మానుకోట శివారులో ఉద్రిక్తత.. భగ్గుమన్న ఎమ్మెల్యే అనుచరులు.. షర్మిల ఫ్లెక్సీలు దగ్ధం
షర్మిల ఫ్లెక్సీలు దగ్ధం చేసిన గులాబీలు బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా,రాస్తారోకో షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు ప్రజా ప్రస్థానం యాత్ర అనుమతి రద్దు ఎమ్మెల్యే భార్య సీతా మహాలక్ష్మి నిరసన మహబూబాబాద్(Mahabubabad) శివారులో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ షర్మిల స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై చేసిన ఆరోపణల నేపథ్యంలో గులాబీ శ్రేణులు, ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. మానుకోట శివారు భజన తండా వద్ద షర్మిల ఫ్లెక్సీలు, ఆ పార్టీ జెండాలు దగ్ధం […]

- షర్మిల ఫ్లెక్సీలు దగ్ధం చేసిన గులాబీలు
- బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా,రాస్తారోకో
- షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
- ప్రజా ప్రస్థానం యాత్ర అనుమతి రద్దు
- ఎమ్మెల్యే భార్య సీతా మహాలక్ష్మి నిరసన
మహబూబాబాద్(Mahabubabad) శివారులో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ షర్మిల స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై చేసిన ఆరోపణల నేపథ్యంలో గులాబీ శ్రేణులు, ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. మానుకోట శివారు భజన తండా వద్ద షర్మిల ఫ్లెక్సీలు, ఆ పార్టీ జెండాలు దగ్ధం చేసి ధర్నా నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై (National highway) రాస్తారోకో చేపట్టారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వైయస్సార్ టి పి (YSRTP)అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పై చేసిన విమర్శలు స్థానికంగా ఉద్రిక్తతకు కారణమయ్యాయి. శనివారం రాత్రి మానుకోటలో జరిగిన సభలో షర్మిల చేసిన విమర్శలపై బీఆర్ఎస్ (BRS)శ్రేణులు మండి పడుతున్నారు.
తెల్లవారుజామునే జమ కూడిన గులాబీ నాయకులు, కార్యకర్తలు షర్మిల బస చేసిన బేతోలు సమీప ప్రాంతానికి చేరుకున్నారు. మార్గమధ్యంలో ఉన్న షర్మిల ఫ్లెక్సీలు దగ్ధం చేసి ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై చేపట్టిన ధర్నా, రాస్తారోకోతో స్థానికంగా ట్రాఫిక్ స్తంభించి ఉద్రిక్తత నెలకొంది.
ఎమ్మెల్యే భార్య సీతా మహాలక్ష్మి నిరసన
ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి పై షర్మిల చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆమె కూడా షర్మిలపై చర్యలు తీసుకోవాలని తన నివాసంలో నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకురాలు షర్మిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు స్పందించి షర్మిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆక్ట్ (Sc,st atrocity act)కింద కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కొన్ని కండిషన్స్ తో ఆమె ప్రజాప్రస్థానం యాత్రకు ఇచ్చిన అనుమతిని (permission)రద్దు చేశారు. దీంతో ఆదివారం ఆమె డోర్నకల్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన యాత్ర నిలిచిపోయింది.
భజన తండా వద్ద ఫ్లెక్సీల దగ్ధం, ధర్నా
భజన తండా వద్ద భారీగా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ‘షర్మిల గో బ్యాక్’ అంటూ ‘మానుకోట గడ్డ శంకరన్న అడ్డా’ అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రా వలసవాదులను, కాంట్రాక్టు కూలీలను వెంటేసుకొని, యాత్రల పేరుతో ప్రజలను వంచిస్తున్నారని బీఆర్ ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. క్రమంగా గులాబీ శ్రేణుల రాక పెరగడం, పరిస్థితి చేయి దాటి పోకముందుకే పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
పోలీసుల హామీతో వెనక్కి తగ్గిన గులాబీలు
గులాబీల రాస్తారోకో నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి గులాబీ శ్రేణులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. షర్మిలపై చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో బిఆర్ఎస్ శ్రేణులు కాస్త చల్లబడ్డాయి. అనంతరం వైఎస్ షర్మిల పాదయాత్ర అనుమతిని పోలీసులు రద్దు (cancel)చేశారు. ఈ మేరకు పోలీసులు వైఎస్ షర్మిలను అరెస్టు చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా బీఆర్‌ఎస్ నేత లూనావత్ లచ్చిరాం ఫిర్యాదు చేశారు.
ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మహబూబాబాద్ మండల బేతోలు శివారులో షర్మిల రాత్రి బస చేశారు. మహబూబాబాద్ పట్టణంలో శనివారం వై.ఎస్.షర్మిల మాట, ముచ్చట కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం రాత్రి అక్కడ బస చేశారు. ఆదివారం ఉదయం పాదయాత్ర ప్రారంభించక ముందే పోలీసులు యాత్ర పర్మిషన్ రద్దుచేసి, అరెస్టు చేశారు. అనంతరం హైదరాబాద్ తరలించారు.
ఎంపీ కవితపై కూడా విమర్శలు
రాత్రి మానుకోటలో స్థానిక ఎంపీ (MP)మాలోత్ కవితపై కూడా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఆమె చేపట్టనున్న యాత్ర డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్నందున బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా, ఎంపీగా ఉన్నందున ఆమె అనుచరులు కూడా ప్రతిస్పందించే (Reaction)అవకాశం ఉందని పోలీసులు ముందుగా చర్యలు చేపట్టారు.
పైగా డోర్నకల్ (DORNAKAL)నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎంపీ కవిత తండ్రి డిఎస్ రెడ్యానాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా కూడా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు భావిస్తున్నారు. పోలీసుల చర్యలతో బిఆర్ఎస్ నాయకులు, శ్రేణులు కాస్తంత వెనక్కి తగ్గాయి.