ఆ గ్రామంలో కుక్కలకూ ఆలయం.. ప్రతి ఆగస్టులో ఘనంగా ఉత్సవాలు..!
ఆలయాలు అనగానే రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, లక్ష్మీ నరసింహా స్వామి, వేంకటేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి వంటి దేవుళ్ల పేర్లు గుర్తుకు వస్తాయి

ఆలయాలు అనగానే రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, లక్ష్మీ నరసింహా స్వామి, వేంకటేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి వంటి దేవుళ్ల పేర్లు గుర్తుకు వస్తాయి. ఈ దేవుళ్లందరికీ ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. నిత్యం ఆ ఆలయాలకు భక్తులు పోటెత్తుతుంటారు. తమ మొక్కులు చెల్లించుకుంటుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం అలాంటి ఆలయాలకు భిన్నంగా ఓ దేవాలయం వెలిసింది. గ్రామ సింహాలుగా పేరుగాంచిన కుక్కలకు దేవాలయం కట్టించారు. ప్రతి ఏడాది ఆ కుక్కల దేవాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటారు. మరి ఆ గ్రామం ఎక్కడుందంటే.. కర్ణాటక రాష్ట్రంలో.
కుక్కల ఆలయానికి నేపథ్యం ఇదే..
కర్ణాటక రాజధాని బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలో చన్నపట్న అనే పట్టణం ఉంది. దానికి సమీపంలో అగ్రహార వలగెరిహల్ళి అనే గ్రామం ఉంది. ఈ గ్రామస్తులంతా కెంపమ్మ అనే దేవతను పూజిస్తారు. అయితే కెంపమ్మ దేవత ఆలయాన్ని రమేశ్ అనే భక్తుడు కొన్నేండ్ల క్రితం నిర్మించాడు. ఇక ఈ ఆలయ నిర్మాణం కొనసాగుతున్న సమయంలో ఓ రెండు కుక్కలు తరుచుగా వచ్చాయి. నిర్మాణ పనులకు కాపలాగా ఆ శునకాలు ఉండేవి. ఆ కుక్కలతో గ్రామస్తులకు మంచి స్నేహం కూడా ఏర్పడింది. టెంపుల్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ కుక్కలు కనిపించకుండా పోయాయి. దీంతో శునకాల ఆచూకీ కోసం గ్రామస్తులంతా వెతికారు. కానీ ఆచూకీ లభించలేదు.
ఆలయం నిర్మించాలని భక్తుడిని కోరిన కెంపమ్మ
అయితే ఓ రోజు ఓ భక్తుడికి కెంపమ్మ దేవత కలలోకి వచ్చింది. కనిపించకుండా పోయిన రెండు కుక్కల కోసం ఓ ఆలయం నిర్మించాలని కెంపమ్మ భక్తుడిని కోరింది. ఆ రెండు కుక్కలు గ్రామానికి రక్షణగా ఉన్నాయని తెలిపింది. దీంతో ఆ భక్తుడు.. కెంపమ్మ ఆలయ నిర్మాణకర్త రమేశ్‌కు తెలిపాడు. దీంతో కెంపమ్మ కోరిక మేరకు ఆ ఆలయం సమీపంలోనే శునకాల ఆలయాన్ని పాలరాతితో నిర్మించాడు. ఇక కుక్కలు ఊరిని ఆపద నుండి కాపాడతాయని గ్రామస్తుల నమ్మకం. ఆది, సోమ, గురువారాల్లో ఆలయంలో పూజలు నిర్వహించి పండ్లు, పూలు సమర్పిస్తారు భక్తులు.
ఆగస్టులో పెద్ద ఎత్తున పండుగ
ప్రతి ఏడాది ఆగస్టు నెలలో ఈ కుక్కల ఆలయం వద్ద భక్తులు పెద్ద ఎత్తున పండుగ నిర్వహిస్తారు. కుక్కలకు మేకలను బలిస్తారు. ఆ తర్వాత మేక మాంసాన్ని కుక్కలకు ఆహారంగా ఇస్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు కుక్కలను అక్కడికి తీసుకొచ్చి ప్రార్థనలు చేస్తారు. కుక్కులకు అక్కడే నామకరణం చేస్తారు. అలాగే, కెంపమ్మ దేవి ఆలయానికి వెళ్లే ముందు ఆలయంలోని కుక్కల ముందు భక్తులు పూజలు చేస్తారు.