Bhopal | 103 ఏండ్ల వయసులో 49 ఏండ్ల మహిళతో వృద్ధుడి వివాహం..
అతని వయసు 103 ఏండ్లు.. ఆమె వయసు 49 ఏండ్లు.. కానీ వృద్ధుడి మనసు అర్థం చేసుకున్న ఆ మహిళ.. అతన్ని పెళ్లాడింది.

Bhopal | విధాత: అతని వయసు 103 ఏండ్లు.. ఆమె వయసు 49 ఏండ్లు.. కానీ వృద్ధుడి మనసు అర్థం చేసుకున్న ఆ మహిళ.. అతన్ని పెళ్లాడింది. వయసుతో సంబంధం లేకుండా వారు హాయిగా జీవిస్తున్నారు. పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఈ వివాహం 2023లో చోటు చేసుకోగా, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
స్వాతంత్ర్య సమరయోధుడు నాజర్ మాటల్లోనే.. నేను భోపాల్‌లో నివాసం ఉంటున్నాను. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాను. 50 ఏండ్ల క్రితం పెళ్లి చేసుకున్నాను. ఆ వివాహం నాసిక్‌లో జరిగింది. మొదటి భార్య చనిపోయాక, రెండో పెళ్లి లక్నోలో చేసుకున్నాను. 2021లో రెండో భార్య కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. రెండో భార్య చనిపోయాక ఒంటరిగా ఫీలయ్యాను. ఇక నాకు సేవ చేసే వారు కూడా లేరు. దీంతో మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాను. ఫిరోజ్ జహన్‌ను మూడో భార్యగా పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఇద్దరం కలిసి సంతోషంగా జీవిస్తున్నామని నాజర్ చెప్పారు.
నాజర్ ప్రస్తుతం భోపాల్ ఇటవాలోని హబీబ్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. శతాధిక వృద్ధుడిని స్థానికులు గౌరవిస్తూ, ఆప్యాయంగా పలుకరిస్తుంటారు. మూడో పెళ్లి చేసుకున్న నాజర్‌కు స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో గాంధీని చూసేందుకు తన తండ్రి వద్ద రూ. 17 తీసుకుని ఇంటి నుంచి వెళ్లానని నాజర్ గుర్తు చేశారు.