Budget-2024 | చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన బడ్జెట్లు ఇవే..!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా ఆమె ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు

- బ్లాక్, డ్రీమ్ బడ్జెట్ల గురించి తెలుసా..?
Budget-2024 | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా ఆమె ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ప్రతి సంవత్సరం పార్లమెంట్లో బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంటుంది. అయితే, గతంలోని కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక పరిస్థితుల్లో చారిత్రక నిర్ణయాలను తీసుకుంటూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాయి.
బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాలు భారత్‌ను ఆర్థికంగా మరింత బలోపేతం చేశాయి. భారత్‌లో తొలిసారిగా 1860 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లు కొన్ని చరిత్రలో నిలిచిపోయాయి. ఇందులో కొన్ని విమర్శలను సైతం ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందిన బడ్జెట్ల గురించి ఓ సారి తెలుసుకుందాం రండి..!
రిపబ్లిక్ ఆఫ్ ఇండియా బడ్జెట్
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి జాన్ మథాయ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రణాళికా సంఘం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రణాళికా సంఘం దేశంలోని అన్ని వనరులను సమర్థంగా వినియోగించుకునేలా అప్పటి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జవహర్లాల్ నెహ్రూ ప్లానింగ్ కమిషన్‌కు తొలి చైర్మన్‌గా పని చేశారు.
బ్లాక్ బడ్జెట్
ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో యశ్వంతరావు బీ చవాన్ బడ్జెట్‌ను సమర్పించారు. 1973-74లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ను బ్లాక్ బడ్జెట్‌గా పిలుస్తారు. ఆ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు రూ.550 కోట్లు. అప్పటి వరకు ఇదే అతిపెద్ద లోటు బడ్జెట్. ఈ బడ్జెట్ 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం, రుతుపవనాలతో దేశం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ క్రమంలో దేశం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నది.
క్యారెట్ అంట్ స్టిక్ బడ్జెట్
1986, ఫిబ్రవరి 28న కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌ను అప్పటి ఆర్థిక మంత్రి వీపీ సింగ్ ప్రవేశపట్టారు. భారతదేశంలో లైసెన్స్ రాజ్‌ను నిర్వీర్యం చేయడానికి మొదటి అడుగు ఈ బడ్జెట్. బహుమతులు, శిక్షలు రెండింటినీ అందించడం వల్ల దీన్ని క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్‌గా పిలుస్తారు. ఇది మాడిఫైడ్ వాల్యూ యాడెడ్ టాక్స్ (MODVAT) క్రెడిట్‌ను ప్రవేశపెట్టింది. స్మగ్లర్లు, పన్ను ఎగవేతదారులకు వ్యతిరేకంగా ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది.
ఎపొకల్ బడ్జెట్
పీవీ ప్రభుత్వ హయాంలో 1991లో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఐకానిక్ బడ్జెట్‌ను ఎపొఖల్ బడ్జెట్‌గా పిలుస్తంటారు. ఆ బడ్జెట్ లైసెన్స్ రాజ్‌కు ముగింపు పలుకుతూ.. బడ్జెట్ ఆర్థిక సరళీకరణ నాంది పలికింది. భారతదేశం ఆర్థిక పతనం వైపు పరుగులు తీస్తున్న సమయంలో మన్మోసింగ్ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఎగుమతులను ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. కస్టమ్స్ డ్యూటీని 220 శాతం నుంచి 150 శాతానికి తగ్గించారు.
డ్రీమ్ బడ్జెట్
కాంగ్రెస్ ప్రభుత్వంలో పీ చిదంబరం 1997-98 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో లాఫర్ కర్వ్ సూత్రాన్ని ఉపయోగించారు. పన్ను రేట్లను తగ్గించడంతో పాటు ప్రధాన పన్ను సంస్కరణలను ప్రవేశపెట్టారు. నల్లధనాన్ని వెలికితీయడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ‘డ్రీమ్ బడ్జెట్’గా పిలుస్తుంటారు. కార్పొరేట్ పన్ను రేటును తగ్గించడం, వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లను 40 శాతం నుంచి 30 శాతానికి తగ్గించడం తదితర కీలక నిర్ణయాలను బడ్జెట్లో తీసుకున్నారు. ఈ బడ్జెట్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి అధిక పెట్టుబడులను ప్రోత్సహించింది.
మిలీనియం బడ్జెట్
2000 సంవత్సరంలో యశ్వంత్ సిన్హా మిలీనియం బడ్జెట్ సాఫ్ట్వేర్ ఎగుమతిదారులపై ప్రోత్సాహకాలను తగ్గించడం, వివిధ వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడం ద్వారా భారతదేశ ఐటి పరిశ్రమ వృద్ధికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. మిలీనియం బడ్జెట్ సాఫ్ట్వేర్ ఎక్స్‌పోర్ట్స్‌పై ఇన్సెంటివ్స్ను రద్దు చేసింది. కంప్యూటర్, కంప్యూటర్ యాక్సెసరీస్‌పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు.
రోల్‌బ్యాక్ బడ్జెట్
వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం 2002-2003 సంవత్సరంలో బడ్జెట్‌ను యశ్వంత్ సిన్హా సమర్పించారు. వాజ్‌పేయ్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బడ్జెట్‌కు రోల్‌బ్యాక్ బడ్జెట్ అనే పేరు వచ్చింది. ఈ బడ్జెట్లో తీసుకొన్న నిర్ణయాల్లో ఎక్కువశాతం ఉపసంహరించుకోవడంతో పాటు వెనక్కి తీసుకున్నారు.
ప్రణబ్ ముఖర్జీ 2012 బడ్జెట్
2012-13 బడ్జెట్లో ప్రభుత్వం జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ (GAAR)ని ప్రవేశపెట్టింది. గార్ ప్యానెల్ రివ్యూ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఉపయోగించబడుతుందని నిర్ధారిస్తూనే, పన్ను ఎగవేత పథకాలను ఎదుర్కొనేందుకు జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నట్లు ముఖర్జీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
వొడాఫోన్- హచిసన్ ఒప్పందం కారణంగా భారత ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో పన్నులు ఎగవేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్‌ని తీసుకురావడం ద్వారా కంపెనీల గుండెల్లో భయాన్ని కలిగించాలని సర్కారు నిర్ణయించింది. 1962 వరకు జరిగిన ఒప్పందాలను పూర్తిగా పరిశీలించే అధికారం కల్పించింది. దీనిపై పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడగా 2016 వాయిదా పడగా.. ఎట్టకేలకు 2017లో అమలులోకి వచ్చింది.
92 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి పలికి అరుణ్ జైట్లీ..
2017లో అరుణ్ జైట్లీ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్‌ను విలీనం చేశారు. 92 ఏళ్ల సంప్రదాయానికి ముగింపు పలికినట్లయ్యింది. 1924లో బ్రిటీష్ ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను ప్రారంభించారు. ఈ బడ్జెట్ వ్యవసాయ రంగం, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక నిర్వహణపై దృష్టి సారించింది. రూ.10లక్షల కోట్లు రైతులకు రుణాలుగా ప్రకటించారు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) నిధిని రూ.40వేల కోట్లకు పెంచారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి ఆదాయ పన్నును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ బడ్జెట్లో ప్రకటించారు.
వన్స్-ఇన్-ఎ-సెంచరీ బడ్జెట్
2021 బడ్జెట్‌ను శతాబ్దానికి ఒకసారి వచ్చే బడ్జెట్‌గా పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టింది. వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా ఆసియా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. దూకుడు ప్రైవేటీకరణ వ్యూహం, బలమైన పన్ను వసూళ్లపై ఆధారపడి మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆసియాలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలని బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకున్నది.