నిర్ణయాత్మకంగా ముస్లిం ఓటర్లు.. 30 స్థానాల్లో వారి మద్దతే కీలకం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు గెలవాలన్నా.. వారి పార్టీకి అధికారం దక్కాలన్నా ముస్లిం మైనార్టీ ఓటర్ల మద్దతు కూడా కీలకంగా ఉన్నది.

- ఆకట్టుకునే ప్రయత్నాల్లో పార్టీలు
- ఎంఐఎం దోస్తీ కారుకు లాభిస్తుందా?
- బీజేపీ-బీఆరెస్ రహస్య ఒప్పందంపై
- ముస్లిం సమాజంలో అనుమానాలు
- ఒవైసీ మాటతో ఓటేసే పరిస్థితి ఉందా?
- కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతున్న
- వివిధ ముస్లిం సంఘాలు, పెద్దలు
విధాత ప్రత్యేకం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు గెలవాలన్నా.. వారి పార్టీకి అధికారం దక్కాలన్నా ముస్లిం మైనార్టీ ఓటర్ల మద్దతు కూడా కీలకంగా ఉన్నది. ప్రత్యేకించి రాష్ట్రంలో పాతబస్తీ బయట 30 స్థానాల్లో ప్రధాన పార్టీల గెలుపోటములను నిర్ణయించే శక్తిలో ఉన్నారు. దీంతో వారిని ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి.
అధికార బీఆరెస్.. తన మిత్ర పక్షం ఎంఐఎంపై ఆధారపడుతూనే.. మైనార్టీల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఏకరువు పెడుతున్నది. వాటికి తోడు కొత్తగా హామీలు గుప్పిస్తున్నది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ.. మైనార్టీ డిక్లరేషన్, మ్యానిఫెస్టో హామీలతో ముస్లిం ఓటర్లకు గాలం వేసింది. తెలంగాణలో ముస్లిం ఓటర్లకు ప్రతినిధిగా చెప్పుకొనే ఎంఐఎం.. బీఆరెస్ పార్టీకి వరుసగా మూడో ఎన్నికల్లోనూ మిత్రపక్షంగా కొనసాగుతున్నది.
ఎంఐఎం మద్దతుతో తమకు ముస్లిం ఓట్లు గంప గుత్తగా పడుతాయని, మెజార్టీ మార్కు సీట్లను సులభంగా సాధిస్తామని బీఆరెస్ నమ్ముతున్నది. అయితే తెలంగాణలో గతంలో మాదిరిగా ఇప్పుడు ఎంఐఎం అధినేత ఒవైసీ పిలుపును గుడ్డిగా ముస్లిం ఓటర్లు అనుసరించే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, ఇండియన్ ముస్లిం లీగ్, జమాతే ఉలేమా ఏ హింద్ సంస్థలు ఈ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా, లౌకిక పార్టీగా కాంగ్రెస్‌కు ముస్లింలు ఓటేయాలని పిలుపునిచ్చాయి. రాజకీయ పార్టీలు తమను కేవలం ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నాయని ముస్లిం సమాజంలో బలమైన అభిప్రాయం ఉన్నదని పరిశీలకులు అంటున్నారు.
వారి సంక్షేమం, అభివృద్ధికి నిర్మాణాత్మక పథకాలు అమలు చేయకుండా, తగిన బడ్జెట్ ఖర్చు చేయకుండా కేవలం అవకాశవాద రాజకీయాలకు వాడుకుంటున్నారన్న అసంతృప్తితో రగిలిపోతున్నారు. అందుకే ముందెన్నడులేని రీతిలో ఈ దఫా ఏ పార్టీకి ఓటేయాలన్నదానిపై ముస్లిం సమాజంలో భిన్నాభిప్రాయలు వినిపిస్తుండటం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రతి నియోజకవర్గంలో 10-20శాతం ముస్లిం ఓట్లు
తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో 10-20 శాతం మేరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. పాతబస్తీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో 50నుంచి 80శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. మరో 13 నియోజకవర్గాల్లో 20శాతం ఓట్లు, 21చోట్ల 15-20 శాతం ఓట్లు, 28స్థానాల్లో 10-15శాతం ఓట్లు ఉన్నాయి.
రెండుసార్లు బీఆరెస్‌కు మద్దతు
బీఆరెస్ 20 శాతం ముస్లిం ఓట్లున్న 13 స్థానాల్లో 2014లో రెండు, 2018లో ఆరు స్థానాల్లో గెలిచింది. 15-20 శాతం ఓట్లున్న 11 స్థానాల్లో 2014లో ఆరు, 2018లో 10స్థానాల్లో గెలిచింది. 10-15శాతం ఉన్న 28సీట్లలో 2018లో సంగారెడ్డి మినహా మిగతా 17సీట్లు గెలిచించింది. రాబోయే ఎన్నికల్లో మాత్రం అదే స్థాయిలో ముస్లిం ఓటర్ల ఆదరణ కష్టమే.
కాంగ్రెస్ పుంజుకునేనా..
పాతబస్తీ బయట 2014, 2018 ఎన్నికల్లో 20 శాతానికిపైగా ముస్లిం ఓటర్లు ఉన్న ఆరు నియోజకవర్గాల్లో కాంగెస్ ఒక్క స్థానం కూడా గెలువలేదు. 15-20 శాతం ఓట్లున్న 11స్థానాల్లో ఆదిలాబాద్, బాన్స్‌వాడ, కరీంనగర్, రాజేంద్రనగర్ లలో కూడా కాంగ్రెస్ గెలువలేదు. 10-15శాతం ఓట్లు ఉన్న 28నియోజకవర్గాల్లో నిర్మల్, కామారెడ్డి, కోరుట్ల, రామంగుండం, పెద్దపల్లి, సిద్దిపేట, మెదక్, కుత్భుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోడంగల్, జడ్చర్లలలో, వరంగల్ వెస్ట్‌లో కాంగ్రెస్ గెలువలేదు. 2018లో మహేశ్వరం, ఎల్‌బీనగర్, సంగారెడ్డి, తాండూరు స్థానాలు గెలిచింది.
రాజకీయ మార్పు దిశగా ముస్లింలు
ముస్లిం పిల్లల విద్యాభివృద్ధి కోసం 204 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని, 1.31లక్షల విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామని అధికార బీఆరెస్ చెబుతున్నది. విద్యానిధి పథకం అమలు చేస్తున్నామని, ముల్లాలు, ఇమామ్‌లకు వేతనాలు ఇస్తున్నామని గుర్తు చేస్తున్నది. తమ పాలనలో ముస్లింలకు రక్షణ ఉంటుందని తమకే ఓటు వేయాలని కోరుతుంది. గత ఎన్నికల సందర్భంగా ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చి అమలు చేయకపోవడం, ఉర్దూ రెండో అధికార భాష కాగితాలకే పరిమితమవ్వడం, వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతానికి నిలువరించలేకపోవడం, మైనార్టీలకు షాదీ ముబారక్, విద్యానిధి పథకం మినహా మరే పథకం అమలు చేయకపోవడం పట్ల వారిలో అసంతృప్తి నెలకొంది.
మరి ముఖ్యంగా బీజేపీకి బీఆరెస్, ఎంఐఎంలు బీ, సీ టీమ్‌లుగా మారిపోయాయన్న ప్రచారం ముస్లిం ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ దఫా కాంగ్రెస్ మైనార్టీలకు ఇచ్చిన హామీల పట్ల ముస్లింలు కాంగ్రెస్ పట్ల సానుకూలత చూపుతున్నారు. ఓవైసీ చెబితే ఓటేసే పరిస్థితులు తగ్గిపోగా, బోధన్ వంటి చోట్ల బీఆరెస్ అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ వైపు ఉండే మైనార్టీలు తెలంగాణ ఏర్పాటు పిదప 2014నుంచి బీఆరెస్ వెంట నడుస్తున్నారు. ఈ దఫా తిరిగి ముస్లింలను తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తున్నది. మైనార్టీ డిక్లరేషన్‌లో 4వేల కోట్ల బడ్జెట్ పెట్టింది. నిరుద్యోగ, మైనార్టీ యువతకు సబ్సిడీ రుణాలు మంజూరుకు హామీనిచ్చింది.
మైనార్టీ సంస్థలలో ఖాళీలను భర్తీ చేస్తామని, మైనార్టీ జంటలకు 1లక్ష 60వేలు సాయం, అబుల్ కలాం తోఫా కింద విదేశీ విద్యకు 5లక్షల సాయం, ఇమామ్‌లకు 12వేల వేతనం, వక్ఫ్ ఆస్తుల రక్షణ వంటి పథకాలను ప్రకటించింది. అయితే బీజేపీని ఓడించే పార్టీకి ఓటేసే ఆలోచనతో కూడా ముస్లింలు తమ నియోజకవర్గాల్లో బీఆరెస్, కాంగ్రెస్‌లలో ఒక పార్టీని ఎంచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ అర్భన్, ముథోల్, కరీనంగర్, కోరుట్ల, గోషామహల్, అంబర్‌పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు కొంత సానుకూలత కనిపిస్తుందంటున్నారు.
పోరాడుతున్న ఎంఐఎం – బీఆరెస్‌లు
ఎంఐఎం పాతబస్తీలో చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా, మలక్‌పేట, నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో కొన్నేండ్లుగా గెలుస్తున్నది. తమ ఏడు స్థానాలను తొమ్మిది స్థానాలకు పెంచుకోవాలని జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లలో ఈసారి పోటీకి దిగుతున్నది. అయితే గతంలోని ఏడు స్థానాలు నిలబెట్టుకోవడమే ఎంఐఎంకు కష్టంగా తయారైందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఎంఐఎం ఈ దఫా ఇద్దరు సిటింగ్‌లకు టికెట్లు నిరాకరించిన నేపథ్యంలో నెలకొన్న అసమ్మతితో పాటు ఎంబీటీ రూపంలో ఎంఐఎంకు ఆటంకాలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.
యాకుత్‌పురా, నాంపల్లి, మలక్‌పేటతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లలో మజ్లిస్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని అంటున్నారు. నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి నుంచి, యాకుత్‌పురాలో ఎంబీటీ నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార బీఆరెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, బీజేపీకి బీఆరెస్ బీ టీమ్, ఎంఐఎం సీ టీమ్ అన్న ప్రచారం ఎంఐఎంకు ఇబ్బందికరంగా మారింది. పైగా గోషామహల్‌లో 80 వేల ముస్లిం ఓటర్లు ఉన్నా రాజాసింగ్‌పై అభ్యర్థిని పెట్టకుండా, జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌పై అభ్యర్థిని పెట్టడాన్ని ముస్లింలు సైతం ప్రశ్నిస్తున్నారు.