వందరోజుల కాంగ్రెస్‌ పాలనపై ప్రజలేమనుకుంటున్నారు? ప్రభుత్వం ఐదేళ్లూ ఉంటుందా?

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిశ‌నివారంతో వందరోజులు పూర్తయ్యాయి. అయితే.. ఈ వంద రోజుల్లో ప్రభుత్వ పాలన తీరుపై ప్రజలేమనుకుంటున్నారు

వందరోజుల కాంగ్రెస్‌ పాలనపై ప్రజలేమనుకుంటున్నారు? ప్రభుత్వం ఐదేళ్లూ ఉంటుందా?

‘ఓటా’ సంస్థ సర్వేలో ఆసక్తికర అంశాలు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి శ‌నివారంతో వందరోజులు పూర్తయ్యాయి. అయితే.. ఈ వంద రోజుల్లో ప్రభుత్వ పాలన తీరుపై ప్రజలేమనుకుంటున్నారు? గతంకంటే భిన్నంగా ఉన్నదా? లేదా గత సర్కారుకంటే చెత్తగా ఉన్నదా? ఈ అంశంలో ‘ఓటా’ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించగా ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. పొలిటికల్‌ కన్సల్టెన్సీ సంస్థ అయిన ‘ఓటా’.. ఈ సర్వేకోసం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌, రైతులు, రోజువారీ కార్మికులు, గృహిణులు, కార్మికులు, పెన్షనర్లు, చిన్న వ్యాపారస్తులు, యువత నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. ఈ సర్వేను 2024, మార్చి 5 నుంచి 15వ తేదీ మధ్య నిర్వహించారు. వివిధ అంశాలతో కూడిన సర్వేపత్రాలతో 5950 నమూనాలను సేకరించి, వాటిని విశ్లేషించారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 54 శాతం మంది పురుషులు ఉంటే.. 46 శాతం మంది మహిళలు ఉన్నారు.

కాంగ్రెస్‌ ప్రధానంగా చెబుతూ వచ్చిన ఆరు గ్యారెంటీలు అమలవుతాయా? అన్న ప్రశ్నకు.. 54 శాతం మంది అవును అని సమాధానమిచ్చారు. చెప్పలేమని 40 శాతం మంది పేర్కొన్నారు. ఆరు శాతం మంది మాత్రం ఆరు గ్యారెంటీలు అమలుకాబోవని తేల్చారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణానికి జనామోదం లభించింది. ఈ పథకం మంచిదేనని 53శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే.. దీనికి పరిమితులు పెట్టాల్సి ఉన్నదని 37 శాతం మంది పేర్కొనడం గమనార్హం. అసలు ఈ పథకం అవసరమే లేదని పదిశాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే.. బస్సుల సంఖ్య పెంచాలని, లేదా మహిళలకు స్పెషల్‌ బస్సులు వేయాలని పలువురు సూచించారు. లేదంటే మహిళలకు సగం చార్జీనైనా వసూలు చేస్తే బాగుంటుందని కొందరు సలహా ఇచ్చారు.

రైతుబంధు విషయంలో రైతులు సంతృప్తిని వ్యక్తం చేశారు. తమకు రైతుబంధు డబ్బులు జమ అయ్యాయని 73శాతం మంది తెలిపారు. కొంతమందికే వచ్చాయని 15శాతం మంది చెప్పగా.. రాలేదని 12శాతం మంది పేర్కొన్నారు. జీతాలు, పెన్షన్ల విషయంలోనూ అత్యధిక మంది సానుకూలంగా స్పందించారు. తమకు సకాలంలో జీతాలు, పింఛన్లు వస్తున్నాయని 72 శాతం మంది తెలిపారు. రావడం లేదని చెప్పినవారు 28శాతం ఉన్నట్టు సర్వే సంస్థ తెలిపింది.

తమ ప్రాంతంలో సాగు, తాగునీటి సమస్యలు లేవని 45శాతం మంది పేర్కొనగా.. అప్పుడప్పుడు సమస్యలు వస్తున్నాయని 24శాతం మంది తెలిపారు. సాగునీటి సమస్య ఉన్నదని 31శాతం మంది చెప్పారు.

ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ పాలన బాగున్నదా? రేవంత్‌రెడ్డి పాలన బాగున్నదా అన్న విషయంలో రేవంత్‌ పాలన బాగున్నదని 44శాతం మంది చెప్పగా.. కేసీఆర్‌ పాలనే బాగున్నదని 42శాతం మంది అభిప్రాయపడటం గమనార్హం. ఇద్దరి పాలనా బాగోలేదని 14 మంది తెలిపారు.

రేవంత్‌ ప్రభుత్వాన్ని పార్లమెంటు ఎన్నికల తర్వాత కూల్చివేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అటువంటిదేమీ ఉండబోదని, రేవంత్‌ ప్రభుత్వం ఐదేళ్లూ కొనసాగుతుందని 47శాతం మంది చెప్పారు. 30శాతం మంది చెప్పలేమన్నారు. 23 శాతం మంది మాత్రం రేవంత్‌ సర్కారు మధ్యలోనే కూలిపోతుందని అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డికి 75 మార్కులు వేస్తారా? 50 మార్కులు వేస్తారా? 25 మార్కులు వేస్తారా? అని ప్రశ్నించగా.. 9 శాతం మంది 75 మార్కులు వేయగా.. 54 శాతం మంది 50 మార్కులు వేశారు. 37 శాతం మాత్రం 25 మార్కులతో సరిపెట్టారు.

మొత్తంగా కాంగ్రెస్‌ వంద రోజుల పరిపాలన ఎలా ఉన్నదని ప్రశ్నించగా.. ఫర్వాలేదని 53శాతం మంది అభిప్రాయపడ్డారు. మరో 28 శాతం మంది బాగుందని చెప్పారు. 13శాతం మంది బాగోలేదని చెప్పగా.. చెత్తగా ఉన్నదని ఆరు శాతం మంది తెలిపారు.

రేవంత్‌ ప్రభుత్వంపై కొన్ని అంశాల్లో వ్యతిరేకత కూడా సర్వేలో కనిపించింది. ప్రజాపాలనలో దరఖాస్తుల పరిష్కారం మొదలైందా? అన్న ప్రశ్నకు.. అయిందని చెప్పినవారు 6 శాతం ఉంటే.. కాలేదని చెప్పినవారు 44శాతం, తెలియదని బదులిచ్చినవారు 50 శాతం ఉండటం గమనార్హం. 200 యూనిట్ల వరకు జీరో కరెంట్‌ బిల్లు వచ్చిందా? అన్న ప్రశ్నకు వచ్చిందని 14 శాతం, రాలేదని 66శాతం, దరఖాస్తు చేశామని 20శాతం తెలిపారు. ధరణి సమస్యల పరిష్కారం మొదలైందా? అన్న ప్రశ్నకు.. అయిందన్నవారు3శాతం ఉంటే.. కాలేదని 81శాతం మంది, దరఖాస్తు చేసుకున్నామని 16శాతం మంది తెలిపారు. మీ ప్రాంతంలో కరెంటు కోతలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు.. ఉన్నాయని 33శాతం, లేవని 40శాతం, అప్పుడప్పుడు అని 27శాతం తెలిపారు.

మొత్తంగా సర్వే వివరాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్‌ పాలన మీద పెద్ద ఎత్తున అనుకూలత లేదని అదే సమయంలో వ్యతిరేకత కూడా లేదని సర్వే సంస్థ తెలిపింది. కొత్త ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుందన్న ఆశాభావంతో ఉన్నారని పేర్కొన్నది. రాజకీయ నాయకులను, అధికారులను గతంకంటే స్వేచ్ఛగా కలుసుకోగలుగుతున్నామని చెప్పారని తెలిపింది. ఆరు గ్యారెంటీల అమలులో కొందరు లీడర్లు డబ్బు వసూలు చేస్తున్నట్టు సర్వే సందర్భంగా పలువురు వెల్లడించారని సర్వే సంస్థ తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి భాష మార్చుకోవాలని కొందరు అంటున్నారని పేర్కొంది.