Telangana Decade Celebrations | ప్రగతి స్ఫూర్తిని చాటేలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: గుత్తా సుఖేందర్ రెడ్డి
Telangana Decade Celebrations | విధాత: తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి స్ఫూర్తిని సర్వత్రా చాటేందుకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం సంకల్పించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమించిన విద్యార్థుల, ప్రజల పోరాటాలు, అమరుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవాలు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు అమరుల త్యాగాలను అవమానించడమే అవుతుందన్నారు. తెలంగాణ […]

Telangana Decade Celebrations |
విధాత: తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి స్ఫూర్తిని సర్వత్రా చాటేందుకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం సంకల్పించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్గొండలో విలేకరులతో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమించిన విద్యార్థుల, ప్రజల పోరాటాలు, అమరుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవాలు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు అమరుల త్యాగాలను అవమానించడమే అవుతుందన్నారు.
తెలంగాణ సాధన ఉద్యమనేతగా ఉద్యమ ఆకాంక్షలు తెలిసిన నాయకుడిగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా లక్షన్నర ఉద్యోగాలు నియమించిందని, మరో 80వేల ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగిస్తుందన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ తో కొంత నియామక ప్రక్రియ ఆలస్యమైనా లక్ష్యం మేరకు ఉద్యోగ భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో ఒక ప్రభుత్వం పథకం ఫలాలు అందించేలా నేడు కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. రైతులకు సాగునీటి వసతి, పెట్టుబడి సహాయం, పంట కొనుగోలు, భీమా పథకాలతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా నిలబడిందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు, ఆశ, అంగన్వాడి వర్కర్లకు సైతం దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో వేతనాలు అందుతున్నాయన్నారు. దేశానికి దిక్సూచిలా, తలమానికంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలు కొనసాగుతుండగా, రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు.
అధికారంలోకి రాబోయేది మేమంటే మేమే అంటూ కాంగ్రెస్, బిజెపిలు కంటున్న పగటి కలలు మరోసారి కల్లలు కాక తప్పదన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ పాలనయే శ్రీరామ రక్షగా భావిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దశాబ్ది ఉత్సవాలు అవసరం లేదంటూ తెలివి తక్కువగా మాట్లాడుతున్నారన్నారు.
కేంద్రం సహకరించకపోయిన రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిపించి కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తుంటే కాంగ్రెస్ నేత వెంకట్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు రానున్న ఎన్నికల్లో ఒక సీటు కూడా రాదని మళ్లీ 12 స్థానాల్లోనూ బిఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు.
తన కుమారుడు అమిత్ రెడ్డి పోటీ ఎక్కడ పోటీ చేస్తారన్న దానిపై సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు అంతా ఉద్యమ స్ఫూర్తితో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.