ్యగౌడ్-బీసీ(గౌడ), 7)ఖమ్మం తాండ్ర వినోద్‌రావు- ఓసీ(వెలమ), 8) మల్కాజ్‌గిరి-బీసీ(ముదిరాజ్), 9) మెదక్ రఘునందన్‌రావు-ఓసీ(వెలమ), 10) నిజామాబాద్ ధర్మపురి అర్వింద్-బీసీ(మున్నూరుకాపు), జహీరాబాద్ బీబీ పాటిల్-బీసీ(లింగాయత్), 12) కరీంనగర్ బండి సంజయ్‌కుమార్-బీసీ(మున్నూరుకాపు)లకు టికెట్లు ఇచ్చారు. 13)ఆదిలాబాద్ గోడెం నగేశ్(ఎస్టీ గోండు), 14)మహబూబాబాద్ సీతరాంనాయక్(ఎస్టీ లంబాడా), 15)వరంగల్ ఆరూరి రమేశ్(ఎస్సీ మాదిగ), 16)నాగర్ కర్నూల్(ఎస్సీ మాదిగ), 17)పెద్దపల్లి గోమాస శ్రీనివాస్ (ఎస్సీ మాదిగ)లను అభ్యర్థులుగా ప్రకటించారు.
సిటింగ్ ఎంపీలు జి.కిషనరెడ్డికి సికింద్రాబాద్, బండి సంజయ్‌కి కరీంనగర్, ధర్మపురి అర్వింద్‌కుమార్‌కు నిజామాబాద్ టికెట్లు కేటాయంచగా, అదిలాబాద్ సిటింగ్ ఎంపీ సోయం బాపురావుకు టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో బీఆరెస్ నుంచి వచ్చి మాజీ ఎంపీ గోడం నగేశ్‌కు టికెట్ ఇచ్చారు. ఇకపోతే బీఆరెస్ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ బీబీ పాటిల్‌కు జహిరాబాద్ టికెట్, ఎంపీ కె. రాములు కుమారుడు భరత్ ప్రసాద్‌కు నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ప్రకటించారు. మాజీ ఎంపీలు సీతారాంనాయక్‌కు మహబూబాబాద్, బీఆరెస్ మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్‌కు వరంగల్, శానంపూడి సైదిరెడ్డికి నల్లగొండ టికెట్లు కేటాయించారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన గోమాస శ్రీనివాస్‌కు పెద్దపల్లి టికెట్ ఇచ్చారు.