BRS | ఢీ కొనేదెవరో ! తేలని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు
సమరానికి బీఆర్ఎస్ సై తొలి జాబితాలోనే 14 మంది సిటింగ్ లకు టికెట్లు గెలుపుపై గులాబీ నాయకుల ధీమా BRS | విధాత: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: బీఆర్ఎస్ తొలి జాబితాతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శాసనసభ ఎన్నికల వేడి రాజుకుంది. 14 మంది సిటింగ్ ఎమ్మెల్యేలు టికెట్లు దక్కించుకున్నారు. ఎన్నికల సమరానికి సై అంటున్నారు. కేసీఆర్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కసరత్తులు మొదలుపెట్టారు. సిటింగ్ సీట్లలో మళ్లీ విజయం సాధించి […]

- సమరానికి బీఆర్ఎస్ సై
- తొలి జాబితాలోనే 14 మంది సిటింగ్ లకు టికెట్లు
- గెలుపుపై గులాబీ నాయకుల ధీమా
BRS | విధాత: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: బీఆర్ఎస్ తొలి జాబితాతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శాసనసభ ఎన్నికల వేడి రాజుకుంది. 14 మంది సిటింగ్ ఎమ్మెల్యేలు టికెట్లు దక్కించుకున్నారు. ఎన్నికల సమరానికి సై అంటున్నారు. కేసీఆర్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కసరత్తులు మొదలుపెట్టారు. సిటింగ్ సీట్లలో మళ్లీ విజయం సాధించి పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
కాగా.. పలువురు ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నా, అధిష్టానం టికెట్లు కేటాయించింది. తమపై పూర్తి నమ్మకంతో టికెట్ ఇచ్చిందనే భావనలో సిటింగ్ లు ఉన్నారు. ప్రస్తుతం టికెట్ వచ్చిన ఎమ్మెల్యేలు తమపై పోటీకి ఇతర పార్టీ అభ్యర్థులు ఎవరు ఉంటారో అని వేసిచూస్తున్నారు. ఎవరు వచ్చినా ప్రజాభిమానం తమకే ఉంటుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. తమ ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్ రావడం కార్యకర్తల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది.
కాంగ్రెస్, బీజేపీలో కసరత్తు
బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇంకా వెలువడలేదు. దీంతో ఆ పార్టీ నాయకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టికెట్ పొందిన 14 మంది బీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యేలపై పోటీ లో నిలిపేందుకు ప్రజల్లో అభిమానం ఉన్న నేతల కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల కోసం కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. మహబూబ్ నగర్, మక్తల్, దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో సర్వే ఆధారంగా టికెట్ కేటాయింపు ఉంటుందని ఇదివరకే టీపీపీసీ ప్రకటించింది.
మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితా సిద్ధమైనట్లు సమాచారం. బీజేపీ మాత్రం ఇంతవరకు టికెట్ల కసరత్తు మొదలుపెట్టలేదు. ఆ పార్టీకి పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత ఉంది. దీంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బీజేపీలో ఒకరిద్దరు మాత్రమే బలమైన నేతలు ఉన్నారు. వారు కూడా నేటికీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే స్పష్టత లేదు.
ఈ రెండు పార్టీల అభ్యర్థుల జాబితా వస్తే ఆయా పార్టీల్లో ఎవరెవరు పోటీలో ఉంటారో తేలనుంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చిన నాయకులు ఇందుకోసమే ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమరంలో తమతో ఢీకొనే నాయకుల కోసం కళ్ళప్పగించి చూస్తున్నారు.