మేడిగడ్డ నష్టానికి బాధ్యులెవరు?
కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి వరం కాదని.. గుదిబండగా మారిందని, నిర్వహణ భారంతో ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని మంత్రుల బృందం వ్యాఖ్యానించింది.

- మరమ్మతులు చేయించాలా? వద్దా?
- మంత్రివర్గ సమావేశంలో నిర్ణయిస్తాం
- కాళేశ్వం ప్రాజెక్టుతో ప్రజాధనం వృథా
- తప్పు చేస్తుంటే తలెందుకు ఊపారు?
- బాధ్యులు ఎవరైనా శిక్ష తప్పదు
- ప్రాజెక్టు రీడిజైన్‌తో అదనపు వ్యయం..
- కానీ.. ప్రయోజనం మాత్రం శూన్యం
- జ్యూడిషియల్ విచారణ జరిపిస్తాం
- ప్రాణహిత-చేవెళ్ల మళ్లీ చేపడుతాం
- ‘పాలమూరు’కు జాతీయ హోదా తెస్తాం
- ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- నిర్మాణ వ్యయంలో 67,407 కోట్ల తేడా : మంత్రి శ్రీధర్ బాబు
- చెత్త ప్రాజెక్టు.. అవినీతిమయం: కోమటిరెడ్డి
- బరాజ్‌ల భవిష్యత్తు ప్రశ్నార్ధకం: పొంగులేటి
- అవినీతి కోసమే మూడో టీఎంసీ : ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి విమర్శ
- తన మార్కు కోసం.. కమిషన్ల కోసమే కాళేశ్వరం : వివేక్
- అధికారులను నిలదీసిన మంత్రులు
- తప్పల్లో భాగస్వాములయ్యారని ఆగ్రహం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి : కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి వరం కాదని.. గుదిబండగా మారిందని, నిర్మాణ లోపాలతోపాటు నిర్వహణ భారంతో ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని తెలంగాణ మంత్రుల బృందం వ్యాఖ్యానించింది. కుంగిన మేడిగడ్డ బరాజ్‌ను శుక్రవారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో మంత్రులు డీ శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే జీ వివేక్, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డిలతో కూడిన బృందం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించింది. అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టు వద్దే మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్షించారు. ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు వివరాలను, కుంగుబాటు, అనంతరం దానికి చేస్తున్న మరమ్మతుల విషయాలపై వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు.. ప్రాజెక్టు మనుగడపైన, ప్రాజెక్టు కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పడుతున్న భారంపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్లను కాళేశ్వరం పేరుతో రీడిజైన్ చేసి ప్రాజెక్టు వ్యయాన్ని లక్షన్నర కోట్లకు పెంచారని, కానీ.. లక్ష ఎకరాలకు కూడా అదనంగా నీరివ్వలేకపోవడం విచారకమన్నారు. ఇప్పటికే 95 వేల కోట్లు ఖర్చు పెట్టగా 50 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారని, అందులో సగం మళ్లీ కిందకు వదిలేశారని అన్నారు. మేడిగడ్డ బరాజ్ 7వబ్లాక్ కుంగిపోగా, మిగతా పిల్లర్ల పరిస్థితితో పాటు అన్నారం, సుందిల్ల బరాజ్‌లు కూడా లీకేజీల బారిన పడ్డాయని చెప్పారు. మొత్తం మూడు బరాజ్‌లూ ప్రమాదంలో ఉన్నాయని చెబుతూ వాటికి మరమ్మతులు జరిపించాలా? వద్దా? అన్న దానిపై నిపుణుల కమిటీతో నివేదిక తెప్పించుకుని మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇంతకుముందే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విధంగా కాళేశ్వరం నిర్మాణం, అవినీతిపై ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణ జరిపించబోతుందన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. మేడిగడ్డ కుంగితే కేసీఆర్ నోరు మెదపలేదన్నారు. బ్యారేజీలకు ఉండే నీటి నిల్వ సామర్ధ్యం పట్టించుకోకుండా రిజర్వాయర్ల తరహాలో సాంకేతిక నిబంధనలు విస్మరించి డిజైన్, ఇంజనీరింగ్, కాన్సెప్ట్‌తో కేసీఆర్ వ్యక్తిగతంగా ఏకపక్షంగా వ్యవహారించారన్నారు. నిబంధనలకు అనుగుణంగా కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, దవళేశ్వరం, ప్రకాశం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు ఇప్పటికి సురక్షితంగా పనిచేస్తున్నాయన్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలను రిజర్వాయర్ తరహాలో నిర్మించడంతోనే అవి ఫెయిలయ్యాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్‌లో రాజకీయ, అవినీతీ కోణాలతో ఇతర అంశాలు కూడా కీలకంగా మారాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చేసిన అప్పుల రీపేమెంట్ ఏకంగా 13వేల కోట్లుగా ఉందన్నారు. 10వేల కోట్ల వడ్డీలు కట్టాల్సివుందన్నారు. వాటికి ప్రాజెక్టు నిర్వహణ, కరెంటు బిల్లుల భారం అదనమన్నారు. కాళేశ్వరం నిర్మాణం రీడిజైన్, హడావుడి నిర్మాణం, పంప్‌హౌజ్‌లు, మోటార్లు, మూడో టీఎంసీ పనుల వ్యవహారం వెనుక అప్పటి సీఎం కేసీఆర్ తన మార్కు చూపించుకునే తాపత్రాయంగా, కమిషన్ల కోసం చేసిన ప్రయత్నంగా కనబడుతుందన్నారు.
తమ ప్రభుత్వం ఆగిపోయిన ప్రాణహిత-చేవెళ్లను కొనసాగించడంతో పాటు, పాలమూరు డిండికి జాతీయ హోదా కోసం ప్రయత్నించి పనులు పూర్తి చేయిస్తామని, గత ప్రభుత్వం కాళేశ్వరం జాతీయ హోదా కోసం సరైన వివరాలు ఇవ్వలేదని హైపవర్ కమిటీ తెలిపిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయిస్తామన్నారు. ప్రాణహిత చేవెళ్ల నిర్మాణం కోసం తుమ్మడిహట్టి వద్ధ నీటి లభ్యతపై పరిశీలన చేస్తామని, గతంలో అక్కడ వ్యాప్కోస్ సానుకూల నివేదిక ఇచ్చిందన్నారు. మేడిగడ్డ కుంగడంతో ఎస్సారెస్పీకి ఆయకట్టు కూడా ప్రమాదంలో పడిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై తనతో పాటు మంత్రులు లేవనెత్తిన అంశాలపై ఇంజనీర్ ఇన్ చీఫ్ కొంత సమయం తీసుకుని జవాబు నివేదిక ఇస్తామన్నారని, అది అందాక ప్రాజెక్టు భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇదో చెత్త ప్రాజెక్టు.. ఆయనొక తుగ్లక్ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కేసీఆర్ అనే తుగ్లక్ రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక చెత్త ప్రాజెక్టుగా చరిత్రలో మిగిలిపోనుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చెప్పిందానికల్లా తలూపిన ఇంజినీరింగ్ అధికారులు ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోవడానికి, పంప్‌హౌజ్‌లు మునిగిపోవడానికి బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం మీతో తప్పులు చేయిస్తుంటే అప్పుడే సెలవు పెట్టి ఎందుకు వెళ్లిపోలేదని ఈఎన్‌సీని నిలదీశారు. 1000 కోట్లు ఖర్చయ్యే మోటర్లకు 4వేల కోట్లు బిల్లులు చెల్లించారని ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల పూర్తయితే ఇప్పటికే అందరికీ నీళ్లు వచ్చేవన్నారు.
కేవలం పేరు, కమిషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టించారని, ఆయన చేసిన డిజైన్ లోపంతో ఇవ్వాళ బరాజ్‌లు కుంగిపోయి, పనికిరాకుండా పోయాయని విమర్శించారు. కేసీఆర్, ఇంజినీర్లు కలిసి లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేయడంతో పాటు రాష్ట్ర ఖజనాపై మోయలేని భారం మోపారని అన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు వెళ్లే కొండపోచమ్మ మాత్రం ఎప్పుడు నిండుగా ఉంటుందన్నారు. కానీ వాటి నుంచి నీటిని విడుదల చేయడం లేదని చెప్పారు. బస్వాపురం, గంధమల్ల కింద రైతులను ఆదుకుని నీటి వసతి, పరహార పునరావసం కల్పించాలన్నారు.
అంతా అవినీతి మయం: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా నిర్మాణ లోపాలతో అవినీతిమయమైన ప్రాజెక్టుగా రచ్చబండ వద్ద ప్రజలు కూడా చర్చించుకుంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం 3,700 ఎకరాల ముంపు సమస్య వచ్చినప్పుడు ప్రాజెక్టును 152ఎత్తులో నిర్మించాలా? లేక 148 మీటర్ల ఎత్తులో నిర్మించాలా? అన్న అంశంపై చర్చలు పురోగతిలో ఉండగానే కేసీఆర్ హడావుడిగా లోపాయికారి ఒప్పందాలతో 148 మీటర్ల వద్ద కాళేశ్వరం రీడిజైన్ చేసి నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. మేడిగడ్డ బరాజ్ ఒక్క వరదకే ఎందుకు కుంగిందని ప్రశ్నించారు. గతంలో టాగ్ గేట్లు దాటి వరద పంప్‌హౌజ్‌లను ఎలా ముంచెత్తిందని నిలదీశారు. అంటే పంప్‌హౌజ్‌లను లోలెవల్‌లో కట్టారా? లేక టాగ్ గేట్లు పనిచేయలేదా? అనే విషయంలో అధికారులు స్పష్టతనివ్వాలన్నారు. 126 లెవల్‌లో పంప్‌హౌజ్‌లు కట్టాల్సివుందన్నారు. బరాజ్ నిర్మాణాలలో అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్‌లలో సాంకేతిక లోపాలతో అవి ప్రమాదంలో పడ్డాయన్నారు.
మొదటి, మూడో బరాజ్‌ల వద్ద మోటర్ల ద్వారా 50 టీఎంసీలను ఎత్తిపోశారని చెబుతున్నారని, రెండు లిఫ్టుల మధ్య తేడా 9 టీఎంసీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కోట్ల కరెంటు బిల్లులతో ఎత్తిపోసిన నీటిని మళ్లీ గోదావరిలోకి వదలడమేమిటన్నారు. రెండు టీఎంసీల ఎత్తిపోతల పనులే పూర్తి కాకుండానే హడావుడిగా మూడో టీఎంసీ డిజైన్ చేసి, దాన్ని కూడా టన్నెల్ నుంచి పైప్‌లైన్‌కు ఎందుకు మార్చారో చెప్పాలని కోరారు. మూడో టీఎంసీ ఎత్తిపోతకు సంబంధించి 4వేల కోట్ల పనులకు టెండర్ వేయకుండా పాత కంపెనీకే నామినేషన్ కింద ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. లక్ష కోట్లతో 50 టీఎంసీలు ఎత్తిపోసి, లక్ష ఎకరాలకు కూడా నీరివ్వని ప్రాజెక్టుకు నాలుగువేల కోట్ల కరెంటు బిల్లులు వస్తే మొత్తం 360 టీఎంసీలకు ఎంత కరెంటు బిల్లు వస్తుందని అన్నారు. అంత భారీ బిల్లులు చెల్లిస్తే వచ్చే ప్రయోజనం ఎంతో ప్రజలకు వెల్లడించాలని పొంగులేటి కోరారు. 12 శాతం వడ్డీతో అప్పులు తెచ్చి కట్టిన ప్రాజెక్టుతో మరింత ఆర్థిక భారం తప్ప ప్రయోజనం కనిపించడం లేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం కేవలం పేరు, కమిషన్ల కోసమే తప్ప, కట్టాక దాని భవిష్యత్తు ఏమిటన్నది కేసీఆర్, ఆయనకు వంతపాడిన ఇంజినీర్లు పట్టించుకోలేదన్నారు. గతంలోనే 2022 ఏప్రిల్ 22న ప్రాజెక్టు భద్రతపై అధికారులు సందేహాలు లేవనెత్తినప్పుడు చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు బరాజ్‌లు దెబ్బతిని ఉండేవి కావని అభిప్రాయపడ్డారు. కుంగుబాటు మేడిగడ్డ 7వ బ్లాక్‌లో ఒక్క పిల్లర్‌తో ఆగేది కాదని, మునుముందు మరిన్ని పిల్లర్లు కుంగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నారం, సుందిళ్ల కూడా అదే ప్రమాదంలో ఉన్నాయన్నారు. నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యూడిషియల్ విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ నష్టాన్ని ఏజెన్సీలతో కట్టించాలన్నారు.
రూపాయి ఖర్చు చేస్తే సగం ఆదాయమే : మంత్రి డీ శ్రీధర్‌బాబు
లక్షన్నర కోట్లతో కాళేశ్వరం పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు కొత్తగా నీరివ్వకపోగా, 67,407కోట్ల అవినీతి జరిగిందని మంత్రి డీ శ్రీధర్‌బాబు ఆరోపించారు. ప్రాజెక్టు పంప్‌లు నడిపితే కరెంటు బిల్లుల రూపంలోనే 5వేల కోట్ల భారం పడుతుందని చెప్పారు. ఇంత చేసి.. రూపాయి ఖర్చు చేస్తే 50పైసలు మాత్రమే ఆదాయం వస్తుందన్నారు. కాగ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టును అవినీతి, గుదిబండ ప్రాజెక్టుగా పేర్కొన్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. చేసిన ఖర్చుకు.. వ్యయానికి మధ్య ఎకరాకు 46వేల రూపాయలతో నీరందిస్తే అందులో సగం కూడా రైతుకు ఆదాయం అందడం లేదన్నారు.
యూనిట్ విద్యుత్తు ఖర్చును 6.40 పైసలుంటే 3రూపాయలుగా చూపెట్టారని, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో సగం అంటే 14,357 మెగావాట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకే అవసరమవుతుందన్నారు. అలాగే రెండు టీఎంసీకే లక్ష కోట్లు వృథా చేసిన గత ప్రభుత్వం మూడో టీఎంసీకి మరో 28,150 కోట్లు ఖర్చు పెట్టడం ద్వారా మరింత పెద్ద తప్పు చేసిందన్నారు. భూకంపాల తీవ్రతపై అధ్యయనం చేయకుండా మల్లన్న సాగర్‌లో 50టీఎంసీల నీటి నిల్వతో రిజర్వాయర్ నిర్మాణం జరిపించిందని ఆరోపించారు. బరాజ్‌లు, రిజర్వాయర్‌ల బ్యాక్ వాటర్ ద్వారా లక్ష ఎకరాల మేరకు రైతుల భూములు ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. కాళేశ్వరం అవినీతితో పాటు ఎత్తిపోతల మోటర్ల కొనుగోలుపైన, మేడిగడ్డకు ముందు, ఇతర రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్మాణాలకు ముందు భూ కొనుగోళ్లతో సాగిన కుంభకోణాలపైన విచారణ జరిపించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ప్రాజెక్టు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, నాసిరకం పనులపైన జరిగిన అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపించాల్సివుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసం ప్రాణహిత-చేవెళ్ల స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో ముంపుకు గురవుతున్న వారి సమస్యలను పరిష్కరించాల్సి ఉన్నదని చెప్పారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణం కుంగుబాటు వెనుక ప్రభుత్వం గతంలో కుట్ర కోణం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందన్నారు. మూడో టీఎంసీలో టన్నెల్ బదులు పైప్‌లైన్ ఎందుకు తెచ్చారు వంటి విషయాలపై విచారణ చేయాలన్నారు.
నీటి లభ్యత చూడకుండానే నిర్మాణమా?: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టులో ముందుగా నిర్ణయించిన 2 టీఎంసీల ఎత్తిపోత పనులు పూర్తి చేయకుండానే 3వ టీఎంసీకి రూ.28,150 కోట్లు ఎలాఖర్చు పెట్టారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అసలు ప్రాణహిత-చేవెళ్లను, తమ్మిడిహట్టిని వదిలి నీటి లభ్యత ఎక్కువగా లేని చోట బరాజ్ ఎలా కట్టారని, ఇందుకు మీరు ఎలా సమ్మతించారని ఈఎన్‌సీ మురళీధరావుపై జీవనరెడ్డి ఫైర్ అయ్యారు. కమీషన్ల కక్కుర్తితో మూడో టీఎంసీని తెచ్చారని, నాసిరకం పనులతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల భవిష్యత్తు ప్రశ్నార్ధకమైందన్నారు. ప్రాజెక్టు కోసం జరిగిన లక్ష కోట్ల ఖర్చులో 50వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిపై జ్యూడిషియల్ విచారణ జరిపించాలని, ఇదే సమయంలో నిపుణుల కమిటీతో ప్రాజెక్టు భవితవ్యంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని జీవన్‌రెడ్డి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. అలాగే ప్రాణహిత-చేవెళ్లలో ఖర్చు చేసిన 10వేల కోట్లలో ఎల్లంల్లి, ఎగువన దిగువన ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ప్రాజెక్టులో మా భూములు పోయాయని, ఇప్పుడు ప్రాజెక్టు పనిరాకుండా పోయింది మేమేం చేయాలన్నారు.
కాళేశ్వరం వద్దని ముందునుంచే చెబుతున్నా: ఎమ్మెల్యే వివేక్
కాళేశ్వరం ప్రాజెక్టు ఓ విఫల ప్రాజెక్టు అని, రాష్ట్రానికి గుదిబండ అని ఎమ్మెల్యే వివేక్ ఆరోపించారు. ప్రజాధనం వృథా తప్ప ప్రాజెక్టుతో కొత్తగా ఒక్క ఎకరాకు నీరందించే పరిస్థితి లేదని తాను ముందునుంచే చెబుతున్నానని పునరుద్ఘాటించారు. ప్రాణహిత చేవెళ్లతో కేవలం 38వేల కోట్లతో 16లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశముండగా, మాజీ సీఎం కేసీఆర్ తన పేరు కోసం, కమీషన్ల కోసం కాళేశ్వరాన్ని నిర్మించి రాష్ట్ర ఖజనాపై భారం మోపారని విమర్శించారు. నేషనల్ డ్యాం సేఫ్టీ కమిటీ రిపోర్టులోనూ కాళేశ్వరం నిర్మాణంలో లోపాలున్నాయని పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ముంపు రైతులను ఆదుకోవడంలో ఆనాటి ప్రభుత్వం విఫలమైందన్నారు. బ్యాక్ వాటర్ సమస్యలను పరిష్కరించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నీరు వృథా కావొద్దనే..
ఏటా 3000వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయని, వాటిని వృథాగా పోనివ్వకుండా రాష్ట్ర బహుళ అవసరాలకు వినియోగించుకునేందుకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్టు ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. ఎన్నికలకు ముందు కుంగిన మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించేందుకు, అక్కడే సమీక్ష చేసేందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో మంత్రుల బృందం శుక్రవారం మేడిగడ్డకు వెళ్లింది. అక్కడ ప్రాజెక్టు పూర్వాపరాలను ఈఎన్సీ మురళీధర్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రుల సమక్షంలో మీడియాకు వివరించారు.
భౌగోళికంగా తెలంగాణ అననుకూల స్థలాకృతిని కలిగి ఉన్నదని ఈఎన్సీ తెలిపారు. గోదావరి నది సముద్ర మట్టానికి 200 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నదని, అయితే.. ఎత్తయిన ప్రాంతంలో ఉన్న గోదావరి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని మళ్లించడం కష్టమని చెప్పారు. దీనికి తోడు ఎగువన మహారాష్ట్రలో గోదావరిపై బరాజ్‌లు, రిజర్వాయర్లు పెద్ద సంఖ్యలో నిర్మించడంతో అధిక జలదోపిడీ జరుగుతున్నదని వివరించారు. పట్టణీకరణ, జనాభా పెరిగిపోవడంతోపాటు.. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, ఫలితంగా తాగునీటికి అధిక డిమాండ్ ఏర్పడిందని ఆయన తెలిపారు. కుంగుబాటుకు గురైన ఏడో బ్లాక్ మొత్తాన్నీ పునర్నిర్మించాల్సి ఉన్నదని చెప్పారు. ఇప్పటికే కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులు సాగుతున్నాయని తెలిపారు. కుంగిన పిల్లర్లను తొలగించేందుకు డైమండ్ వైర్ పద్ధతిని ఉపయోగించడంపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చిందో ఆయన వివరించారు.
రిజర్వాయర్/ బరాజ్ సామర్థ్యం (టీఎంసీలు)
మేడిగడ్డ బరాజ్ 16.17
అన్నారం బరాజ్ 10.87
సుందిళ్ల బరాజ్ 8.83
మేడారం రిజర్వాయర్ 0.78
మల్కపేట్ రిజర్వాయర్ 3
అనంతగిరి రిజర్వాయర్ 3.5
రంగనాయకసాగర్ రిజర్వాయర్ 3
SKMS రిజర్వాయర్ 50
కొండపోచమ్మ సాగర్ 15
బస్వాపూర్ రిజర్వాయర్ 11.39
గంధమల్ల జలాశయం 9.87
కొండచెరువు 3.5
భూంపల్లి 0.09
మోతే రిజర్వాయర్ 2.0
ధర్మారావుపేట 0.5
కాటేవాడి 0.5
ముద్దోజివాడి 0.5
తిమ్మక్కపల్లి 1.5
మొత్తం సామర్థ్యం 141 టీఎంసీలు
మొత్తం ఆయకట్టు అంచనా : 19, 63,360 ఎకరాలు
స్థిరీకరించిన ఆయకట్టు : 98,570 ఎకరాలు
ఇంకా స్థిరీకరించాల్సింది : 18,64,790 ఎకరాలు