వైద్య సేవల్లో తెలంగాణ టాప్: మంత్రి హరీష్ రావు
విధాత: వైద్య రంగ సేవల్లో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మూడో స్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం యాదగిరిగుట్టలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి హరీష్ రావు, విప్ , ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. […]

విధాత: వైద్య రంగ సేవల్లో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మూడో స్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం యాదగిరిగుట్టలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి హరీష్ రావు, విప్ , ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సమైక్యరాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు ఉంటే ప్రస్తుతం 26 కళాశాలలకు పెంచారన్నారు. ప్రతి లక్ష మందికి 19 మెడికల్ సీట్లతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే వైద్య విద్య అగ్రగామిగా ఉందన్నారు.
పీజీ సీట్లలో ప్రతి లక్ష మందికి 7 సీట్లతో రెండో స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 1400 ఆక్సిజన్ బెడ్లు ఉంటే ప్రస్తుతం 27,966 చేరిందన్నారు. మెడికల్ సీట్లు 850 నుండి 2915 కు చేరాయన్నారు. పీజీ సీట్లు 515 నుండి 1208కి పెరిగాయన్నారు. ప్రైవేటు మెడికల్ కళాశాలలతో కలిపి యంబీబీఎస్ సీట్లు 6715, పీజీ సీట్లు 2548 కి పెరిగాయన్నారు.
వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నమన్నారు. తెలంగాణ బడ్జెట్లో 12,161 కోట్లు వైద్య రంగానికి కేటాయించామన్నారు. దేశంలో పాలీటివ్ కేర్ సెంటర్లను అత్యధికంగా 33 రాష్ట్రంలో నెలకొల్పామని దేశంలో వాటి సంఖ్య 168 మాత్రమే అన్నారు.
రాష్ట్రం ఏర్పటు సమయంలో డయాలసిస్ కేంద్రాలు మూడు మాత్రమే ఉండగా, నేడు 104కు చేరుకున్నాయన్నారు. మాతృ మరణాలు నేడు 92 నుండి 43కు తగ్గగా, శిశు మరణాలు 39 నుండి 21కి తగ్గాయన్నారు. కేసీఆర్ కిట్లు, కేసీఆర్ న్యూట్రిషయన్ కిట్లతో మాత శిశు మరణాలను తగ్గించడంలో విజయవంతం అయ్యామన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో ప్రసవ శాతం 30.5 నుండి 61% పెరిగిందన్నారు. రాష్ట్రంలో 362 బస్తీ దవఖానలు ఏర్పాటు చేయగా పల్లెల్లో పీహెచ్‌సీలను పల్లె దవాఖాన్లుగా అప్ గ్రేడ్ చేయడం జరిగిందన్నారు. వరంగల్లో 1100 కోట్ల ఖర్చుతో 2వేల బెడ్‌ల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టామన్నారు. హైదరాబాదుకు నలువైపులా 2679 కోట్లతో 4200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నామన్నారు. నిమ్స్ లో మరో 2000 పడకలు అందుబాటులోకి రానున్నాయన్నారు.
పేదలకు ఖరీదైన వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటే కేంద్రం మాత్రం రాష్టానికి ఒక్క మెడికల్ కళాశాల కూడా ఇవ్వకపోగా, తన పరిధిలోని ఏయిమ్స్ కు నిధులు ఇవ్వకుండా, వసతులు కల్పించకుండా తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతుందన్నారు.
యాదాద్రి దేవస్థానం అభివృద్ధి దేశంలోనే గొప్ప చరిత్రగా నిలిచిందని, సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా గుట్టలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభించుకున్నామన్నారు. స్థానిక ప్రజలతో పాటు ఇక్కడికివచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గుట్ట మండలంలోని 36 ఏఎన్ఎం కేంద్రాలను పల్లె దవఖానలుగా అప్ గ్రేడ్ చేయబోతున్నాం అన్నారు.
యాదగిరిగుట్ట అభివృద్ధితోపాటు కాలేశ్వరం ప్రాజెక్టు నుండి మల్లన్న సాగర్ ద్వారా యాదగిరిగుట్ట ప్రాంతానికి నీళ్లు అందిస్తుండటంతో ఇక్కడ భూముల రేట్లు పెరిగాయి అన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే 30 వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందని వాటిని కాలదాన్ని రైతాంగానికి రోజుకు 30 వేల కోట్లతో 24 గంటల కరెంటు అందిస్తున్నామన్నారు.
ప్రశ్నించే గొంతులను మోడీ ప్రభుత్వం అణిచివేస్తుందని, బిబిసి పై దాడులే ఇందుకు నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనలు జారీచేసిన బిజెపి నేతలకు మింగుడు పడడం లేదన్నారు. అభివృద్ధిని ఆదరించని వారు.. పేల్చేస్తాం కూల్చేస్తాం అనేటోళ్లు మనకు అవసరమా అని హరీష్ రావు ప్రశ్నించారు.
అంతకుముందు ఆయన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుట్ట కు వచ్చిన హరీష్ రావుకు అర్చక బృందం పూర్ణ కుంభ స్వాగతం పలికి, దర్శనానంతరం ఆశీర్వచనాలు పలికి స్వామి వారి ప్రసాదాలు అందించారు.