జనగామ టికెట్ పైన సాగుతున్న పీటముడి..పెండింగ్ లోనే అభ్యర్థి ప్రకటన

జనగామ టికెట్ పైన సాగుతున్న పీటముడి..పెండింగ్ లోనే అభ్యర్థి ప్రకటన
  • పల్లాకు ఖరారైందనేది నిరాధారం
  • టికెట్ పైన మంత్రి కేటీఆర్ పరిశీలన
  • రెండు రోజుల్లో కేసీఆర్ ప్రకటించే అవకాశం: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రానున్న ఎన్నికల్లో పోటీ చేసే బీఆరెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన జనగామ స్థానం పైన ఇంకా పీఠముడి కొనసాగుతూనే ఉంది. స్టేషన్ ఘనపూర్‌ తో పాటు జనగామ సెగ్మెంట్ సమస్య సైతం పరిష్కారమైపోయిందనే చర్చ సాగుతున్న నేపథ్యంలో శనివారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఈ ఊహగానాలకు చెక్ పెడుతూ, అలాంటిది ఏమీ లేదంటూ ప్రకటించడం గమనార్హం.

అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొంతగట్టునాగారం- బొత్తలపర్రే గ్రామాల మధ్య గండిరామవరం రిజర్వాయర్ నుండి తరిగొప్పుల మండలంలోని 7 గ్రామాలకు, దూల్మిట్ట మండలం కూటిగల్ గ్రామానికి మొత్తం 16 చెరువులకు రూ .62 కోట్లతో గ్రావిటీ కెనాల్ ద్వారా నీరందించే పనులకు శనివారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పనులను ప్రారభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ జనగామ టికెట్ పల్లాకు అంటూ శుక్రవారం జరిగిన ప్రచారం సరైనది కాదని ప్రకటించి షాక్ ఇచ్చారు.

సమస్య పరిష్కారానికి ప్రగతి భవన్లో భేటీ

శుక్రవారం ప్రగతి భవన్లో స్టేషన్ ఘనపూర్‌ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్సీ కడియం మధ్య నెలకొన్న సమస్యకు పరిష్కారం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమస్యకు శుక్రవారం బీఆరెస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పరిష్కారం చూపెట్టారు.

ఇరువురి నాయకులతో సంప్రదింపులు జరిపి కడియం శ్రీహరికి మద్దతు ఇచ్చే విధంగా రాజయ్యను ఒప్పించారు. వీరి మధ్య జరిగిన రాజీ వ్యవహారంలో ఏ హామీ ఇచ్చారనేది పక్కకు పెడితే రాజయ్య కూడా కడియానికి సంపూర్ణంగా సహకరిస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే రాజయ్యకు రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ గా అవకాశం కల్పిస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో జనగామ అసెంబ్లీ టికెట్ విషయం చర్చ జరిగినట్లు ప్రచారం సాగింది. ప్రగతి భవన్లో జరిగిన చర్చల్లో ఎమ్మెల్సీ పల్లా కూడా భాగస్వామ్యం కావడం విశేషం.

 జనగామ టికెట్ పై కూడా చర్చ

ప్రగతి భవన్లో శుక్రవారం స్టేషన్గన్పూర్ సమస్య పరిష్కారం సందర్భంగా, జనగామ ఎమ్మెల్యే సీటు విషయం కూడా తేలిపోయినట్లు ప్రచారం సాగింది. ఈ మేరకు లీకులు కూడా వెలుపడ్డాయి. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీఆరెస్‌ అధిష్టానం అవకాశం కల్పించిందని ప్రచారం జరిగింది. ముత్తిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కు ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ చైర్మన్గా అవకాశం కల్పిస్తున్నట్లు ఈ వార్తల సారాంశం. దీనిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తాజాగా ఖండించడంతో మరోసారి జనగామ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.

జనగామపై పలువురి ఆశలు

బీఆరెస్‌ ప్రకటించిన తొలి జాబితాలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి అవకాశం కల్పించకుండా పెండింగ్ లో పెట్టిన విషయం తెలిసిందే. జనగామ అసెంబ్లీ స్థానాన్ని ముత్తిరెడ్డికి బదులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇస్తున్నారనే ప్రచారం సాగింది. ఈ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మండల శ్రీరాములు, ఉమాదేవి తదితరులు ఆశించారు. వీరికి కాకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డికి అవకాశం కల్పించారని నిన్న, ఈ రోజు ప్రచారం విస్తృతంగా సాగింది. దీనిని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఖండించడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది.

జనగామ టికెట్ రెండు రోజుల్లో తేలుతుంది: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రతిస్పందన

జనగామ ఎమ్మెల్యే టికెట్ విషయంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేదని సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన తరిగొప్పులలో మీడియాతో మాట్లాడారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం జరిగిన సమావేశంపై వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రగతి భవన్ నుంచి, ప్రభుత్వం నుంచి అలాంటి ప్రకటన ఏమైనా అధికారికంగా వచ్చిందా? అంటూ ఎదురు ప్రశ్నించారు.

మీకు ఎమ్మెల్యే టికెట్ బదులు ఆర్టీసీ చైర్మన్ ఇస్తున్నారనే విషయంపై కూడా ముత్తిరెడ్డి అదే విధంగా స్పందించారు. జనగామ టికెట్ విషయాన్ని తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలిస్తున్నారని చెప్పారు. రెండు రోజుల్లో జనగామ టికెట్ పైన అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఈ సందర్భంగా ఆయనను పల్లాకు టికెట్ ఇస్తే సహకరిస్తారా? అంటూ ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి డైరెక్షన్ లో పనిచేస్తామని ముత్తిరెడ్డి ప్రకటించడం గమనార్హం.

ఇదిలా ఉండగా ఎమ్మెల్యే ప్రకటనతో పల్లాకు టికెట్ ఖరారు అయిందనే అంశంపై సందిగ్ధత నెలకొంది. జనగామ టికెట్ అంశంపై ఇంకా పూర్తిస్థాయి చర్చలు జరగలేదని భావిస్తున్నారు. ఏది ఏమైనా జనగామ టికెట్ ప్రకటన పీటముడికి రెండు రోజుల్లో పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.