స్వయం సహాయక సంఘాలకు పునరుజ్జీవం

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్ధికాభ్యున్నతి, స్వావలంభన లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలను ఆర్ధికంగా బలపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది

స్వయం సహాయక సంఘాలకు పునరుజ్జీవం

నెల వారి ఉపాధి కల్పనకు ప్రణాళికలు

వడ్డీ లేని రుణాలకు కేంద్ర పథకాలతో లింక్‌

విధాత : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్ధికాభ్యున్నతి, స్వావలంభన లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలను ఆర్ధికంగా బలపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ముఖ్యంగా వారికి నెలవారి ఉపాధి కల్పన, ఆదాయం లభించేలా కొత్త మార్గాలను, ప్రణాళికలను రూపొందించనుంది. గత ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల డబ్బులు కూడా నిలిపివేయగా, ఇక మీదట అలా జరగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశిలిచ్చారు. వడ్డీ లేని రుణాలకు కేంద్ర పథకాలతో లింక్ చేయాలన్నారు. కాంగ్రెస్​ గ్యారంటీలన్నింటిలోనూ మహిళలకే పెద్దపీట వేయాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆలోచనగా ఉంది. గ్యారంటీల అమలులో స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం ఉండేలా ప్రభుత్వం ప్రణాళికల రూపకల్పన చేస్తుంది. సీఎంగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీల అమలు చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10లక్షల ఆరోగ్య శ్రీ బీమా అమలు చేసిన ప్రభుత్వం మరో రెండు గ్యారంటీల అమలు చేసేందుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. మరో రెండు గ్యారంటీలను అమలు చేసేటప్పుడు అన్ని గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. ఇంద్రవెల్లి సభలో మహిళలకు గృహజ్యోతి పథకం కింద 200యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్తు, 500రూపాయలకే గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

స్వయం సహాయ సంఘాలకు పునరుజ్జీవం

సంఘాల మహిళలందరికీ ఉపాధి కల్పించటంతో పాటు ఆర్థికంగా బలోపేతం అయ్యే కార్యక్రమాలు చేపట్టాలని ఇటీవలే సీఎం అధికారులకు సూచించారు. స్త్రీ శక్తి కింద ఆ కార్యక్రమాలను అమలు చేసేందుకు బీఆర్ కే భవన్లో ఆఫీసు ఏర్పాటు చేయాలని సూచించారు. నెల నెలా ఉపాధి ఉండేలా కొత్త మార్గాల అన్వేషణ చేయాలన్నారు. ఇందుకోసం విద్యార్థులు, పోలీసులకు ఇచ్చే యూనిఫామ్‌లు కుట్టించే పని అప్పగించాలని సూచించారు. ఇందుకోసం మండలాలు, జిల్లా కేంద్రాల్లో మహిళలకు కుట్టుమిషన్ల శిక్షణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.

4లక్షల 37,899సంఘాలకు ప్రయోజనం

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తిరిగి స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ, ఉపాధి, ఆదాయ కల్పన అవకాశాలు కల్పించిన పక్షంలో రాష్ట్రంలోని 4లక్షల 37వేల 899సంఘాలకు సంబంధించిన 46లక్షల 68,284మంది మహిళా సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది. గత పదేళ్లుగా నిర్వీర్యమైన మహిళా సంఘాలను క్రియాశీలకం చేసి ఆర్ధిక ప్రయోజనాలు అందించిన పక్షంలో వారి ఆదాయం రెట్టింపు కావడంతో పాటు రాష్ట్ర ప్రగతిలో వారు భాగస్వాములవుతారని ప్రభుత్వం భావిస్తున్నది.