Supreme Court | శాంతి భద్రతలు కుప్పకూలాయి: సుప్రీం
Supreme Court రాజ్యంగ యంత్రాంగం విఫలమైంది కేసుల దర్యాప్తులో ఉదాసీనత, జాప్యం మణిపూర్ హింసపై సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం రాష్ట్ర డీజీపీకి ధర్మాసనం సమన్లు న్యూఢిల్లీ: మణిపూర్‌లో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయని, రాజ్యాంగపరమైన యంత్రాంగం పూర్తిగా విఫలమైందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. కేసుల దర్యాప్తులో రాష్ట్ర పోలీసుల ఉదాశీనత, తీవ్ర జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పట్టపగ్గాల్లేని హింసను అదుపు చేయడంలో చట్టాలను అమలు చేయాల్సిన వ్యవస్థలన్నీ చేష్టలుడిగిపోయాయని వ్యాఖ్యానించింది. […]

Supreme Court
- రాజ్యంగ యంత్రాంగం విఫలమైంది
- కేసుల దర్యాప్తులో ఉదాసీనత, జాప్యం
- మణిపూర్ హింసపై సుప్రీం కోర్టు
- రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం
- రాష్ట్ర డీజీపీకి ధర్మాసనం సమన్లు
న్యూఢిల్లీ: మణిపూర్‌లో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయని, రాజ్యాంగపరమైన యంత్రాంగం పూర్తిగా విఫలమైందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. కేసుల దర్యాప్తులో రాష్ట్ర పోలీసుల ఉదాశీనత, తీవ్ర జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పట్టపగ్గాల్లేని హింసను అదుపు చేయడంలో చట్టాలను అమలు చేయాల్సిన వ్యవస్థలన్నీ చేష్టలుడిగిపోయాయని వ్యాఖ్యానించింది. శాంతిభద్రతలపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం పట్టు కోల్పోయిందని పేర్కొన్నది.
ఈ విషయంలో దాఖలైన కేసుల విచారణ సందర్భంగా రాష్ట్ర డీజీపీ స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మే 4 నాటి ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు వీడియో దిగ్ర్భాంతికరంగా ఉన్నదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నాయకత్వంలోని బెంచ్ పేర్కొన్నది.
ఈ ఘటన జరిగిన తేదీ, జీరో ఎఫ్‌ఐఆర్ దాఖలైన తేదీతోపాటు.. రెగ్యులర్ ఎఫ్‌ఐఆర్ నమోదైన తేదీలను తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నమోదైన ఆరువేల ఎఫ్‌ఐఆర్‌లలో ఎంత మంది నిందితులను గుర్తించారు? వారి అరెస్టుకు తీసుకున్న చర్యలేంటి? అనేది కూడా తెలుసుకోగోరుతున్నామని తెలిపింది.
ఉదాసీనంగా దర్యాప్తు
‘దర్యాప్తు ఉదాసీనంగా సాగుతున్నది. సుదీర్ఘకాలం తర్వాత ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేస్తున్నారు. అరెస్టులు ఉండటం లేదు.. స్టేట్‌మెంట్లు రికార్డు చేయడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, రాజ్యాంగ యంత్రాంగాలు మొత్తం కుప్పకూలాయి’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
‘వీడియో కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో చాలా జాప్యం జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తున్నది’ అని వ్యాఖ్యానించారు. తొలుత విచారణ మొదలైనప్పుడు మణిపూర్‌లో చోటు చేసుకున్న హింసకు సంబంధించి ఇప్పటి వరకూ మొత్తం 6,523 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయని కేంద్రం నివేదించింది.
కేంద్రం, మణిపూర్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరవుతూ.. వీడియో కేసులో రాష్ట్ర పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారని తెలిపారు. ఈ కేసులో ఒక మైనర్ సహా ఏడుగురిని అరెస్టు చేసినట్టు చెప్పారు.
వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పోలీసులు ఇద్దరు బాధిత మహిళల స్టేట్‌మెంట్‌లు రికార్డు చేసినట్టున్నారని పేర్కొన్నారు. అంతకు ముందు ఈ కేసులో విచారణ జరగాల్సి ఉన్నందున బాధిత మహిళల నుంచి సీబీఐ స్టేట్‌మెంట్‌లు రికార్డు చేయరాదని కోర్టు ఆదేశించింది.