స్టేషన్ గు‘లాబీ’ల తారుమారు

- ఒకప్పుడు ముగ్గురూ మూడు పక్షాలు
- ఇద్దరు డాక్టర్లు… ఒకరు మాస్టారు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్టేషన్ ఘన్ పూర్ రాజకీయాలు ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఈఅసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ప్రతినిధులుగా ఉన్న ముగ్గురు నాయకులు, తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వంతులవారీగా గు‘లాబీ’ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలవడం ఆసక్తికరమైన రాజకీయ మార్పుగా చెప్పవచ్చు.

ఇందులో ఇద్దరు నాయకులు గుండె విజయరామారావు, తాటికొండ రాజయ్య డాక్టర్లు కాగా, కడియం శ్రీహరి లెక్చరర్ గా పనిచేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు డాక్టర్లు, ఆ మాస్టరు వంతుల వారీగా పాత టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలో నిలవడం విశేషం. డాక్టర్లు ఇద్దరూ టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీచేసి గెలుపొందారు. తాజాగా కడియం బీఆర్ఎస్ టికెట్ తెచ్చుకున్నారు. కడియం గెలుస్తారా? ఓడుతారా? త్వరలో తేలనున్నది. సిటింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ రాజయ్యకు ఆ పార్టీ మొండిచెయ్యిచూపి, ఎమ్మెల్సీగా ఉన్న కడియానికి గులాబీ టికెట్ ఇచ్చింది.
గతంలో ముగ్గురూ ‘విపక్షాలు’
డాక్టర్ విజయరామారావు, డాక్టర్ తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిలు ఒకప్పుడు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పోటీచేశారు. 1999లో కడియం టీడీపీ అభ్యర్థిగా, తాటికొండ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీపడ్డారు. అప్పుడు విజయరామారావు ఉమ్మడి మెదక్ జిల్లాలో టీడీపీ నాయకునిగా ఉన్నారు. 2004లో తొలిసారిగా ఈ ముగ్గురు నాయకులు స్టేషన్ ఘన్పూర్ నుంచి పోటీపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తులో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ విజయరామారావు, టీడీపీ నుంచి కడియం శ్రీహరి, కాంగ్రెస్ రెబల్ గా డాక్టర్ రాజయ్య పోటీచేయగా, శ్రీహరిపై విజయరామారావు గెలుపొందారు. టీఆర్ఎస్ శాసనసభా పక్ష నాయకునిగా, కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు.

తెలంగాణ ఉద్యమ క్రమంలో విజయరామారావు ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి ముగ్గురు నాయకులు పోటీ పడ్డారు. ఈసారి రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. టీడీపీ నుంచి శ్రీహరి విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టీడీపీ, టీఆరెస్ కూటమి నుంచి కడియం, కాంగ్రెస్ నుంచి రాజయ్య పోటీ చేయగా.. రాజయ్య విజయం సాధించారు. 2011లో రాజయ్య కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో వచ్చిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య పోటీచేసి, టీడీపీ అభ్యర్థి కడియంపై గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రాజయ్య పోటీచేయగా, కడియం వరంగల్ ఎంపీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి పోటీచేసి గెలుపొందారు. రాజయ్య రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు.

టీఆర్ఎస్ నుంచి తొలిసారి అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ విజయరామారావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. టీడీపీ నుంచి దొమ్మాటి సాంబయ్య బరిలో నిలిచారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి తిరిగి రాజయ్య పోటీచేసి విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి సింగాపురం ఇందిర పోటీచేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ పార్టీల అభ్యర్థులుగా సింగపురం ఇందిర, కడియం శ్రీహరి, డాక్టర్ గుండె విజయరామారావులను ప్రకటించాయి. ముగ్గురు అభ్యర్థుల్లో సింగపురం ఇందిర గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసింది. గత ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన రాజయ్యను తప్పించి, గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కడియం శ్రీహరికి బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. వంతుల వారీగా విజయరామారావు, రాజయ్య, తాజాగా కడియం పాత టీఆర్ఎస్, కొత్త బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీచేయడం విశేషం.